Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 78 ఏండ్ల బామ్మ వీలునామా
డెహ్రాడూన్ : కొంతమంది తమ అభిమానాన్ని పలురకాలుగా వ్యక్తం చేస్తుంటారు. మరికొంతమంది విస్తుపోయేలా... అభిమానాన్ని వెల్లడిస్తుంటారు..! ఈ తరహాలోనే 78 ఏండ్ల బామ్మ తన యావదాస్తిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేరుపై రాశారు. తన మరణానంతరం తన ఆస్తి అంతా రాహుల్ గాంధీకే చెందాలని వీలునామా రాశారు. ఇంతకూ ఈ నిర్ణయానికి బామ్మ ఏమన్నారంటే.. 'ఆయన అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఈ దేశానికి ఎంతో అవసరం' అని చెప్పారు.
రూ.50 లక్షల విలువైన ఆస్తులు, 10 తులాల బంగారం..
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన 78 ఏండ్ల పుష్ప ముంజియల్ అనే వద్ధురాలికి రాహుల్ గాంధీ అంటే అమితమైన అభిమానం. ఆయన సిద్ధాంతాలు నచ్చిన ఆమె.. తన పేరు మీదున్న రూ.50 లక్షల విలువైన ఆస్తులు, 10 తులాల బంగారం రాహుల్ గాంధీకి చెందేలా వీలునామా రాశారు. సోమవారం పిసిసి మాజీ చీఫ్ ప్రీతమ్ సింగ్ నివాసానికి వెళ్లిన ఆమె.. రాహుల్ పేరు మీదకు తన ఆస్తులు బదలాయిస్తున్న వీలునామాను అందజేశారు. ఈ వీలునామాను కోర్టులోనూ సమర్పించారు.
నా ఆస్తులన్నీ రాహుల్‌కే చెందేలా వీలునామా రాశాను : బామ్మ పుష్ప
'దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు రాహుల్ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఆయన అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఈ దేశానికి ఎంతో అవసరం. అందుకే నా మరణానంతరం నా ఆస్తులన్నీ రాహుల్‌కే చెందేలా వీలునామా రాశాను. ఇదే విషయాన్ని కోర్టుకూ చెప్పాను' అని బామ్మ పుష్ప చెప్పారు. ఈ వీలునామా పత్రాన్ని చూసి తొలుత ఆశ్చర్యపోయిన కాంగ్రెస్ నేతలు.. ఆ తర్వాత బామ్మను అభినందనలతో ముంచెత్తారు.