Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో ..
- అసోంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటు వృథా
- బ్యాలెట్ పేపర్‌పై ''1''కు బదులు వన్
- ఏడుగురు ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్
- పంజాబ్‌లో ఆప్ ఖాతాలో ఐదు
న్యూఢిల్లీ : అసోంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటు వృధా అయింది. ఆ ఎమ్మెల్యే బ్యాలెట్ పేపర్‌పై ''1''కు బదులు వన్ అని రాయడంతో ఆయన ఓటు చెల్లుబాటు కాలేదు. దీంతో కాంగ్రెస్ రాజ్యసభ స్థానాన్ని కోల్పోయింది. అసోంలో రెండు స్థానాలకు ఒక స్థానాన్ని బీజేపీ సొంతం చేసుకోగా, రెండో స్థానాన్ని బీజేపీ మిత్రపక్షం యూపీపీఎల్ దక్కించుకుంది. కేరళలో మూడు స్థానాలకుగానూ అన్ని ఏకగ్రీవమయ్యాయి. రెండు ఎల్డీఎఫ్, ఒకటి యూడీఎఫ్ సొంత చేసుకున్నాయి. ఎల్డీఎఫ్లో సీపీఐ(ఎం), సీపీఐ చెరో స్థానాన్ని దక్కించుకోగా, యూడీఎఫ్‌లో కాంగ్రెస్ ఒక స్థానాన్ని దక్కించుకుంది. పంజాబ్‌లో ఐదు స్థానాలకు అన్నింటిని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కైవశం చేసుకుంది. త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌ల్లో ఒక్కొస్థానానికి ఎన్నిక జరగగా, అన్నింటిని బీజేపీ దక్కించుకుంది. ఆరు రాష్ట్రాల్లో 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగగా, ఆప్ ఐదు, బీజేపీ నాలుగు, సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, యూపీపీఎల్ తలొక్కటి గెలుచుకున్నాయి. అసోంలో రెండు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థి పబిత్రా మార్గెరిటా విజయం సాధించింది. రెండో స్థానం కోసం పోటీ నెలకొంది. కాంగ్రెస్ తరపున రిపున్ బోరా పోటీ చేయగా, బీజేపీ మిత్ర పక్షమైన యూపీపీఎల్ అభ్యర్థి రుంగ్వ్రా నార్జారీ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రిపున్ బోరాకు ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) మద్దతు ఇచ్చింది. ఒక స్థానాన్ని గెలవాలంటే ఏ అభ్యర్థికైనా 43 ఓట్లు కావాలి. 126 ఓట్లు ఉన్న అసెంబ్లీలో బీజేపీ, దాని మిత్ర పక్షాలకు 82 సీట్లు ఉన్నాయి. బీజేపీ (63), ఏజీపీ (9), యూపీపీఎల్ (7), బీపీఎఫ్ (3) సీట్లు ఉన్నాయి. అసెంబ్లీలో ఉన్న సీట్లు ప్రకారం బీజేపీ ఒక స్థానాన్ని సులువుగా గెలుచుకుంది. ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి పబిత్రా మార్గెరిటా (46 ఓట్లు)ని నిలబెట్టారు. అయితే రుంగ్వ్రా నార్జారీ నాలుగు ఓట్లు తక్కువ వస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌కు 27 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన ఏఐయూడీఎఫ్ 15 స్థానాలు ఉన్నాయి. ఒక సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రిపున్ బోరా గెలుపు కూడా సాధ్యమే. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సిద్ధిక్ అహ్మద్‌పై సస్పెన్షన్ వేటు పడటంతో రిపున్ బోరాపై తీవ్ర ప్రభావం పడింది. ఆయన బ్యాలెట్ పేపర్‌పై ''1'' అంకె వేయాల్సి ఉండగా, ఇంగ్లీష్‌లో ఓఎన్ఈ (వన్) అని రాశారు. దీంతో ఆయన ఓటు చెల్లుబాటు కాలేదు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన ఏఐయూడీఎఫ్కి చెందిన ఏడుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో రిపున్ బోరాకు 35 ఓట్లు వచ్చాయి. బీజేపీ మిత్రపక్షం యుపిపిఎల్ అభ్యర్థి రుంగ్వ్రా నార్జారీకి 44 ఓట్లు వచ్చాయి. దీంతో రుంగ్వ్రా నార్జారీ గెలిచారు. సిద్ధిక్ అహ్మద్ ఉద్దేశపూర్వకంగానే మూడు లైన్ల విప్‌ను ధిక్కరించారని, అలాగే బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఏఐయూడీఎఫ్‌కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి ఓటు వేశారని కాంగ్రెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ''మేము అహ్మద్‌ను ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేసాం. అతనిని అసెంబ్లీ నుండి అనర్హులుగా ప్రకటించాం. మా అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి బదులుగా, ఏఐయూడీఎఫ్ మాకు, మా అభ్యర్థికి ద్రోహం చేసింది'' అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ భూపేన్ కుమార్ బోరా అన్నారు. నాగాలాండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, అసోంలో నాలుగు స్థానాలను దక్కించుకున్న బీజేపీ రాజ్యసభలో తొలిసారిగా 100 మార్కుకు చేరుకుంది. ఈ నాలుగు స్థానాలను కైవశం చేసుకోవడంతో రాజ్యసభలో బీజేపీ బలం 101కు చేరింది. 245 మంది సభ్యులతో కూడిన సభలో మెజారిటీ తక్కువగా ఉన్నప్పటికీ, 2014 ఎన్నికలలో లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి బీజేపీ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇందులో క్రాస్ ఓటింగ్, ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుగులు వంటి అనేక అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. 2014లో రాజ్యసభలో బీజేపీ బలం 55 కాగా, ఆ పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో అప్పటి నుంచి క్రమంగా పుంజుకుంది. రాజ్యసభలో చివరిసారిగా 100 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు 1988లో అప్పటి పాలక కాంగ్రెస్‌కు 108 మంది సభ్యులు ఉన్నారు. 1990 ద్వైవార్షిక ఎన్నికలలో దాని సంఖ్య 99కి పడిపోయింది. రాష్ట్రాల ప్రభావం తగ్గుముఖం పట్టడంతో క్రమంగా క్షీణించింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారి కాంగ్రెస్‌కు ఈశాన్య భారతం నుంచి ఒక్క రాజ్యసభ ఎంపీ లేకుండా పోయింది. పంజాబ్‌లో భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పటికే ఐదు రాజ్యసభ స్థానాలను ఏకపక్షంగా కైవసం చేసుకుంది. పంజాబ్ నుంచి కొత్త ఆప్ రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, అశోక్ మిట్టల్, సంజీవ్ అరోరా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. కేరళలోని మూడు స్థానాల్లో అధికార ఎల్డీఎఫ్ రెండు స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎల్డీఎఫ్ తరఫున డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) జాతీయ అధ్యక్షుడు ఎ ఎ రహీమ్, సీపీఐ కన్నూర్ జిల్లా కార్యదర్శి పి సంతోష్ కుమార్, ప్రతిపక్షాల తరపున కేరళ మహిళా కాంగ్రెస్ చీఫ్ జెబి మాథర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. త్రిపుర బీజేపీ అధ్యక్షుడు మాణిక్ సాహా 40 ఓట్లతో రాష్ట్రంలోని ఏకైక రాజ్యసభ స్థానానికి ఎన్నికయ్యారు. అతని ప్రత్యర్థి అభ్యర్థి సీపీఐ(ఎం) అభ్యర్థి భాను లాల్ సాహాకు 15 ఓట్లు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీలో తగినంత సంఖ్య లేకపోవడంతో కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్, బీజేపీ అభ్యర్థి సికిందర్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగాలాండ్‌లో బీజేపీ నేత ఎస్. కొన్యాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.