Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఎంపీలకు కార్మిక సమస్యలు తెలియవు
- కార్మికవర్గం నుంచి వచ్చిన వారు అధికారపార్టీలో లేరు
- బిఎంఎస్ కూడా మోడీ సర్కార్ విధానాలను వ్యతిరేకిస్తున్నది
- కార్పొరేట్లు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు తయారు చేసిన విధానాలను ప్రభుత్వం అమలుచేస్తున్నది: రాజ్యసభలో సీపీఐ(ఎం) పక్షనేత ఎలమారం కరీం
న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీలకు కార్మిక సమస్యల గురించి తెలియదనీ, కార్మిక వర్గం నుంచి ఎంపీలుగా అయిన వారు అధికార బీజేపీలో ఒక్కరు కూడా లేరని సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత ఎలమారం కరీం అన్నారు. మోడీ సర్కార్ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను బీజేపీ అనుబంధ బీఎంఎస్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని గుర్తుచేశారు. లేబర్ కోడ్లతో కార్మిక హక్కులు హననమవుతున్నాయని చెప్పారు. రాజ్యసభలో ఎలమారం కరీం మాట్లాడుతూ ''కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చాలా సున్నితమైన వ్యక్తి, ఆయనను ఏ సమయంలోనైనా ఎవరైనా కలవొచ్చు. అయితే ఆ గుణాలు మాత్రం కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు పనికి రావు. దురదృష్టవశాత్తు అధికార పార్టీ ఎంపీల్లో ఒక్కరూ కూడా కార్మికసంఘాల నుంచి వచ్చిన వారులేరు. అధికార పార్టీ సభ్యులకు ఒక్కరికీకార్మిక సమస్యల గురించి అవగాహన లేదు. కార్మిక సమస్యలంటే కేవలం కూలీ, పని, అభివృద్ధి వంటి వాదనలు మాత్రమే కాదు'' అన్నారు. ''2018 నుంచి చూస్తున్నా.... బడ్జెట్ ప్రతాలు, ప్రధాన మంత్రి ప్రసంగాలు, రాష్ట్రపతి ప్రసంగాల్లో కార్మిక సంక్షేమం, కార్మిక భద్రత గురించి ఒక్క పదం కూడా లేదు. కావాలంటే చూసుకోండి. ప్రభుత్వ విధానమే అది. కార్పొరేట్లు, అంతర్జాతీయ పెట్టుబడుదారులు తయారుచేసిన పాలసీని ఈ ప్రభుత్వం అమలుచేస్తుంది. ఈజీ డూయింగ్ బిజినెస్ పేరుతో ఉపాధిని పక్కకు నెట్టేశారు'' అని విమర్శించారు. ''దేశంలో 58 కోట్ల మంది కార్మికులున్నారు. అందులో కేవలం ఐదు కోట్లు మంది మాత్రమే సంఘటిత రంగంలో పని చేస్తున్నారు. మిగిలిన 53 కోట్లు మంది అసంఘటిత రంగంలోనే ఉన్నారు. జీడీపీలో 50శాతం ఈ అసంఘటిత రంగమే ఉత్పత్తి చేస్తుంది. ఏడేండ్లలో మీ ప్రభుత్వం ఏం చేసిందంటే... 29 కార్మిక చట్టాలను సవరిస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) కన్వెన్షన్స్‌కు చాలా గౌరవం ఇస్తాం. కానీ ఈ లేబర్ కోడ్లు ఐఎల్ఓ కన్వెన్షన్స్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి'' అని తెలిపారు. ''లేబర్ కోడ్స్‌లో కనీస వేతనం సూత్రం ఎక్కడుంది? ఇప్పుడు కొత్త వేతన విధానాన్ని తీసుకొచ్చారు. రోజుకు రూ.202 కనీస వేతనం. ఇది చాలా దారుణం'' అని తెలిపారు. ''కార్మికుల హక్కుల పరిరక్షణకు పరిశ్రమల్లో లేబర్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చాలా ముఖ్యం. లేబర్ ఇన్స్పెక్టర్ పరిశ్రమకు వెళ్లి పని చేసే సైట్‌ను సందర్శించి, రికార్డులు తనిఖీ చేయాలి. కానీ ఇప్పుడు లేబర్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేయనవసరం లేదని లేబర్ కోడ్లు చెబుతున్నాయి. లేబర్ ఇన్స్పెక్టర్ పేరును ఫెసిలిటేటర్‌గా మార్చేశారు. ఎవరికీ ఫెసిలిటేటర్‌గా ఉంటారు. కార్మికులకా? లేక యజమానికా?'' అని ప్రశ్నించారు. ''సంఘ పరివార్ కుటుంబ సభ్యురాలైన భారతీయ మజ్దూర్ సంఫ్‌ు (బీఎంఎస్) 2022 జనవరి 4న బీఎంఎస్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసింది. ఆ లేఖలో 'మీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, వ్యూహాత్మక అమ్మకాలు, కార్పొరేటీకరణ, మోనిటైజేషన్ చేస్తున్నారు. అవి విలువైన జాతీయ ఆస్తులు. అప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శించాం. ఇప్పుడు మీరూ అదే చేస్తున్నారు'' అని విమర్శలు చేసింది. ఈ విమర్శలు చేస్తున్నది మేం కాదు. మీ కుటుంబ సభ్యురాలైన బీఎంఎస్'' అని తెలిపారు. ''మార్చి 28, 29 దేశవ్యాస్త సార్వత్రిక సమ్మె జరిగింది. సమ్మెను వ్యతిరేకిస్తూ బీఎంఎస్ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఒక్క బీఎంఎస్ సభ్యుడు కూడా వ్యతిరేకించలేదు. కేరళలో చాలా ప్రాంతాల్లో బీఎంఎస్ సభ్యులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. యూపీఏ ప్రభుత్వ హయంలో బీజేపీ, బీఎంఎస్ స్వదేశీ జాగరన్ మంచ్ ఏర్పాటు చేశాయి. విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించారు. ప్రతిదాన్ని వ్యతిరేకించారు. కానీ 2014 తరువాత దేశంలో ఏం జరుగుతుంది?'' అని ప్రశ్నించారు. ''లేబర్ కోడ్ల ఆధారంగా కేరళ హైకోర్టు సమ్మెను నిషేధించింది. కార్మిక సమస్యలపై స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవంగా సిఫార్సులు చేసింది. ఆ స్టాండింగ్ కమిటీలో తనతో పాటు మెజార్టీ సభ్యులు అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు. కానీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులు ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. అలాంటప్పుడు స్టాండింగ్ కమిటీలు ఎందుకు? వాటికి ఖర్చు ఎందుకు'' అని పశ్నించారు. కార్మికులు దేశ సంపద సృష్టిస్తున్నారనీ, ఆహార ధాన్యాల ఉత్పత్తి చేస్తున్నారని అన్నారు. ఇండియన్ లేబర్ కాన్ఫెరెన్స్ అంబేద్కర్ స్థాపించారని, దాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి సూచించారు.