Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ తీసుకొచ్చిన వివాదాస్పద పథకం 'ఎన్నికల బాండ్ల'పై త్వరలో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తెలిపారు. కోవిడ్ సంక్షోభం వల్ల బాండ్ల పథకంపై దాఖలైన పిటిషన్ల విచారణ ఆలస్యమైందని సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌తో మాట్లాడుతూ సీజేఐ చెప్పారు. బాండ్ల పథకం చట్టబద్ధమైన చెల్లుబాటును సవాల్ చేస్తూ ప్రశాంత్ భూషణ్, కాంగ్రెస్ నాయకులు, పలు ఎన్జీవో సంస్థల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లు సుదీర్ఘకాలంగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. కోవిడ్ సంక్షోభం రాకపోయివుంటే బాండ్ల పథకంపై విచారణ చేపట్టేవారిమని తాజాగా సీజేఐ వ్యాఖ్యానించారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) తరఫున ప్రశాంత్ భూషణ్ సుప్రీంలో పిటిషన్ వేశారు. తమ పిటిషన్ ఏడాదికిపైగా పెండింగ్‌లో ఉందన్న విషయం జస్టిస్ ఎన్.వి.రమణకు ప్రశాంత్ భూషణ్ తెలియజేశారు. పిటిషన్‌పై విచారణ అత్యవసరంగా చేపట్టాలని గత ఏడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టును కోరారు. ఆర్థిక చట్టం-2017కు సవరణలు చేసి..ఎన్నికల బాండ్ల పథకాన్ని మోడీ సర్కార్ అమల్లోకి తీసుకొచ్చింది. తద్వారా దేశంలోని పలు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడానికి మార్గం సుగమమైంది. ముఖ్యంగా ఈ బాండ్ల పథకం అమల్లోకి వచ్చాక..అధికార బీజేపీకి దేశవిదేశాల నుంచి వేలకోట్ల రూపాయలు విరాళాలుగా అందుతున్నాయి. విరాళం ఇవ్వడానికి సిద్ధం చేసిన నగదు మొత్తం తమకు ఎలా సమకూరింది? అన్నది విరాళాన్ని అందజేస్తున్నవారు చెప్పాలన్న నిబంధన లేదు. అపరిమితమైన నగదు మొత్తాన్ని ఏ పార్టీకైనా అందజేసే అవకాశముంది. దేశంలో బడా కార్పొరేట్స్ అధికార బీజేపీకి వేల కోట్లు విరాళాలు ఇవ్వడానికి బాండ్ల పథకం అవకాశం కల్పిస్తోంది. తెరవెనుక మోడీ సర్కార్‌తో ఎలాంటి ప్రయోజనం పొందే ఉద్దేశం లేకుండా..ఆ కంపెనీలు ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు ఎందుకు ఇస్తున్నాయని ప్రతిపక్ష నాయకులు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ విరాళాల్లో పారదర్శకతపై సర్వత్రా అనుమానాలున్నాయి.