Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 72 మంది రాజ్యసభ సభ్యులకు ముగిసిన పదవీకాలం
- తెలంగాణ నుంచి ఇద్దరు , ఏపీ నుంచి నలుగురు
- మళ్లీ రావాలి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: 72 మంది రాజ్యసభ సభ్యులకు ఘనంగా వీడ్కోలుపలికారు. గురువారం రాజ్యసభ చైర్మెన్ ఎం.వెంకయ్య నాయుడు మార్చి-జులై మధ్య పదవీ విరమణ పొందనున్న రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలుకుతూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, ఇతర సభా కార్యకలాపాలను చైర్మెన్ రద్దు చేశారు. రోజంతా సభ్యుల ప్రసంగాలు కొనసాగాయి. 72 మంది రాజ్యసభ సభ్యుల్లో 69 మంది 19 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏడుగురు నామినేటెడ్ సభ్యులుగా ఉన్నారు. అందులో తొమ్మిది మంది మహిళ రాజ్యసభ సభ్యులు ఉన్నారు. నలుగురు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రామచంద్ర ప్రసాద్ సింగ్‌లు, ఐదుగురు రాజ్యసభ పక్షనేతలు ప్రసన్న ఆచార్య (బీజేడీ), సంజరు రౌత్ (శివసేన), సతీష్ చంద్ర మిశ్రా (బీఎస్పీ), భల్వేంద్ర సింగ్ బుందల్ (ఎస్ఏడీ), విజయసాయి రెడ్డి (వైసీపీ)ల పదవీ కాలం పూర్తి అవుతుంది. ఎనిమిది రాజ్యసభ స్టాండింగ్ కమిటీ చైర్మెన్లు కూడా పదవీ విరమణ చేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి పదవీ విరమణ చేస్తున్నా వారిలో సుజనా చౌదరి, విజయసాయి రెడ్డి, టిజి వెంకటేష్, సురేష్ ప్రభు, డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మికాంతరావు ఉన్నారు. సీపీఐ(ఎం) ఎంపీలు కె. సోమప్రసాద్ (కేరళ), జర్నా దాస్ బైద్యా (త్రిపుర) ఉన్నారు. ఏప్రిల్‌లో ఆనంద్ శర్మ, ఏకె ఆంటోనీ, సుబ్రహ్మణ్య స్వామి, మేరీకోమ్, స్వపన్ దాస్ గుప్తా పదవీ విరమణ పొందనున్నారు. జూన్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సురేశ్ ప్రభు, ఎంజె అక్బర్, జైరాం రమేశ్, వివేక్ టంకా, విజరు సాయి రెడ్డి పదవీ కాలం ముగియనుంది. జులైలో కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం. అంబికా సోని, కపిల్ సిబల్, సంజరు రౌత్, ప్రఫుల్ పటేల్ తదితర నేతలు విరమణ చేయనున్నారు.
విలువైన సభ్యులు పదవీ విరమణ పొందుతున్నారని చైర్మెన్ ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. 27 మంది రెండు సార్లు అంతకంటే ఎక్కువ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారని తెలిపారు. వారి అనుభవం సభ కోల్పోతుందని తెలిపారు. ఏకే అంటోని, అంబికా సోని ఐదు సార్లు రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. ఆనంద్ శర్మ, సురేష్ ప్రభు, ప్రఫుల్ పటేల్ నాలుగు సార్లు రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. సుబ్రహ్మణ్య స్వామి, జైరాం రమేష్, ప్రసన్న ఆచార్య, సంజరు రౌత్, నరేష్ గుజ్రాల్, సుఖ్‌దేవ్ సింగ్ దిన్సా, సతీష్ చంద్ర మిశ్రాలు మూడు సార్లు సభకు ఎన్నిక అయ్యారు. మిగతా 15 మంది రెండు సార్లు సభకు ఎన్నికయ్యారు. వారి జ్ఞానం, అనుభవం కోల్పోతున్నామని అన్నారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ 'మీ అనుభవాలను దేశం నలుమూలకు తీసుకెళ్లండి. కొన్నిసార్లు చదువు కంటే అనుభవానికే ఎక్కువ శక్తి ఉంటుంది' అని అన్నారు. 'మన రాజ్యసభ సభ్యులకు అపారమైన అనుభవం ఉంది. మనం ఈ పార్లమెంట్‌లోనే ఎక్కువ సమయం. గడుపుతాం. ఈ సభ మన ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడింది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లలో ఎందరో మహానుభావులు తమ విజ్ఞానాన్ని మనకు పంచిపెట్టారు. ఇప్పుడు అది మన బాధ్యత. ఒక సభ్యుడిగా పొందిన అనుభవాన్ని.. దేశం నలుదిశలా వ్యాప్తి చేయండి' అని సూచించారు. పదవీ కాలం ముగిసి వెళ్లిపోతున్న సభ్యులు మళ్లీ రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
