Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టీఆర్ఎస్ నినాదాలతో లోక్సభ దద్దరిల్లిపోయింది. ఆహార ధాన్యాల సేకరణపై చర్చ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్రం తీరును ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. అమాయకులైన అన్నదాతలను రక్షించండి.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయకండి.. వరి కొనుగోళ్ల కోసం నిర్ధిష్టమైన విధానాన్ని ప్రకటించండి.. అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆహార ధాన్యాల సేకరణపై జాతీయ విధానం రూపొందించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
మంగళవారం ఉదయం స్పీకర్ ఓం బిర్లాకు లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. రాష్ట్రంలో పండిన పంట కేంద్ర ప్రభుత్వ ఆహార సంస్థ ఎఫ్సీఐ సేకరణ చేయకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చ చేయాలని అభ్యర్థన చేశారు. దేశంలో ఆహార ధాన్యాల సేకరణపై జాతీయ విధానంపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం చాలా ముఖ్యమైనదని, అందుచేత సభ ఈ రోజు కార్యక్రమాలు రద్దు చేసి ఈ అంశంపై చర్చించాలని నామా తన లేఖలో అభ్యర్థించారు.