Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండువారాల్లో 12మార్లు ధరల పెంపు
- తనకేం సంబంధం లేనట్టు కేంద్రం తీరు
న్యూఢిల్లీ : ఇంధన ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడటం లేదు. ప్రతిపక్షాలు, ప్రజలు..ఎంత మొత్తుకున్నా తనకు సంబంధం లేని వ్యవహారంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోంది. ప్రతి రోజూ ఇంధన ధరల్ని పెంచుతూ వస్తోంది. సోమవారం హైదరాబాద్‌లో లీ.పెట్రోల్‌పై 45పైసలు, డీజిల్‌పై 43పైసలు పెరిగాయి. దాంతో నగరంలో పెట్రోల్ రూ.117.68కు, డీజిల్ రూ.103.75కు చేరుకున్నాయి. ధరలు ఇదే విధంగా పెరుగుతూ పోతే లీ.పెట్రోల్ త్వరలో రూ.120 దాటడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు వారాల్లో ఇంధన ధరల్ని 12మార్లు పెంచారు. పెరిగిన ధరలు వాహనదారుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. మార్చి 22 నుంచి మొదలైన ధరల పెంపు నేపథ్యంలో ఇప్పటివరకూ పెట్రోల్, డీజిల్ ధరలు 9రూపాయల వరకు పెరిగాయి. ముంబయిలో లీ.పెట్రోల్ రూ.118.83, డీజిల్ రూ.103కు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో ఇంధన ధరలు రికార్డ్‌స్థాయికి చేరుకున్నాయి.