సీపీఐ(ఎం) ఎంపీ కె.సోమ ప్రసాద్ మాట్లాడుతూ ఈ సభకు వస్తానని తానెప్పుడూ అనుకోలేదని, తనను సభకు పంపించిన సీపీఐ(ఎం)కు ధన్యవాదాలని అన్నారు. తన ప్రజా జీవితంలో ఈ సభకు హాజరైనందున అనేక అనుభవాలు వచ్చాయని తెలిపారు. తానెప్పుడూ తమ పార్టీ తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని, అది తన బాధ్యతని అన్నారు. అందరూ తనకు సహకరించారని, అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. సీపీఐ(ఎం) ఎంపీ జర్నాదాస్ బైద్యా మాట్లాడుతూ తాను 2010లో సభకు ఎన్నికైనప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోన్నోళ్లు, అప్పుడు అధికారం పక్షంలోనూ, అప్పుడు ప్రతిపక్షంలో కూర్చోన్నోళ్లు ఇప్పుడు అధికార పక్షంలోనూ ఉన్నారని తెలిపారు. అప్పుడు ఐపీఎల్, కామన్ వెల్త్, 2జీ వంటి అంశాలపై నాడు ప్రతిపక్షంలో ఉన్న తాము లేవనెత్తామని, అప్పుడు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారని అన్నారు. అప్పుడు ప్రతిపక్షానికి, అధికార పక్షానికి అవకాశం ఉండేదని, ఇప్పుడు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వటం లేదని, తాను తీవ్రంగా దుఃఖిస్తున్నానని పేర్కొన్నారు. త్రిపురలో ఉన్న ఏకైక రాజ్యసభ స్థానానికి తమ పార్టీ తనను పంపిందని, అందుకు తమ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. వంద శాతం రిజర్వేషన్ తమ పార్టీ అమలు చేసిందని, అందుకు తమ పార్టీని అభినందించాలని పేర్కొన్నారు. 2010లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని, కానీ లోక్‌సభలో నాడు కాంగ్రెస్, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆమోదించలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు మహిళ రిజర్వేషన్ బిల్లు ఆమోదిస్తామని చెబుతున్నాయి, కానీ అధికారంలో వచ్చిన తరువాత మరిచిపోతున్నాయని విమర్శించారు. 12 ఏండ్ల పాటు ఎంపీగా ఉన్నానని, తనకు సొంత వాహనం కూడా లేదని అన్నారు. పార్లమెంట్‌కు వచ్చినప్పుడు పార్లమెంట్ వాహనాన్నే వాడేదాన్ని అని తెలిపారు. తాను ఎంపీగా పదవీ విరమణ పొందవచ్చుగానీ, ప్రజల కోసం, పేదల కోసం పని చేస్తానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాః విజయసాయి రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఆనాడు తమ మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లనే తాను రాజ్యసభకు రాగలిగానని వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ఛలోక్తి విసిరారు. వీడ్కోలు సభలో ఆయన మాట్లాడుతూ తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ చైర్మెన్‌గా క్రమశిక్షణ, విలువలను, సభా మర్యాదను కాపాడేందుకు కృషి చేస్తున్న మీ నాయకత్వంలో ఈ సభలో సభ్యుడిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, డిప్యూటీ చైర్మన్ హరి వంశ్నారాయణ్ సింగ్, మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ్ (జేడీఎస్), డెరిక్ ఓబ్రెయిన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), ప్రసన్న ఆచార్య (బీజేడీ), కే.కేశవరావు (టీఆర్ఎస్), ఎలమారం కరీం (సీపీఐ(ఎం), తంబి దొరై (అన్నాడీఎంకే), రామ్ గోపాల్ యాదవ్ (ఎస్పీ), ప్రేమ్ చంద్ర గుప్తా, మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), సతీష్ చంద్ర మిశ్రా (బీఎస్పీ), వందన చౌహాన్ (ఎన్సీపీ), అనిల్ దేశారు (శివసేన), ఆనంద్ శర్మ (కాంగ్రెస్), వైకో (ఎండీఎంకే), సంజరు సింగ్ (ఆప్), రామ్‌నాథ్ ఠాకూర్ (జేడీయూ), కనమేడల రవీంద్ర కుమార్ (టీడీపీ), జికె వాసన్ (టీఎంసీఎం), బిరేంద్ర ప్రసాద్ బైశ్య (ఏజీపీ), తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు సుజనా చౌదరి, టిజి వెంకటేష్, డి.శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.