Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత్రికేయులతో గుజరాత్ ప్రతినిధి బృందం కేరళ (కన్నూర్) నుంచి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
గుజరాత్లో బీజేపీ పెద్ద ఎత్తున అణచివేత చర్యలకు పాల్పడుతోందని సీపీఐ(ఎం) 23వ మహాసభలకు ప్రతినిధులుగా వచ్చిన ఆ రాష్ట్ర బృందం తెలిపింది. మీడియా ప్రతినిధులతో బృంద సభ్యులు మంగళవారం మాట్లాడారు. బృందంలోని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు అరుణ్మెహతా మాట్లాడుతూ ప్రజాభిప్రాయానికి బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదనిచెప్పారు. ఎక్కడికక్కడ నిర్బంధ చర్యలకు దిగుతోందన్నారు. దీంతో ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరుగుతోందన్నారు. అయితే, కాంగ్రెస్ పట్ల విశ్వాసం వ్యక్తం కావడం లేదన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన 24 మంది ఎంఎల్ఏలు మూడేండ్లలో బీజేపీలో చేరారని, దీంతో కాంగ్రెస్కు ఓటు వేసిన బీజేపీకే చేరుతుందని ప్రజలు భావిస్తున్నారని వివరించారు. అదేసమయంలో ఇతర ప్రత్యామ్నాయం కూడా కనిపించడం లేదనీ, దీంతో ప్రజానీకంలో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోందని తెలిపారు. జంతు సంరక్షణ చర్యల పేరిట వివిధ రకాల మాంసాహారాన్ని నిషేధించడం, చివరకు గుడ్ల వ్యాపారాన్ని అడ్డుకోవడం వంటి చర్యలకు బీజేపీ ప్రభుత్వం పాల్పడిందన్నారు. మైనార్టీలను లక్ష్యంగాచేసుకుని ప్రజలను పెద్దఎత్తున విభజిస్తోందన్నారు.
వేరుశనగతో పాటు పత్తిరైతుల సమస్యలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. రాజ్కోట్, సబర్ఘాట్, ఆర్వల్లి ప్రాంతాల్లో సీపీఐ(ఎం) రైతాంగ ఉద్యమాలను నిర్మించి పోరాడుతోందని తెలిపారు. ప్రభుత్వంపై వ్యక్తమవుతున్న వ్యతిరేకతను మరింతగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమించడం వంటి కార్యాచరణతో తాము పనిచేస్తున్నామని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు.