Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27 రోజులుగా అభ్యర్థుల ఆమరణ నిరాహార దీక్ష
- రిక్రూట్మెంట్ త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్
న్యూఢిల్లీ : పారామిలటరీ బలగాల్లోని నియామకాల్లో జరుగుతున్న ఆలస్యంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 27 రోజులుగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆమరణ నిరాహార దీక్షను చేస్తున్నారు. వీరికి దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి మద్దతు లభిస్తున్నది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ (ఎస్ఎస్సీ జీడీ) కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరైన వంద మంది అభ్యర్థుల్లో కేశవ్ జాదవ్ ఒకరు. సంవిధాన్ చౌక్‌లో గత 27 రోజులుగా జరుగుతున్న ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. పోస్టుల భర్తీలో జరిగిన విపరీతమైన జాప్యానికి వ్యతిరేకంగా ఈ చర్యకు దిగారు. '' మేము నిరసనలు చేశాం. ప్రభుత్వానికి లేఖలు రాశాం. అధికారులను కలిశాం. సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృత ప్రచారాన్ని నిర్వహించాం. అయినా ఫలితం లేదు. నాలుగేండ్ల నిరసనలు, అభ్యర్థనల అనంతరం ఆమరణ నిరాహార దీక్షకు దిగాం. ఇది తప్ప మాకు వేరొక మార్గం లేదు'' అని యాదవ్ అన్నారు. కాగా, సామాజిక మాధ్యమాల్లో వీవరి ప్రచారం 1.57 లక్షల ట్వీట్లతో అగ్రస్థానంలో ఉన్నది. 2018లో 60,201 ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు 18-23 ఏండ్ల మధ్య వయసున్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే, ఏదైనా ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌ను తొమ్మిది నెలల్లోగా పూర్తి చేయాలనే నియమానికి విరుద్ధంగా ఎన్ఐఏ, ఎఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌ను మూడేండ్ల పాటు లాగారు. దీంతో ఇప్పటికీ నియామక ప్రక్రియ పూర్తిగా జరగకపోవడంపై అభ్యర్థులు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీరుపై ఆగ్రహాన్ని తెలిపారు. నియామక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.