Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
- 15 రోజుల్లో పెట్రోల్‌పై 9.20 భారం
న్యూఢిల్లీ : దేశంలో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న ఇంధన ధరలకు బ్రేకులు పడటం లేదు. చమురు ధరలు మళ్లీ పెరిగాయి. మంగళవారం లీటర్ పెట్రోల్, డీజీల్‌పై 80 పైసల చొప్పున ధరలు ఎగబాకాయి. దీంతో గత 15 రోజుల్లో 13 సార్లు ధరలు పెరిగాయి. ఈ వ్యవధిలోనే లీటర్ ఇంధన ధరలపై రూ. 9.20 భారం పడింది. దేశంలోని పలు నగరాల్లో నమోదైన తాజా ధరలు చూస్తే.. దేశ రాజధాని న్యూఢిల్లీల్లో లీటర్ పెట్రోల్ రూ. 104.61కి, డీజీల్ ధర రూ. రూ. 95.87కి ఎగబాకింది. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 119.67కి, డీజీల్ ధర రూ. 103.92కి చేరి వాహనదారులను షాక్‌కు గురి చేసింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.09, డీజీల్ ధర రూ. 100.18 పలుకుతున్నది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 114.28, డీజీల్ ధర రూ. 99.02 కు ఎగబాకింది. ఇక హైదరాబాద్‌లోనూ పెరిగిన ఇంధన ధరలు వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్‌పై 91పైసలు పెరిగి రూ. 118.59కు ఎగబాకింది. అలాగే, లీటర్ డీజీల్‌పై 87 పైసలు భారం పడి దాని ధర రూ. 104.62 కి చేరింది. ఇటు సీఎన్జీ ధరలు సోమవారం కేజీకి రూ. 2.5 మేర పెరిగిన విషయం విదితమే. కొత్త ధరల ప్రకారం.. దేశ రాజధానిలో కేజీ సీఎన్జీ ధర రూ. 64.11గా ఉన్నది. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరల రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్నాయి. పార్లమెంటులోనూ ధరల పెరుగుదల అంశాన్ని లేవనెత్తాయి. ఇంధన ధరల విషయంలో గతనెల 31 నుంచి ఏప్రిల్ 7 వరకు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ర్యాలీలను నిర్వహిస్తున్నది. అడ్డూ అదుపు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న పెట్రోల్, డీజల్, వంట గ్యాస్ ధరలు.. పరోక్షంగా నిత్యవసరాల ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. దీని భారం ముఖ్యంగా దేశంలోని సామాన్య మధ్యతరగతి ప్రజలపై పడుతున్నది. ధరలు నియంత్రించడంలో విఫలమవుతున్న కేంద్రంపై దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.