Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శివసేన ఎంపీ సంజయ్ రౌత్
ముంబయి : శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద సంజయ్ రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అలీబాగ్‌లో రూ.9 కోట్లు విలువచేసే ఎనిమిది ప్లాట్లు, ముంబయిలోని దాదర్ శివార్లలో ఉన్న రూ.2 కోట్లు విలువచేసే ఒక ఫ్లాట్ జప్తు చేసిన ఆస్తుల్లో ఉన్నాయి. వీటిని జప్తు చేస్తూ ప్రొవిజనల్ అటాచ్‌మెంట్‌ను ఈడీ జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ముంబయిలోని ఒక భారీ రెసిడెన్షియల్ భవనం రీ డెవలప్మెంట్కు సంబంధించి రూ.1,034 కోట్ల విలువైన భూ కుంభకోణానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈ ఫ్లాట్లను జప్తు చేశారు.
ఈడీ తన ఆస్తులను జప్తు చేయడంపై సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థది ప్రతీకార చర్య అనీ, అటువంటి చర్యలకు తాను భయపడేది లేదని అన్నారు. ఆస్తులు జప్తు చేసినా, కాల్పులు జరిపినా, జైల్లో పెట్టినా భయపడే ప్రసక్తేలేదని, తాను బాలాసాహెబ్ థాకరే అనుచరుడినని, శివసైనికుడిననీ, చివరి వరకూ పోరాడతానని అన్నారు. జప్తు చేసిన తన ఆస్తులన్నీ చట్టబద్దంగా సంపాదించినవనీ, నల్లధనం కాదని అన్నారు. నల్లధనమని నిరూపిస్తే తన ఆస్తులన్నింటినీ బిజెపికి దానం చేస్తానని సవాలు విసిరారు. కాగా, ఈ కేసులో మహారాష్ట్ర వ్యాపారి ప్రవీణ్ రౌత్‌ను గత ఫిబ్రవరిలో ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఛార్జిషీటు కూడా నమోదు చేసింది. పీఎంసీ బ్యాంక్ మోసం కేసుకు సంబంధించిన మరో మనీ లాండరింగ్ కేసులో గతేడాది సంజరు రౌత్ భార్య వర్షా రౌత్‌ను కూడా ఈడీ విచారించింది. ప్రవీణ్ రౌత్ భార్య మాధురితో వర్షా రౌత్‌కు సంబంధాలున్నాయనే అనుమానంతో ఈడీ ఆమెను ప్రశ్నించింది.