Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజాగా మసీదుల్లో 'ఆజాన్'పై దాడి
- ప్రతిగా ఆలయాల్లో భజనలతో హోరెత్తిస్తున్న వైనం
బెంగళూరు : కర్నాటకలో హిందూత్వ సంస్థలు విష ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. గతంలో హిజాబ్‌పై రేగిన వివాదం ఇంకా సద్దుమణగకముందే ముస్లిం వ్యాపారులు హలాల్ మాంసాన్ని విక్రయించడంపై వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. దాన్నీ వివాదాస్పదం చేసిన తర్వాత హిందూత్వ సంస్థల కన్ను ఇప్పుడు ఆజాన్‌పై పడింది. మసీదుల నుంచి ప్రార్థనల కోసం ఇచ్చే పిలుపు ఆజాన్‌కు వ్యతిరేకంగా వారు ఇప్పుడు ప్రచారం సాగిస్తున్నారు. కాగా, ఒకదాని తర్వాత మరొకటిగా సాగుతున్న ఈ విద్వేష ప్రచారాలపై కర్ణాటక ప్రభుత్వం మౌనంగా ఉండటం పట్ల ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న మసీదుల్లోని మైకులను తొలగించాల్సిందిగా శ్రీరామ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ ఆయన అసోసియేట్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైతే తాము ఆందోళనలను ఉధృతం చేస్తామని బెదిరించారు. ఆజాన్కి ప్రతిగా ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే ఆలయాల్లో మైకుల నుంచి భజనలను ప్రసారం చేస్తున్నారు. దీనిపై నగర పోలీసు కమిషనరు కమల్ పంత్ మాట్లాడుతూ, శబ్ద కాలుష్యం (నియంత్రణ) నిబంధనల చట్టం-2000 కింద హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అన్ని ఆరాధన స్థలాలు కచ్చితంగా పాటించాలని కోరారు. వీటిని ఉల్లంఫించిన వారిపై కోర్టు ధిక్కార చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయాల యాజమాన్యాలపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
అకస్మాత్తుగా ఇప్పుడెందుకు గొడవ? : కుమారస్వామి
ఈ అంశాలపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మౌనం పాటించడాన్ని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి విమర్శించారు. 'ముస్లిములు ఎప్పుడూ ఆజాన్ కోసం లౌడ్స్పీకర్లను ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ హిందూత్వ సంస్థలు అకస్మాత్తుగా ఇప్పుడెందుకు గొడవ చేస్తున్నాయి? అని ఆయన ప్రశ్నించారు. ఏమీ జరగనట్లుగా ముఖ్యమంత్రి అన్నీ చూస్తూ మౌనం పాటిస్తున్నారని విమర్శించారు. గత నెలన్నరగా రాష్ట్రంలో శాంతి సామరస్యతలను దెబ్బ తీయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మతపరంగా సున్నితమైన ఈ అంశాలను వివాదాస్పదం చేయాలనే ఈ వ్యూహం వల్ల కమ్యూనిటీల మధ్య గల బంధాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించారు. ఇదేమీ ఉత్తరప్రదేశ్ కాదని అన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో బిజెపి గెలవదని అన్నారు. కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్ మాదిరిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సంఘ పరివార్‌ను బుజ్జగించడానికే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని, స్వతంత్రంగా వ్యవహరించడం లేదని అన్నారు. హిందూ ఓట్లను పోగొట్టుకుంటామనే భయంతో కాంగ్రెస్ కూడా ఈ విషయాల్లో మెతకగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో హిందూత్వ సంస్థలు ఇలాంటి ప్రచారాలు చేపడుతున్నాయని విమర్శించారు.