Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్
- ధాన్యం కొనాలని రాజ్యాంగంలో ఉంది : కె.కేశవరావు
న్యూఢిల్లీ : బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం)ను సేకరించలేమని పదేపదే స్పష్టంగా చెబుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే రీతితో వ్యవహరిస్తోందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఆరోపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రులు సైతం బెదిరించారని తెలంగాణ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. ముడిబియ్యం ఇస్తామని మాత్రమే లేఖ రాసిచ్చి ఇప్పుడు కొత్తగా ధాన్యాన్ని సేకరించాలంటూ కొత్త పల్లవి అందుకున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం విధించిన నాణ్యతా ప్రమాణాల మేరకు ఎంతైనా రారైస్ తీసుకునేందుకు సిధ్దంగా ఉన్నామని ప్రకటించారు. శుక్రవారం రాజ్యసభలో ధాన్యం సేకరణ అంశంపై బీజేపీ ఎంపీ జి.వి.ఎల్. నరసింహారావు, ఒరిస్సాకు చెందిన బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రా, టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు ప్రశ్నలకు పియూష్ గోయల్ సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల తెలంగాణలో ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చల అంశాలను, కేంద్ర విధానాన్ని పియూష్ గోయల్ ప్రస్తావించారు. ''సభలో బాయిల్డ్ రైస్ అంశం పదేపదే ప్రస్తావనకు వస్తోంది. ఈ విషయంలో కేంద్రం ఓ స్థిరమైన, స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ధాన్యం సేకరణపై ఎఫ్‌సీఐ అన్ని రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుంది.అందులో రాష్ట్రాలు తమ సొంత అవసరాలు, పథకాల కు ఎలాంటి బియ్యం అవసరం అనుకుంటే ఆ బియ్యాన్ని తీసుకోవచ్చు అని స్పష్టంగా చెప్పాం.ఒకవేళ రాష్ట్రాల అవసరాలకు మించి ఎక్కువగా ఉన్న బియ్యాన్ని సెంట్రల్ ఫూల్ కింద ఇవ్వాలనుకుంటే గత కొన్నేళ్లుగా కొనసాగుతు న్న విధానానికి అనుగుణంగా దేశ వ్యాప్తంగా ఏ బియ్యం అవసరం ఎక్కువగా ఉందో, రాష్ట్రాల్లో ఏ బియ్యాన్ని అయితే కావాలని అనుకుంటున్నారో అదే బియ్యాన్ని ఎఫ్‌సిఐకి ఇవ్వాలని చెప్పాం. ప్రస్తుతం దేశంలో బాయిల్డ్ రైస్ నాలుగైదు ఏళ్లకు సరిపడ నిల్వలు గోదాముల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు ముందుగానే రారైస్ ఇవ్వాలని సూచనలు చేశాం. దీనినే ఎఫ్‌సిఐ తీసుకుంటుందని చెప్పాం'' అని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
రాజ్యాంగంలో ఉంది : కె.కేశవరావు
ధాన్యం కొనుగోలు చేయాలని రాజ్యాంగంలో ఉందని ఎంపీ కె.కేశవరావు అన్నారు. ''కేంద్రంతో చాలా మార్లు చర్చించినప్పటికీ ధాన్యంపై అయోమయాన్ని తొలగించడం లేదు. డీసీపీ విధానంలో ధాన్యాన్ని రాష్ట్రం సేకరించి మిల్లింగ్ చేసి కేంద్రానికి అందిస్తుంది. ఈ ధాన్యానికి రాష్ట్రం జూన్‌లో డబ్బులు చెల్లిస్తే, రాష్ట్రానికి కేంద్రం ఆగస్టులో ఇస్తుంది. ఎంవోయూ, రాజ్యాంగం, చట్టంలో ధాన్యం సేకరించాలని ఉంది. అంతేతప్ప ఎక్కడా బియ్యం సేకరలించాలని లేదు. అది ఎలాంటి ధాన్యం అయినా కేంద్రం సేకరించాలి'' అని పేర్కొన్నారు. దీనిపై కేంద్రమంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ ''తెలంగాణ ప్రభుత్వం బాయిల్డ్ రైస్ ఇవ్వబోం, రారైస్ మాత్రమే ఇస్తామని రాసిచ్చింది. ఇప్పుడు ధాన్యం సేకరించాలని కొత్త కథ మొదలుపెట్టింది. తరతరాలుగా కేంద్రం బియ్యం సేకరిస్తూ వస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి సైతం లేఖ రాశారు. అందులో పంజాబ్ తరహాలో సేకరించాలని కోరారు. అదే తరహాలో సేకరిస్తున్నాం. అయినప్పటికీ పదేపదే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. నిరాధారమైన నిందలు వేస్తున్నారు. సత్యదూరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ నుంచి వచ్చే రారైస్‌ను కేంద్రం తప్పకుండా కొంటుంది. రాష్ట్రంలో రైతులను తప్పుదోవ పట్టించేలా చేస్తున్న చర్యలన్నీ ఖండించతగ్గవి'' అని పేర్కొన్నారు.