Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెయిల్‌ను సవాల్ చేయాలని యూపీ ప్రభుత్వానికి రెండుసార్లు చెప్పాం: సిట్
- లఖింపుర్ ఖేరి ఘటన తీవ్రమైందే : సుప్రీంకోర్టుకు యూపీ ప్రభుత్వం
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరుపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బాధిత రైతు కుటుంబ సభ్యులు దాఖలుచేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, న్యాయమూర్తులు జస్టీస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం తీర్పు రిజర్వ్‌కు ముందు సోమవారం సుదీర్ఘంగా విచారించింది. మొత్తం 97 మంది సాక్షులకు విస్తృత భద్రత కల్పించామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ తెలిపారు. బెయిల్ పిటిషన్‌ను సమర్థిస్తున్నారా? లేదా వ్యతిరేకిస్తున్నారా? అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని జెఠ్మలానీని సీజేఐ జస్టిస్ రమణ కోరారు. ''గతసారి మేం మిమ్మల్ని అడిగితే, మీరు బెయిల్‌ను వ్యతిరేకించారని చెప్పారు'' అని సీజేఐ అన్నారు. అయితే మీ స్టాండ్ ఏమిటి?'' అని సీజేఐ ప్రశ్నించారు. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేయాలని కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రాష్ట్రాన్ని కోరిందనీ, అయితే అది ప్రభుత్వాన్ని మెప్పించలేదని జెఠ్మలానీ అంగీకరించారు. ''ఇది ఘోరమైన నేరం. అతను ప్రభావవంతమైన వ్యక్తి. అతను సాక్ష్యాలను తారుమారు చేయగలడు కాబట్టి అప్పీల్ చేయమని సిట్ మమ్మల్ని కోరింది. కానీ అది మమ్మల్ని ఆకట్టుకోలేదు'' అని జెఠ్మలానీ బదులిచ్చారు.
బాధిత రైతు కుటుంబాల తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తున్నప్పుడు సంబంధిత వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవడంలో హైకోర్టు విఫలమైందని అన్నారు. బాధితులపై బుల్లెట్ గాయాలకు సంబంధించిన అనవసరమైన అంశాలను కూడా హైకోర్టు పరిశీలించిందనీ, బెయిల్ విషయంలో సంబంధిత అంశాలు లేవని ఆయన అన్నారు. ''వారు కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడిపినప్పుడు బుల్లెట్ గాయంపై ప్రశ్నను పరిగణనలోకి తీసుకోవడం హైకోర్టు తప్పు'' అని దుష్యంత్ దవే అన్నారు. దుష్యంత్ దవ్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. మిశ్రా చర్యలు ఉద్దేశపూర్వకంగానే ఉన్నాయని కూడా ఆయన వాదించారు. ''10,000 నుంచి 15,000 మంది ప్రజలు అక్కడ గుమిగూడారని పూర్తిగా తెలుసు. అయినా నిందితులు ఆ మార్గంలో వెళ్ళారు. ఆశిష్ మిశ్రా, అతని స్నేహితులు నినాదాలు చేసి రైతులను చంపాలనే ఉద్దేశ్యంతో చితకబాదారు. దీని కారణంగా నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ మరణించారు'' అని దవే వాదించారు.
బెయిల్ ను సవాల్ చేయమని రెండు సార్లు యూపీ ప్రభుత్వానికి చెప్పాం: సిట్
మరోవైపు లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనపై దర్యాప్తునకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం తన నివేదికలో ప్రధాన నిందితుడు ఆశిష్ బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టులో అత్యవసరంగా అప్పీలు చేయాలని కోరుతూ యూపీ ప్రభుత్వానికి సిట్ రెండుసార్లు లేఖ రాశారని సుప్రీంకోర్టుకు నివేదించింది. నమోదైన సాక్ష్యాల ఆధారంగా ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా, ఇతరులు నేరం జరిగిన ప్రదేశంలో ఉన్నట్టు రుజువు అవుతుందని సిట్ తన నివేదికలో పేర్కొంది. 13 మంది నిందితులు ముందస్తు ప్రణాళికతో నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లారనీ, కాన్వారులో మూడు వాహనాలను ఉపయోగించారనీ, వాటిని ఇరుకైన రహదారిపై అతి వేగంతో నడిపారని కూడా రుజువు అయ్యిందని సిట్ తన నివేదికలో పేర్కొంది.
నేరం చేసిన తర్వాత నిందితులు నిరసనకారులను భయపెట్టడానికి గాలిలోకి ఆయుధాలను కాల్చడం ద్వారా తప్పించుకున్నారనీ, ఎఫ్ఎస్ఎల్ బాలిస్టిక్ నివేదికలు ఆయుధాల వినియోగాన్ని నిర్ధారిస్తున్నాయని తెలిపింది. అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక ఆధారాలను ఉపయోగించామనీ, అరెస్టయిన నిందితులపై విచారణను త్వరితగతిన పూర్తి చేశామని పేర్కొంది.