Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
- ఆ మూడు శక్తులు ఒక్కటయ్యాయి
- తెలంగాణతోపాటు అనేక పోరాటాలు స్ఫూర్తిదాయకం
- కమ్యూనిస్టులకు ఆటుపోట్లు సహజం
- అడ్డంకులను అధిగమిస్తాం.. తిరిగి నిలబడతాం...
కన్నూరు (కేరళ) నుంచి బి.వి.యన్.పద్మరాజు
సీపీఐ (ఎం)ను, కమ్యూనిస్టులను నిరోధించాలని చూసే శక్తుల పని పడతామని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హెచ్చరించారు. తమ రాష్ట్రంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని, సీపీఐ (ఎం)ను ఇబ్బంది పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారనీ, వారి ఆటలు సాగనివ్వబోమని తెలిపారు. ఈ క్రమంలో ఆరెస్సెస్, బీజేపీ, ఐయూఎమ్ఎల్, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని వివరించారు. సోషలిజం అజేయమనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ-ఎం) 23వ మహాసభల వేదికైన కేరళ రాష్ట్రంలోని కన్నూరు నగరం ఎర్రజెండాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ సందర్భంగా స్థానిక జవహర్ స్టేడియంలో అమరవీరుల జాతాకు సంబంధించిన పతాకాన్ని స్వీకరించారు. అనంతరం అరుణ పతాకాన్ని సీఎం పినరయి విజయన్ ఆవిష్కరించారు. ఆ తర్వాత నిర్వహించిన సభకు పార్టీ కేరళ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విజయన్ ప్రసంగిస్తూ చారిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాటం, వున్నప్ర వాయిలార్ పోరాటం, తెభాగ పోరాటం, వర్లీ ఆదివాసీ పోరాటాలను గుర్తు చేశారు. ఆయా పోరాటాల స్ఫూర్తితో నాడు, నేడు, ఎప్పుడూ ఎర్రజెండా రెపరెపలాడుతున్నదని చెప్పారు. కమ్యూనిస్టులకు ఇలాంటి ఆటుపోట్లన్నీ సహజమని ఆయన వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన తదితర రంగాల్లో సీపీఐ (ఎం) నేతృత్వంలోని తమ ప్రభుత్వం ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నదని తెలిపారు.కార్యక్రమంలో సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు కె.రామకృష్ణన్, కేంద్ర కమిటీ సభ్యులు కెకె శైలజ, కె.బాలకృష్ణన్‌తోపాటు కన్నూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు అలప్పుజి జిల్లా వాయలూర్ నుంచి, కాసర్‌ఘడ్ జిల్లా కరివల్లూర్ నుంచి తీసుకొచ్చిన అమర వీరుల జ్యోతి, స్థూపాలను పార్టీ నాయకులు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యకర్తల నినాదాలతో జవహర్ స్టేడియం మార్మోగింది. పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు, యువకులతో కూడిన రెడ్ షర్ట్ వాలంటీర్ల బృందం... పతాకావిష్కరణ సమయంలో చేసిన 'రెడ్ సెల్యూట్...' స్ఫూర్తిని నింపింది. సీఎం విజయన్ పతాకావిష్కరణ చేసిన సమయంలోనూ, ఆ తర్వాతా బాణా సంచా పేలుళ్లతో నగరం మార్మోగింది. 'సోషలిజం వర్థిల్లాలి, 23వ పార్టీ మహాసభ జిందాబాద్, ప్రజాతంత్ర విప్లవం వర్థిల్లాలి, సీపీఐ (ఎం) జిందాబాద్...' అంటూ నాయకులు, కార్యకర్తలు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా హౌరెత్తింది.