Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిటీ ఏర్పాటుకు పేర్లు ఇవ్వాలన్న కేంద్రం
- అంశాల స్పష్టతలేకుండా పేర్లు ఇవ్వలేం:ఎస్కేఎం
న్యూఢిల్లీ : కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కమిటీపై స్పష్టత ఇవ్వాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) డిమాండ్ చేసింది. ఎంఎస్పీ కమిటీ ఏర్పాటుకు ఎస్కేఎం నుంచి పేర్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరాగా, కమిటీపై తాము లేవనెత్తిన అంశాలపై స్పష్టత ఇవ్వకుండా తాము పేర్లు ఇవ్వలేమని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఎస్‌కెఎం నేతలు దర్శన్ పాల్, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లేవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, శివకుమార్ శర్మ (కాక్కా జీ), యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ ప్రకటన విడుదల చేశారు. ప్రతిపాదిత కమిటీ గురించి ఎస్‌కెఎం లేవనెత్తిన ప్రశ్నల నుంచి ప్రభుత్వం తప్పించుకుంటుందని విమర్శించారు. ఎస్కేఎం కమిటీ ఆదేశాలు, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) తెలియకపోవడంతో కమిటీకి తన ప్రతినిధుల పేర్లను ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్టు పేర్కొన్నారు. 2021 డిసెంబర్ 9న ఇచ్చిన హామీ లేఖలో పేర్కొన్న కమిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేసిందని విమర్శించారు. డిసెంబర్ నెలలో ఈ కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అందరికీ తెలిసిందే. ప్రభుత్వ హామీలను అమలు చేయనందుకు నిరసనగా జనవరి 31న ఎస్కేఎం ద్రోహ దినంగా పాటించిందని గుర్తు చేశారు. 2022 మార్చి 22న ఎస్కేఎం సమన్వయ కమిటీ సభ్యుడు యుధ్వీర్ సింగ్‌కు వ్యవసాయ కార్యదర్శి సంజరు అగర్వాల్ నుంచి కాల్ వచ్చిందని, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కమిటీకి ఎస్కేఎం నుంచి ఇద్దరు ముగ్గురు పేర్లను ఆహ్వానించారని తెలిపారు. ఏదేమైనప్పటికీ, కమిటీ గురించి కీలకమైన వివరాలను స్పష్టం చేయడంలో మౌఖిక సంభాషణ విఫలమైందని, దాని సభ్యులు, దాని ఆదేశం, టీఓఆర్, దాని విధి విధానాలు స్పష్టం చేయలేదని తెలిపింది. మార్చి 25న సంజరు అగర్వాల్‌కి ఐదు ప్రశ్నలతో కూడిన ఎస్కేఎం మెయిల్ చేసింది.
1. ఈ కమిటీ టీఓఆర్ (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) ఏమిటి?
2. సంయుక్త కిసాన్ మోర్చా కాకుండా, ఈ కమిటీలో ఏ ఇతర సంస్థలు, వ్యక్తులు, ఆఫీస్ బేరర్లు చేర్చబడతారు?
3. కమిటీకి ఎవరు చైర్మెన్‌గా ఉంటారు. దాని పనితీరు ఎలా ఉంటుంది?
4. కమిటీ తన నివేదికను సమర్పించడానికి ఎంత సమయం తీసుకుంటుంది?
5. కమిటీ సిఫారసులకు ప్రభుత్వానికి కట్టుబడి ఉంటుందా?
దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని ఎస్కేఎం నేతలు పేర్కొన్నారు. ఎంఎస్పీ పై కమిటీ తప్పనిసరిగా స్పష్టమైన, అంగీ కరించిన నిబంధనలపై ఏర్పాటు చేయబడుతుందని ఎస్కేఎం ఆశించిందని తెలిపారు. కమిటీ వివరాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసిందని పేర్కొన్నారు. ఈ కమిటీ స్వభావం, ఎజెండా గురించి తమకు పూర్తిగా అవ గాహన ఉంటే తప్ప, అటువంటి కమిటీలో పాల్గొనలేమని స్పష్టం చేసింది.