Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ మరణాలపై ప్రభుత్వ లెక్కలతో ఏకీభవించని ఆరోగ్య సంస్థ
- దాదాపు నాలుగు రెట్లు అధికంగా ఉంటాయని అంచనా
- త్వరలో గణాంకాలు విడుదల
- తోసిపుచ్చిన భారత అధికారులు
న్యూఢిల్లీ : భారత్లో కోవిడ్ మరణాల విషయంలో మోడీ ప్రభుత్వం నిజాలు దాచిపెట్టిం దా? దేశంలోని కరోనా మరణాలు ప్రభుత్వ అధికారిక లెక్కలను మించి ఉన్నదా? కరోనా మరణాల్లో అనేకం రికార్డుల్లోకి చేరలేదా? అంటే అవుననే సమాధానం వినపడుతున్నది. కరోనా మహమ్మారి దేశంలో విజృంభించిన కాలంలో దేశంలో మరణాలు అధికంగా చోటు చేసుకున్నాయి. ఈ మరణాల విషయంలో పరిశోధకులు, అంతర్జాతీయ ఆరోగ్య నిపుణలు, సంస్థలు ఆది నుంచి అనుమానాలను వ్యక్తంచేశారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే జాబితాలో చేరింది. భారత ప్రభుత్వం వెల్లడించిన కరోనా మరణాలతో ఆ సంస్థ ఏకీభవించడం లేదు. భారత్లో సంభవించిన కరోనా మరణాలు అధికారిక లెక్కల కంటే దాదాపు నాలుగు రెట్లు అధికమని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది. దీనికి సంబంధించిన సమాచార నివేదిక త్వరలో విడుదల కానున్నది. భారత్లో కరోనా మరణాలు విషయంలో అధికారిక రికార్డుల్లో ఉన్న లెక్కలకు మించి ఉన్నాయని అంచనా వేసింది. భారత్ మాత్రం దీనిని తోసిపుచ్చింది. డబ్ల్యూహెచ్ఓ నుంచి త్వరలో రాబోయే ఈ నివేదికను ఇద్దరు సభ్యుల టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు (టీఏజీ) తయారు చేసింది. కరోనా మరణాలు విషయంలో భారత ప్రభుత్వ లెక్కలతో తమ నిర్ధారణలు సరితూగటం లేదని వారు స్పష్టం చేశారు. కరోనా మరణాల వంటి సంబంధిత సమాచారాన్ని పొందకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కట్టడి చేసిందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ప్రభుత్వ గణాంకాలు, అంచనాల విషయంలో నిపుణులకు అనేక అనుమానాలు న్నాయని చెప్పారు. మరికొన్ని అధ్యయనాలైతే భారత్లో అధికారిక కరోనా మరణాల కంటే 5.8 రెట్ల నుంచి 10 రెట్ల వరకు మరణాలు ఉండొచ్చని అంచనా వేశాయి. అయితే, భారత ప్రభుత్వ అధికారులు మాత్రం ఎప్పటి లాగే ఇలాంటి అధ్యయనాలను కొట్టిపారేశారు. అధికారిక లెక్కల ప్రకారం.. ప్రస్తుతం భారత్లో 5.2 లక్షల కరోనా మరణాలు ఉన్నాయి.
కాగా, కోవిడ్ మరణాలపై డబ్య్లూహెచ్ఓ గణాంకాలు ఏప్రిల్ ప్రథమాంకంలో విడుదలవుతుందని సంస్థ తెలిపింది. గతనెల 11న విడుదలైన ఒక ప్రముఖ అధ్యయనం కూడా భారత్లోని కరోనా మరణాలపై విబేధించింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా మరణాలు అధికంగా ఉంటాయనీ, అనేక మరణాలు అధికారిక రికార్డులకెక్కలేదని వివరించింది. ఆయా దేశాల అధికారిక లెక్కలనే చూసుకుంటే యూఎస్, బ్రెజిల్ ల తర్వాత భారత్లోనే అత్యధిక కరోనా మరణాలున్నాయి. భారత్లో కరోనా మరణాలకు సంబంధించిన సమాచారం అందే అవకాశాలు పేలవంగా ఉన్నందున సరైన ఇక్కడ సరైన సమాచారం అందటం ఒక సవాలే అని టొరంటో యూనివర్సిటీ ఎపిడెమియోలజిస్ట్ ప్రభాత్ ఝా అన్నారు.