Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు
అమరావతి: ఏపీలో జిల్లాల పునర్విభజనతో నూతన భౌగోళిక ముఖచిత్రం ఆవిష్కతమైంది. కొత్తగా ఏర్పడిన 13తో కలిపి రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26కి చేరింది. నూతన జిల్లాల ప్రారంభోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. సోమవారం ఏపీ సీఎం జగన్ అమరావతి నుంచి వర్చువల్గా కొత్త జిల్లాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఎలక్ట్రానిక్ బటన్ నొక్కడంతో నూతన జిల్లాల ఉనికి అమల్లోకి వచ్చింది. ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ''ఇవాళ మంచి పనికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజు ఇది. 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా రూపుమారింది. గతంలో ఉన్న జిల్లా పేర్లు అలాగే ఉన్నాయి. ఆ 13 జిల్లా కేంద్రాలను అలాగే కాపాడుకున్నాం. పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలనే మార్పులు చేశాం. కలెక్టర్లకు అధికారంతో పాటు ప్రజల పట్ల బాధ్యత పెరిగింది. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకనుగుణంగా మార్పులు అవసరం'' అని చెప్పారు. అయితే దీనిపై టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.