Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైర్ల ఉత్పత్తిదారులపై చర్యలు తీసుకోవాలి
- రబ్బరు బిల్లుకు వ్యతిరేకంగా పోరుకు ఏఐకేఎస్ పిలుపు
న్యూఢిల్లీ : రబ్బరు రైతులను దోపిడి చేస్తున్న టైర్ల ఉత్పత్తిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ ధావలే, హన్నన్ మొల్లా ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కార్టలైజేషన్, పోటీ చట్టాలతో పాటు ఇతర తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడినందుకు అపోలో టైర్స్, ఎంఆర్ఎఫ్, కాంటినెంటల్, సీట్ వంటి నాలుగు టైర్ తయారీ కంపెనీలపై చట్టపరమైన చర్య తీసుకోవాలనే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్ణయాన్ని ఏఐకేఎస్ స్వాగతించిందని తెలిపారు. సీసీఐ అపెక్స్ కాంపిటీషన్ రెగ్యులేటర్ 2022 మార్చి 30 ఆయా కార్పొరేట్ కంపెనీలు, ప్రముఖ డీలర్ల కార్యాలయపై తనిఖీలు నిర్వహించిందనీ, కార్పొరేట్ లాబీయింగ్ సంస్థ ఆటోమోటివ్ టైర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఏటీఎంఏ) కూడా ధరల నిర్ణయానికీ, సరఫరా నియంత్రణలో ఈ కార్పొరేట్లకు సహాయం చేసినందుకు దోషిగా తేలిందని అన్నారు. దేశంలోని 90శాతం టైర్ల తయారీని సీసీఐ స్కానర్‌లో ఉన్న, ఆయా కార్పొరేట్ సంస్థలచే నియంత్రించబడటం గమనార్హమని పేర్కొన్నారు. అంతకుముందు ఎంఆర్ఎఫ్పై రూ.622.09 కోట్లు, అపోలో టైర్స్‌పై రూ. 425.53 కోట్లు, సీఈఏటీ లిమిటెడ్‌పై రూ.252.16 కోట్లు, జెకె టైర్‌పై రూ.309.95 కోట్లు, బిర్లా టైర్స్‌పై రూ. 178.33 కోట్లు సీసీఐ జరిమానా విధించిందని తెలిపారు. ఈ పరిణామంపై ఫిబ్రవరిలోనే... ప్రధాని మోడీకి ఏఐకేఎస్ లేఖరాసిందని తెలిపారు. ఈ కార్పొరేట్ తారుమారు రబ్బరు ఉత్పత్తిదారులతో పాటు వినియోగదారులను మోసం చేయడానికి స్పష్టమైన ఉదాహరణ అని ఆ లేఖలో పేర్కొన్నామని గుర్తు చేశారు. అనుబంధ యాజమాన్యం కింద ప్రపంచ స్థాయి టైర్ల తయారీ యూనిట్‌ను స్థాపించడానికి రబ్బరు రైతుల ఉత్పత్తి సహకారాన్ని ఏర్పాటు చేయడానికి పైన పేర్కొన్న ఐదు ప్రధాన ప్రయివేట్ టైర్ల తయారీ కార్పొరేట్ కంపెనీలపై సీసీఐ విధించిన ద్రవ్య పెనాల్టీ మొత్తానికి సమానమైన రూ.1,788 కోట్ల గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఏఐకేఎస్ డిమాండ్ చేస్తుందని తెలిపారు. రబ్బరు పారిశ్రామిక ఉత్పత్తులను తయారు చేసే పబ్లిక్ సెక్టార్ పరిశ్రమల అసోసియేషన్, సహకారంతో కార్మికులు, రైతుల సహకార సంఘాలచే నిర్వహించబడే టైర్, ట్యూబ్ తయారీ యూనిట్లను ఏర్పాటుచేసే అవకాశాలను చూడాలనీ, ప్రభుత్వ సహాయం, రుణాల లభ్యత గురించి అన్వేషించవచ్చని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దూకుడుగా అమలు చేసిన నయా ఉదారవాద విధానాల ముగింపని పేర్కొన్నారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు రైతులకు అధిక రాబడిని అందించటం ద్వారా వారికి విముక్తి కల్పిస్తాయన్న నయా ఉదారవాదుల కథనం ఈ కార్పొరేట్ దోపిడీతో బద్ధలైందని తెలిపారు. ఆర్థిక పెట్టుబడి (ఫైనాన్స్ క్యాపిటల్), గుత్తాధిపత్య మూలధన సమ్మేళనం రైతులను క్రూరంగా లూటీ చేస్తుండగా, మరోవైపు మోడీ ప్రభుత్వం రబ్బరు చట్టం-1947ను రద్దు చేసి, దాని స్థానంలో రబ్బర్ (ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్) బిల్లు-2022 తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఈ బిల్లుతో రబ్బర్ బోర్డు స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని ఆరోపించారు. ఈ కొత్త బిల్లు రబ్బరు సాగును పారిశ్రామిక చర్యగా నిర్వచించాలని ప్రతిపాదించిందని తెలిపారు. ప్రస్తుత మోడీ పాలనలో ప్రతిపాదిత బిల్లు లాగానే ఈ ప్రతిపాదిత బిల్లు కూడా చిన్న, మధ్య తరహా రబ్బరు రైతులపై ప్రభావం చూపుతుందని తెలిపారు. రబ్బర్‌ను వ్యవసాయ ఉత్పత్తిగా మార్చడానికి డబ్ల్యూటీఓతో చర్చల అవకాశాలను శాశ్వతంగా రద్దు చేయడం వల్ల, రాష్ట్రాల హక్కులు కూడా చాలా వరకు పలచబడతాయని పేర్కొన్నారు.
ఈ కార్పొరేట్లపై సీసీఐతో స్వతంత్ర విచారణ చేయాలని ఏఐకేఎస్ డిమాండ్ చేస్తుందని తెలిపారు. రబ్బర్ బోర్డు స్వయం ప్రతిపత్తిని కూల్చివేసే మోడీ పాలనకు రైతాంగం నుంచి మరోసారి ప్రతిఘటన ఎదురవుతుందని పునరుద్ఘాటించారు. 2022 మార్చి 10 నిర్ణయాన్ని ఖండిస్తూ దేశంలోని రబ్బరు సాగుదారులు ఇప్పటికే వీధుల్లోకి వచ్చారనీ, ప్రతిపాదిత రబ్బరు బిల్లు 2022కు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేయాలని రబ్బరు ఉత్పత్తిదారులందరికీ ఏఐకేఎస్ పిలుపునిచ్చిందని తెలిపారు.