Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో ఈ రంగానికి తక్కువ కేటాయింపులు
- ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించింది: పార్లమెంటరీ ప్యానెల్ ఆందోళన
న్యూఢిల్లీ : బడ్జెట్లో ఆరోగ్య రంగానికి ''తక్కువ ప్రాధాన్యత'' ఇవ్వడంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వంలోని కమిటీ, '' ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు మొత్తం 2022-23 బడ్జెట్ అంచనాలు (బీఈ) లో 2.1 శాతం'' అని వివరించింది. 2022-23లో ప్రభుత్వం మొత్తం బడ్జెట్ వ్యయంలో రక్షణ మంత్రిత్వ శాఖకు 13.3 శాతంగా ఉన్నదని పేర్కొన్నది. గతనెల 24న రాజ్యసభలో ఆరోగ్యం, సంక్షేమంపై స్టాండింగ్ కమిటీ 134వ నివేదికను కమిటీ సమర్పించింది. '' పరిమిత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిధులతో భారతదేశం వంటి దేశానికి వనరుల సమీకరణ పెద్ద సవాలుగా ఉన్నదని కమిటీ గ్రహించింది. అయితే, ఇది ప్రభుత్వాలు తమ ఆరోగ్య వ్యయాన్ని పెంచకుండా, ఆరోగ్య రంగానికి తక్కువ ప్రాధాన్యతనివ్వకుండా నిరోధించకూడదు'' అని పేర్కొన్నది. 2022- 2023లో ఆరోగ్య సంరక్షణపై కంటే రక్షణ కోసం భారత్ ఆరు రెట్లు ( 6.09 రెట్లు) ఖర్చు చేస్తుందని మంత్రిత్వ శాఖల బడ్జెట్ నిబంధనల విశ్లేషణ చూపుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి రూ. 5,25,166.15 కోట్లు కేటాయిస్తే.. ఆరోగ్య బడ్జెట్ రూ. 82,600.65 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. 2022-23 మొత్తం బడ్జెట్ వ్యయం రూ. 39.45 లక్షల కోట్లు. గతేడాది ఆరోగ్యానికి రూ. 73,931.77 కోట్లు కేటాయించగా, రక్షణ బడ్జెట్ రూ. 4,78,195.62 కోట్లుగా ఉన్నది. అంటే ఆరోగ్యం కంటే రక్షణ బడ్జెట్ కేటాయింపులు 6.46 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఆరోగ్య బడ్జెట్లో వాటా పెరుగుదల నెమ్మదిగా ఉండటం పట్ల తాము సంతోషంగా లేమని కమిటీ చెప్పింది. 2021-22కి సవరించిన ఆరోగ్య బడ్జెట్ రూ. 86,000.65 కోట్లతో పోలిస్తే, 2022-23లో ఆరోగ్యానికి కేటాయించిన మొత్తంరూ. 200 కోట్లు మాత్రమే పెరగటం గమనార్హం. ఈ కమిటీలో అధికార బీజేపీకి చెందిన 13 మందితో సహా 30 మంది సభ్యులున్నారు. ఆరోగ్య మౌలిక సదుపాయాల పేలవమైన స్థితి గురించి కూడా కమిటీ లేవనెత్తింది. కోవిడ్-19 నేపథ్యంలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం పట్ల నిరాశను వ్యక్తం చేసింది. ఆరోగ్యం రంగంపై ప్రభుత్వ దృష్టి, విధానపరమైన జోక్యం అవసరమని వివరించింది. గత ఐదేండ్లలో ఢిల్లీ, పుదుచ్చేరి మినహా ఏ రాష్ట్రమూ తమ మొత్తం బడ్జెట్లో ఎనిమిది శాతానికి మించి ఆరోగ్య బడ్జెట్లో వాటాను పెంచలేదని కమిటీ వెల్లడించింది.