Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హెచ్డీఎఫ్సీ విలీనం
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీ విలువ పెంచేలా ఇన్వెస్టర్లకు మరింత లాభాలు అందించే చర్యల్లో భాగంగా హెచ్డీఎఫ్సీ ని పూర్తిగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో విలీనం చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హెచ్డీఎఫ్సీ ఇన్వెస్ట్మెంట్స్, హెచ్డీఎఫ్సీ హౌల్డింగ్ సంస్థలు విలీనం కానున్నాయని సోమవారం ఆ సంస్థ సెబీకి సమాచారం ఇచ్చింది. రెండు సంస్థల విలీనానికి ఆయా సంస్థల బోర్డులు కూడా ఆమోదం తెలిపాయని పేర్కొంది. విలీనం తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీకి 41 శాతం వాటాలు దక్కనున్నాయి. ఈ నిర్ణయంతో ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ తర్వాత దేశంలోనే మూడో అతిపెద్ద బ్యాంక్‌గా హెచ్డీఎఫ్సీ అవతరించనుంది.
తాజా ప్రకటనలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు పరుగులు పెట్టాయి. ఓ దశలో రెండు సూచీలు 15 శాతం మేర లాభపడ్డాయి. ఈ విలీనం అనంతరం ప్రతీ 25 హెచ్డీఎఫ్సీ షేర్లకు 42 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లభించనున్నాయి. రెండింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12.8 లక్షల కోట్లకు చేరింది. నిఫ్టీ 50లో విలువపరంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అతిపెద్ద స్టాక్‌గా నిలువనుందని అంచనా. మార్చి 31 నాటికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాటా 8.4 శాతం, హెచ్డీఎఫ్సీ వెయిటేజీ 5.66 శాతంగా నమోదయ్యింది. కాగా.. రిలయన్స్ వాటా 11.9 శాతాన్ని హెచ్డీఎఫ్సీ దాటనుంది.
ఆర్థిక వ్యవస్థకు మద్దతు
ఈ రెండు సంస్థల విలీనంతో దేశీయ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మెన్ దీపక్ పరేక్ అన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 15-18 నెలలు సమయం పట్టొచ్చన్నారు. తమ సంస్థల విలీనానికి సెబీ, ఆర్బీఐ, ఐఆర్డీఏ, సీసీఐ తదితర నియంత్రణ సంస్థల నుంచి సాధ్యమైనంత త్వరగా ఆమోదం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు సంస్థల బ్యాలెన్స్ షీట్ రూ.17.87 లక్షల కోట్లుగా ఉంటుందని పరేక్ తెలిపారు.
హెచ్డీఎఫ్సీ మొత్తం ఆస్తుల విలువ రూ.6.23 లక్షల కోట్లుగా ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు రూ.19.38 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. ఈ బ్యాంక్‌కు దాదాపు 6.8 కోట్ల మంది ఖాతాదారులున్నారు. 3000 పట్టణాల్లో 6,342 శాఖలను కలిగి ఉంది. విలీన ప్రకటనతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ ఏకంగా 9.97 శాతం పెరిగి రూ.1,656.45కు చేరింది.