Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైగర్ రిజర్వ్ పేరుతో ఆదివాసీల జీవనోపాధిపై దెబ్బ
- వ్యన్యప్రాణుల సంరక్షణ చట్టం-2006కు తూట్లు
- పునరావాసం, ఉపాధి చూపాలని చట్టం చెబుతున్నా కేంద్రం నిర్లక్ష్యం
న్యూఢిల్లీ : 'టైగర్ రిజర్వ్' ప్రాంతాల్లో పులుల సంరక్షణ పేరుతో కేంద్రం చేపడుతున్న చర్యలు లక్షలాది మంది ఆదివాసీ, గిరిజనుల బతుకుల్ని ఆగం చేస్తున్నాయి. నిర్వాసితులుగా మారుతున్న ఆదివాసీలకు కేంద్రం ఎలాంటి పునరావాసం అందజేస్తోంది, ఇతర పథకాలతో జీవనోపాధి కల్పిస్తోందా? లేదా?..అనే వివరాల్ని కేంద్రం వెల్లడించటం లేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దీనిపై బిజూ జనతాదళ్ ఎంపీ అనుభవ్ మెహంతీ ప్రశ్నించగా, రాతపూర్వకంగా కేంద్రం ఇచ్చిన సమాధానం...క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వన్యప్రాణుల సంరక్షణ చట్టం(సవరణ)-2006 ప్రకారం, ఆదివాసీ, గిరిజనులను టైగర్ రిజర్వ్ ప్రాంతాల నుంచి వేరే చోటకు తరలించాల్సిన అవసరం లేదు. కానీ అనేక రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాల నుంచి ఆదివాసీ, గిరిజనుల్ని దూరం చేస్తున్నారు. టైగర్ రిజర్వ్ ప్రాంతాలుగా ఒకసారి ప్రకటించగానే..'పులుల సంరక్షణ' పేరుతో కేంద్రం చేపట్టే చర్యలు అమాయక ప్రజల హక్కుల్ని ఉల్లంఘిస్తున్నాయి. సాంప్రదాయమైన జీవనోపాధికి వారు దూరమవ్వాల్సిన అవసరం లేదు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుత మోడీ సర్కార్‌లోని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని విడుదల చేయటం లేదు.
దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని టైగర్ రిజర్వ్ ప్రాంతాలున్నాయి? వీటి ఏర్పాటు వల్ల..ఎంతమంది ఆదివాసీలు నిర్వాసితులయ్యారు? వారికి కేంద్రం అందించిన పునరావాసం, సహకారం, పథకాల అమలుతో మద్దతు..తదితర వివరాలు వెల్లడించాలని కేంద్రాన్ని ఎంపీ మెహంతీ కోరారు. ఆదివాసీల జీవనోపాధిని, హక్కుల్ని కాపాడుతూనే టైగర్ రిజర్వ్ ఏర్పాటుచేయాలని వన్యప్రాణుల సంరక్షణ చట్టం చెబుతోందని ఆయన గుర్తుచేశారు.
టైగర్ రిజర్వ్‌లో 'కోర్' ఏరియగా పేర్కొనే ప్రాంతంలో మానవ ఆవాసాలు ఎంతమాత్రం ఉండరాదు. బఫర్ ఏరియా కింద ఉన్న గిరిజనులు, ఆదివాసీలను కూడా వేరే చోటకు తరలించాల్సిందే. నిర్వాసితులైన అందరికీ కేంద్రం పునరావాసం కల్పించాలి. ఆదివాసీ, గిరిజన హక్కుల్ని పరిరక్షించాల్సింది. కానీ అలా జరగలేదని సంబంధిత ఎంపీ కేంద్రంపై ఆరోపించారు. పులుల సంరక్షణ కేంద్రం పేరుతో కేంద్రం చేపట్టిన చర్యలు..ఆదివాసీ, గిరిజన హక్కుల్ని తీవ్రంగా ఉల్లంఘించిందని ఆయన అన్నారు.
అడవులే జీవనాధారం
'వన్యప్రాణుల సంరక్షణ' పేరుతో చేపడుతున్న చర్యలు..అడవుల్నే నమ్ముకొని బతుకుతున్న ఆదివాసి, గిరిజనుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. టైగర్ రిజర్వ్ ప్రకటించాక..అనేక రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాల నుంచి ఆదివాసీల్ని, గిరిజనుల్ని వెళ్లగొడుతున్నారు. దీనికి సంబంధించి పార్లమెంట్లో ఎప్పుడో 2006నాటి గణాంకాల్ని కేంద్ర మంత్రి అశ్విన్ చౌబే రాతపూర్వకంగా విడుదల చేశారు. 2006నాటికి కేంద్ర పర్యావరణ, అడవుల శాఖ వద్ద ఉన్న లెక్కల ప్రకారం..28 టైగర్ రిజర్వ్ కింద 273 గ్రామాల్ని తీసుకున్నారు. దీనివల్ల మొత్తం 1487 గ్రామాల్లోని 3.80లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని కేంద్రం పేర్కొన్నది.