Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోహరించిన 600 మంది పోలీసులు, నలుగరు ఐపీఎస్ అధికారులు
జైపూర్ : రాజస్థాన్లోని కరౌలీ నగరంలో పోలీసు అధికారులు కర్ఫ్యూ విధించారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం నుంచి హిందూత్వ శక్తుల బైక్ ర్యాలీ వెళ్తున్న సందర్భంలో మత ఘర్షణలు చెలరేగాయి. దీంతో అక్కడ హింసాత్మక పరిస్థతులు తలెత్తాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి ఇక్కడ కర్ఫ్యూను విధించారు. కొందురు వ్యక్తులు ఇక్కడి దుకాణాలను ధ్వంసం చేశారు. వాహనాలను తగులబెట్టారు అని పోలీసులు చెప్పారు. హిందూత్వ శక్తులు బైక్ ర్యాలీ నిర్వహించిన సందర్భంలోనే ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 36 మందిని నిర్బంధించినట్టు శాంతి భద్రతల అదనపు డీజీ హవా సింగ్ ఘుమారియా తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు చెప్పారు. ఇక్కడ చెలరేగిన హింసలో ఇరువర్గాలకు చెందిన 35 మంది గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నదని ఘుమారియా తెలిపారు. ఇక్కడ మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చెలరేగకుండా 600 మంది పోలీసులు, నలుగురు ఐపీఎస్ అధికారులు మోహరించారు. అసత్య వార్తలకు అడ్డుకట్ట వేయడానికి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపడానికి అదనపు ఎస్పీ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు డీఐజీ రాహుల్ ప్రకాశ్ తెలిపారు. శాంతి, భద్రతల విషయంలో ప్రజలు సంయమనం పాటించాలనీ, దుండగుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు.