Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్ 90పైసలు..డీజిల్ 87పైసలు పెంపు
- సామాన్యుడి కష్టాలు పట్టించుకోని మోడీ సర్కార్
న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయనే కారణం చూపుతూ..ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరల్ని కేంద్రం పెంచుతూ పోతోంది. ఆదివారం హైదరాబాద్‌లో లీ.పెట్రోల్‌పై 90పైసలు, డీజిల్‌పై 87పైసలు పెంపు నమోదైంది. దాంతో పెట్రోల్ ధర రూ.117.23కు, డీజిల్ ధర రూ.103.32కు చేరుకున్నాయి. భరించలేని స్థాయిలో పెరుగుతున్న ధరలు వాహనదారుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. అలాగే నిత్యావసర సరుకుల ధరలు పెరగడానికి కారణమైంది. ఉపాధి, ఆదాయం కోల్పోయి అష్టకష్టాలు పడుతున్న చిన్న చిన్న వ్యాపారాలు, ప్రయివేటు ఉద్యోగులు పెరిగిన ధరలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మార్చి 22 నుంచి ఇంధన ధరల పెంపు మొదలైంది. రెండు వారాల్లో ధరల్ని 11మార్లు పెంచారు.
పెట్రోల్, డీజిల్‌పై 9రూపాయలు పెంపుదల నమోదైంది. కొద్ది నెలల క్రితం ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లను మభ్య పెట్టడానికి మోడీ సర్కార్ ఇంధన ధరల్ని మార్చింది. కేంద్ర పన్నుల్ని తగ్గిస్తున్నామని గత ఏడాది నవంబర్ 6న నిర్ణయం వెలువరించింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగినా..ఐదు నెలలపాటు ధరల్లో మార్పు రాలేదు. అలాంటి నిర్ణయమే కేంద్రం ఇప్పుడెందుకు తీసుకోవటం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రష్యా నుంచి అత్యంత తక్కువ ధరలో ముడి చమురు కొనుగోలు చేస్తున్నామని కేంద్రం చెబుతోంది. ఇకముందూ కొనుగోలు చేస్తామని, పెద్ద ఎత్తున కొనుగోలు కాంట్రాక్ట్స్ కుదుర్చుకున్నామని ఇటీవల ప్రకటించింది. అయితే ఇదెంత వరకూ ఫలించి..ధరల తగ్గుదలకు దారితీస్తుందో తెలియని పరిస్థితి.