Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు పెంచొద్దని హెచ్చరిక
- పెద్ద ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారని వ్యాఖ్య
న్యూఢిల్లీ : రష్యా నుంచి భారత్ ఆయిల్ దిగుమతులపై అమెరికా ఆగ్రహంతో ఉన్నది. రష్యా నుంచి భారత్ ఆయిల్ దిగుమతులు పెంచొద్దని హెచ్చరించింది. ఒక పక్క రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మరోపక్క భారత్‌లో రష్యా విదేశాంగ మంత్రి సెర్జే లావ్రోవ్ భారత్‌కు చేరుకున్న నేపథ్యంలోనే అమెరికా ఈ హెచ్చరికలు పంపడం గమనార్హం. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు భారత్‌కు ''పెద్ద ప్రమాదానికి (గ్రేట్ రిస్క్)'' గురి చేస్తుందని వాషింగ్టన్ వార్నింగ్ పంపింది. అయితే, ఈ ప్రమాదం గురించి స్పష్టత లేనప్పటికీ.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై అమెరికా ఆంక్షలు విధించొచ్చని తెలుస్తున్నది. గత ఏడాదుల్లో చేసుకున్న ఒప్పందాల ప్రకారం ప్రస్తుతం భారత్ రాయితీపై వచ్చే రష్యన్ ఆయిల్‌ను కొనుగోలుచేసింది. అయితే, భారత్ తన దిగుమతులలో ఎలాంటి పెరుగుదల ఉండొద్దన్నది అమెరికా హెచ్చరిక అని రాయిటర్స్ నివేదిక వివరించింది. ''ఉక్రెయిన్‌పై విధ్వంసకర యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేలా క్రెమ్లిన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు బలమైన ఆంక్షలతో సహా బలమైన సామూహిక చర్య యొక్క ప్రాముఖ్యతపై మేం భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా భాగస్వాములను నిమగం చేస్తూనే ఉన్నాం'' అని యూఎస్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుత ఆంక్షలను దాటవేయడానికి న్యూఢిల్లీ రూపాయి-రూబుల్ చెల్లింపు పథకాన్ని అన్వేషించడం కూడా యూఎస్ అధికారులకు ఆందోళన కలిగించదు. ''వారు ఏం చెల్లిస్తున్నా, వారు ఏమి చేస్తున్నా.. ఆంక్షలకు అనుగుణంగా ఉండాలి. కాకపోతే వారు తమను తాము పెద్ద ప్రమాదానికి గురిచేసుకుంటున్నారు. వారు ఆంక్షలకు కట్టుబడి కొనుగోళ్లను గణనీయంగా పెంచనంత కాలం మాకు ఓకే'' అని యూఎస్ వర్గాలు తెలిపినట్టు సమాచారం.
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. భారతదేశ క్వాడ్ భాగస్వాములైన యూఎస్, ఆస్ట్రేలియా రెండూ రష్యాతో భారతదేశ వాణిజ్య సంబంధాలను కొంత వరకు నిరాకరించాయి. ''ఇప్పుడు అమెరికాతో పాటు ఇతర దేశాలతో సరైన చరిత్ర వైపు నిలబడటానికి సమయం ఆసన్నమైంది. ఉక్రెయిన్ ప్రజలతో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం కోసం నిలబడి.. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధానికి నిధులు, మరియు ఇంధనం సహాయం చేయొద్దు'' అని యూఎస్ వాణిజ్య కార్యదర్శి గినా రైమాండో అన్నారు. ఇక, ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ టెహాన్ మాట్లాడుతూ.. రెండో ప్రపంచ యుద్ధకాలం నుంచి ఉన్న నిబంధనల విధానాన్ని కొనసాగించడానికి ప్రజాస్వామ్యాలు కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని నొక్కిచెప్పారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆయిల్ దిగుమతిదారు, వినియోగదారుగా ఉన్నది. ఫిబ్రవరి 24 నుంచి కనీసం 13 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. గతేడాది మొత్తం కేవలం 16 మిలియన్ బ్యారెళ్లుగా ఉన్నది.
ఢిల్లీ చేరిన రష్యా విదేశాంగ మంత్రి : నేడు మోడీ, జైశంకర్‌లతో కీలక భేటీ
రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్జీ లావ్రోవ్ గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. రష్యా నుంచి చైనా వెళ్లిన లావ్రోవ్..అక్కడి నుంచి భారత్‌కు వచ్చారు. రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్న లావ్రోవ్.. శుక్రవారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అంతకుముందే భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తోనూ ఆయన భేటీ అవుతారు. ఉక్రెయిన్‌పై సాగిస్తున్న యుద్ధంపై తొలిసారి కాస్తంత వెనక్కు తగ్గినట్టు కనిపించిన మరుక్షణమే బుధవారం నాడు లావ్రోవ్ భారత పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయంపై మోడీతో లావ్రోవ్ చర్చించే అవకాశాలున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఢిల్లీ పర్యటన భారత్, అమెరికా సంబంధాలను ప్రభావితం చేస్తుందా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. లావ్రోవ్ పర్యటనపై అమెరికా, ఆస్ట్రేలియాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో అభివద్ధి చెందుతున్న భద్రతా భాగస్వాముల మధ్య తీవ్ర విభేదాలకు లావ్రోవ్ పర్యటన బీజం వేస్తుందనే వాదనలు బలపడుతున్నాయి.