Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముస్తాబైన కన్నూరు
ఇకె నయనార్ నగర్ నుంచి నవతెలంగాణ ప్రతినిధి
ఎన్నో ప్రజాపోరాటాలకు, ఎందరో అమరవీరులకు ప్రసిద్ధిపొందిన కేరళలోని కన్నూరులో జరగనున్న సీపీఐ(ఎం) 23వ అఖిలభారత మహాసభకు రంగం సిద్ధ మైంది. మరికొన్ని గంటల్లో బుధవారం ఉదయం మహాసభ ప్రారంభం కానుండగా మంగళవారం సాయంత్రానికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, పరిశీలకులు 815 మంది ఈ మహాసభలో పాల్గొంటున్నారు. బుధవారం ఉదయం నుంచి 10వ తేది వరకు ప్రతినిధుల మేథోమథనం సాగనున్నది. దేశంలో పెచ్చరిల్లిన మతోన్మాదంతో పాటు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలకు కారణమైన కేంద్రంలోని బీజేపీ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగనున్నాయి .దేశం ఎదుర్కుంటున్న ఎన్నో సమస్యలను ఈ సమావేశంలో చర్చించి తీర్మానాలు చేయనున్నారు. ఈ మహాసభలో చేసే తీర్మానాల కోసం దేశవ్యాప్తంగా ఉత్సుకత నెలకొంది.ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో జాతీయ మీడియా ప్రతినిధులు కన్నూరుకు చేరుకున్నారు. ప్రతినిధుల సమావేశాన్ని బుధవారం ఉదయం సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించనున్నారు. ప్రారంభ సభ అనంతరం చర్చలు ప్రారంభం కానున్నాయి. చర్చలు సజావుగా సాగేందుకు విస్తృతమైన ఏర్పాట్లను చేశారు.
చేరుకున్న ప్రతినిధులు...
దాదాపుగా మహాసభ ప్రతినిధులందరూ మంగళవారం సాయంత్రానికే కన్నూరు చేరుకున్నారు. సోమవారం ఉదయం నుండి ప్రతినిధుల రాక ప్రారంభమైంది. గుజరాత్‌కు చెందిన ప్రతినిధులు తొలి బృందంగా కన్నూరు వచ్చారు. వారికి ఘనస్వాగతం లభించింది. మంగళవారం బెంగాల్, త్రిపురలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు వచ్చారు.
ఏచూరి రాక...
పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మంగళవారం తెల్లవారుజామున కన్నూరుకు చేరుకున్నారు. ఆయనకు కన్నూరు జిల్లా సీపీఐ(ఎం) కార్మదర్శి ఎంవి జయరాజన్,కేంద్ర కమిటీ సభ్యురా లు కెకె శైలజ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కన్నూరు విమానాశ్రయం రెడ్‌శాల్యూట్ నినాదాలతో మారుమోగింది.
పోరాట స్థలాల నుంచి పోరు జెండాలు...
అణచివేత,వేధింపులపై రైతాంగ పోరాటాలకు చిహ్నంగా చరిత్రలో నిలిచిన పున్నప్ర వాయలార్, కయ్యూరులనుండి పోరుజెండాలను పోరుజెండాల ను కన్నూరుకు తీసుకువచ్చారు. వీటిని మహాసభ ప్రాంగణంతో పాటు,బహిరంగ సభ స్థలిలో ఆవిష్కరించనున్నారు. కేరళలోని వివిధ ప్రాంతాల నుంచి కన్నూరుకు చేరుకున్నాయి.పోరాటవీరులు, ప్రతినిధులు రాకతో కన్నూరు అరుణావరణంగా మారింది.ఎక్కడ చూసిన ఎర్రజెండాలు కనిపిస్తు న్నాయి. మహాసభ ప్రాంగణంలో కమ్యూనిస్టు యోధుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు.
యోధుల పేర్లు...
మహాసభ ప్రాంగణానికి ప్రజల కోసం సర్వసం ధారపోసిన యోధుల పేర్లు పెట్టాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ నిర్ణయించింది. దానిలో భాగంగా ప్రతినిధుల సభ జరుగుతున్న ప్రాంగణానికి ఇకె నయనార్ నగర్ అని పేరుపెట్టారు. బహిరంగ సభ ప్రాంగణానికి ఏకేజీ నగర్ అని, వివిధ సెమినార్లు నిర్వహిస్తున్న ప్రాంగణానికి సి.హెచ్ కమరణ్నగర్, ఎగ్జిబిషన్ ప్రాంతాన్ని కె. వరదరాజన్ నగర్‌గా పేరు పెట్టారు. నిరుపమ్ సేన్ నగర్లో ఇప్పటికే బుక్ ఫెస్టివల్ జరుగుతోంది, మీడియా సెంటర్‌కు చాదాయన్ గోవిందన్ నగర్ అని పేరు పెట్టారు.
సీనియర్ నేతలు లేకుండా..
ఈ మహాసభ కు వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల సీనియర్ నాయకులు, కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్, తమిళనాడు కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన శంకరయ్య హాజరుకావడం లేదు. 98ఏండ్ల అచ్యుతానందన్ తిరువనంతపురంలోని వెలికాకంలోని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎర్నాకులం లో జరిగిన రాష్ట్ర మహాసభ కూడా అనారోగ్య కారణాలతో ఆయన హాజరుకాలేదు. విఎస్ హాజరుకాని తొలి రాష్ట్ర కమిటీ ఇది. ఆ సమావేశంలో ఆయన్ను రాష్ట్ర కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నుకున్నారు. అనారోగ్యం కొనసాగుతుండటంతో ఇంటి వద్ద నుండే ఆయన మహాసభ విశేషాలు తెలుసుకుంటున్నారు.అలాగే తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన శంకరయ్యకు 100 సంవత్సరాలు. అనారోగ్యంతో మధురైలోని తన నివాసంలోనే ఆయన ఉన్నారు. 1964లో సీపీఐ జాతీయ మండలి సమావేశం నుంచి బయటకు వచ్చేసిన 32 మందిలో వీరిద్దరే ప్రస్తుతం జీవించిఉ న్నారు.అనారోగ్య కారణాలతో వీరిద్దరు ప్రస్తుత మహాసభకు హాజరుకావడం లేదు.
పతాకావిష్కరణ చేయనున్న రామచంద్రన్ పిళ్లై
సీపీఐ(ఎం) 23వ అఖిల భారత మహాసభల సందర్భంగా సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ఎస్.రామచంద్రన్ పిళ్లై జెండా ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రారంభ సభ జరగనుంది. ఈ సభలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా కూడా పాల్గొనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రతినిధుల సభ జరుగుతుంది. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాజకీయ ముసాయి తీర్మానాన్ని సభ ముందు ప్రవేశపెట్టనున్నారు.