Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాణిజ్య సిలిండర్‌పై రూ.250 పెంపు
- హోటల్స్, టీ అమ్మకందార్లపై మోయలేని భారం
న్యూఢిల్లీ : వాణిజ్య(కమర్షియల్) ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా పెరిగింది. మార్చి-1న రూ.105 పెంచిన కేంద్రం, మళ్లీ ఏప్రిల్ 1న రూ.250 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ ఎల్పీజీ ధరలు హైదరాబాద్ సహా పలు నగరాల్లో రూ.2250దాటింది. పెంపు నిర్ణయం గత సోమవారం తీసుకోగా, ఏప్రిల్1 నుంచి అమల్లోకి వచ్చింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.2253, ముంబయిలో రూ.2205, కోల్‌కతాలో రూ.2351, చెన్నైలో రూ.2406కు చేరుకున్నాయి. గత రెండు నెలల్లో కమర్షియల్ ఎల్పీజీ ధరను కేంద్రం రూ.346 పెంచింది. ఈ ధరల పెంపు ముఖ్యంగా చిన్న చిన్న హోటల్స్, తినుబండారాల తయారీదారులు, టీ, కాఫీ సెంటర్లు, రెస్టారెంట్స్..మొదలైనవాటిపై తీవ్ర ప్రభావం పడనున్నది. అంతేగాక ఆహార పదార్థాల ధరలూ పెరగడానికి అవకాశముంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయ్యేంతవరకు ధరల పెంపును ఆపిన కేంద్రం, మార్చి 22నుంచి ఇంధన ధరల్ని, వంటగ్యాస్ ధరల్ని పెంచుతూ వస్తోంది. ధరల పెంపు సామాన్యులపై పడుతుందని, తినుబండారాలు, ఆహార పదార్థాలు కొనలేనంత భారంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.