Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేట్ హాస్పిటల్స్‌పై నియంత్రణ కరువు
- లెక్కాపత్రం లేదు.. వైద్య విధానం లేదు..
- రాష్ట్రానికో విధంగా.. వైద్య చికిత్సలు, పరీక్షలు..
- భారత్‌లో వైద్యరంగానికి పెను సవాళ్లు : డబ్ల్యూహెచ్‌వో
- ప్రభుత్వ వైద్యంపై వ్యయం రెట్టింపు చేయాలి..
మనదేశంలో ప్రయివేటు హాస్పిటల్స్‌పై ప్రభుత్వ నిఘా, నియంత్రణ గాడితప్పింది. కోవిడ్ సమయంలో అది స్పష్టంగా బయటపడింది. కోవిడ్‌పై ఒక్కో చోట ఒక్కోలా వైద్యచికిత్స సాగింది. ప్రయివేటులో వైద్య సేవల బిల్లులు నిబంధనల ప్రకారం ఉండటం లేదు. ఈ విషయాలపై ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేసింది. ప్రభుత్వ వైద్య సేవల్లో నాణ్యత, ప్రయివేటు రంగంపై నియంత్రణ..వెంటనే తీసుకురావాలని తాజా నివేదికలో డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది.
న్యూఢిల్లీ : భారత వైద్యరంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని..ముఖ్యంగా ప్రయివేటు వైద్యంపై నియంత్రణ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ప్రభుత్వ హాస్పిటల్స్ల్లో నాణ్యత, మెరుగైన సేవల్ని అందజేయటం..భారత ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ప్రభుత్వ వైద్యంపై నిధుల వ్యయం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నది. ఆయా దేశాల్లో ప్రభుత్వ, ప్రయివేటు వైద్యవ్యవస్థపై సమీక్ష జరిపిన డబ్ల్యూహెచ్‌వో..ఆ వివరాల్ని పొందుపరుస్తూ నివేదిక విడుదల చేసింది. 'హెల్త్ సిస్టమ్స్ ఇన్ ట్రాన్సీషన్' ప్రొఫైల్స్ పేరుతో నివేదికను రూపొందించింది. ఇందులో పేర్కొన్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి..
భారత్‌లో ప్రయివేటు వైద్యంపై నియంత్రణ కరువైంది. అలాగే ఔషధ నియంత్రణ వ్యవస్థలో చాలా లోపాలున్నట్టు తెలుస్తోంది. ఔషధ నియంత్రణకు సంబంధించి ఏర్పాటుచేసిన ప్రభుత్వ సంస్థల్లో మౌలిక వసతుల కొరత తీవ్రస్థాయిలో ఉంది. నాణ్యమైన సిబ్బంది లేరు. చట్టాలు, నిబంధనలపై వివిధ విభాగాల మధ్య గందరగోళం నెలకొంది. దాంతో నిబంధనావళి అమలు చాలా నాసిరకంగా తయారైంది. క్లినికల్ ఎస్టాబ్లిష్మేంట్ యాక్ట్ (సీఈఏ)-2010ను అనేక రాష్ట్రాలు అమలుజేయటం లేదు.
ప్రయివేటు వైద్య సేవలు దేశవ్యాప్తంగా ఒకేవిధంగా లేవు. ఆయా రాష్ట్రాల్లో ప్రయివేటు హాస్పిటల్స్‌లో రోగులకు అందుతున్న మందులు, ఇతర వైద్య పరీక్షలు లాభాపేక్షతో కూడినవై ఉంటున్నాయి. వైద్య సేవల్లో నాణ్యత, వాటి ఖర్చు, చికిత్సా ప్రభావం ప్రాంతాలను బట్టి, రాష్ట్రాలను బట్టి మారుతోంది.
నిధుల వ్యయం రెట్టింపు
ప్రభుత్వ వైద్యంపై నిధుల వ్యయం మరింత పెరగాల్సిన అవసరముంది. రాబోయే ఐదేండ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావైద్యంపై వ్యయం రెట్టింపు చేయాలి. కేటాయించిన నిధులు సరిగా ఖర్చు అవుతున్నాయా? లేదా?అన్నది చూసుకోవడానికి పటిష్టమైన పాలనా వ్యవస్థను తీసుకురావాలి. ముఖ్యంగా శిక్షణ పొందిన వైద్య సిబ్బందిని పెంచుకోవాలి. నియామకాలు చేపట్టాలి. ఆరోగ్య సేవల్లో నర్సులు,
డాక్టర్ల పాత్ర చాలా ముఖ్యమైంది. పెట్టుబడులను ఉపయోగించి నాణ్యమైన సిబ్బందిని తీసుకురావాలి.
పీఎం జన్ ఆరోగ్య యోజన..అబ్బే
మోడీ సర్కార్ 2018లో పీఎం జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించింది. అర్హులైన కుటుంబాలకు రూ.5లక్షల వైద్య బీమా అందజేసేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఆయా కుటుంబాల్లో తలెత్తితో..అప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా దెబ్బతినకుండా జన్ ఆరోగ్య యోజన ఉపయోగపడు తుందని కేంద్రం చెబుతోంది. అయితే దేశవ్యాప్తంగా ఈ పథకం ప్రయోజనం నామమాత్రంగా ఉందని డబ్ల్యూహెచ్‌వో తన సమీక్షా నివేదికలో పేర్కొన్నది.
అలాగే..ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాల్లో పథకం ప్రయోజనం చాలా తక్కువగా ఉందని నివేదిక తెలిపింది. జన్ ఆరోగ్య యోజన లబ్దిదారుడు ఏ రాష్ట్రంలోనైనా వైద్య చికిత్సను పొందవచ్చు. అయితే మధ్యప్రదేశ్, యూపీ, బీహార్‌కు చెందిన లబ్దిదారులు ఇతర రాష్ట్రాల్లో వైద్యచికిత్సలు పొందలేక పోతున్నారు. జన ఆరోగ్య యోజన కార్డుతో ఇతర రాష్ట్రాల్లో వైద్య చికిత్సలకు ప్రయత్నించినా..లబ్దిదారులకు వైద్య సేవలు అందటం లేదు.
కోవిడ్‌తో కొత్త సమస్యలు
కోవిడ్ సంక్షోభం భారత్‌లో వైద్యవ్యవస్థకు సరికొత్త సవాళ్లు విసురుతోంది. కఠినమైన లాక్డౌన్ వల్ల మొత్తం దేశవ్యాప్తంగా సాధారణ వైద్య సేవలు స్తంభించిపోయాయి. కంటి ఆపరేషన్లు, మోకాలి ఆపరేషన్లు, ఇతర ముఖ్యమైన వైద్య చికిత్సలు..అన్ని తగ్గుముఖం పట్టాయి. కోవిడ్‌కు ముందు వైద్య చికిత్సల్లో రెండింట మూడొంతులు లాక్డౌన్ వల్ల తగ్గిపోయాయి.