Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 రోజుల్లో రూ.6.40 పెంపు...
- అప్పుడు ప్రశ్నించారు ఇప్పుడేమో రోజూ పెంచుతున్నారు
- 'పెట్రో' ధరలపై కేటీఆర్ ట్వీట్ కొనసాగుతూనే ఉన్న చమురు బాదుడు
- భగ్గుమంటున్న పెట్రో ధరలు
న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా గురువారం కూడా పెట్రోల్, డీజిల్‌పై 80 పైసలు పెరిగాయి. గత 10 రోజుల్లో ధరను పెంచడం తొమ్మిదో సారి. కాగా.. ఈ పదిరోజుల్లో పెరిగిన లీటర్ పెట్రోల్ ధర రూ.6.40కి చేరింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.81కి చేరగా, డీజిల్ ధర రూ. 93.07గా ఉంది. ముంబయిలో పెట్రోల్ రూ.116.72, డీజిల్ రూ.100.94 కాగా, చెన్నైలో పెట్రోల్ రూ.107.45, డీజిల్ రూ.97.52గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.111.35, డీజిల్ రూ.96.22కి చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 115.42 కాగా, డీజిల్ ధర రూ. 101.58గా ఉంది. మార్చి 22 నుండి పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం 80 పైసల చొప్పున పెంచుతూనే ఉంది. దీంతో, సామాన్యుడు బయటకి వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
పెట్రోల్ ధరలను రోజురోజుకీ పెంచుతూ పోతున్న కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీపై ట్విటర్ వేదికగా గురువారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోడీ... పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై చేసిన ట్వీట్లను గుర్తు చేసుకోవాలని సూచించారు. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో మోడీ చేసిన ట్వీట్లను తాజాగా కేటీఆర్ రీట్వీట్ చేశారు. యూపీఏ ప్రభుత్వం పెట్రోల్ ధరలను భారీగా పెంచడంతో కోట్లాది మందిపై తీవ్ర ప్రభావం పడుతున్నదంటూ అప్పట్లో మోడీ ట్వీట్ చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ ఆయన చేసిన మరో ట్వీట్‌ను కూడా కేటీఆర్ రీట్వీట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ విషయాలను ప్రధాని మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. 'పెట్రో' ధరల విషయంలో కేంద్రం వైఫల్యం వల్ల రాష్ట్రాలపై తీవ్ర భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల అవసరాల పట్ల బాధ్యత లేకుండా బీజేపీ వ్యవహరిస్తున్నదని తెలిపారు. అధికారం కోసం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణలో ఇంటింటికి నల్లా కనెక్షన్‌ను తామే ఇచ్చామంటూ బీజేపీ అబద్ధపు ప్రచారం చేస్తోందని తెలిపారు. మిషన్ భగీరథ పథకంలో కేంద్రం వాటా ఎంతుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జీరో సహకారం అందించి (ఎలాంటి సహాయం చేయకుండా) ప్రచారం చేసుకోవడం ప్రధాని స్థాయికి తగదని కేటీఆర్ ఈ సందర్భంగా విమర్శించారు.