Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : తనను అమెరికా వెళ్లకుండా స్థానిక విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా చైర్మెన్ ఆకార్ పటేల్ బుధవారం పేర్కొన్నారు. సీబీఐ తనను నిష్క్రమణ నియంత్రణ జాబితా (ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్)లో చేర్చిందని ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారని, దేశాన్ని విడిచివెళ్లేందుకు అనుమతించలేదని పటేల్ ట్విట్ చేశారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాకి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం కేసు నమోదు చేయడంతో తనను లుక్ అవుట్ జాబితాలో చేర్చినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారని అన్నారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయడం గాని, బెయిల్‌పై విడుదల చేయడం గాని జరగలేదని.. అటువంటప్పుడు తనను లుక్ అవుట్ జాబితాలో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. ఆ నోటీసుల గురించి తనకు తెలియదని.. ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను విమానం ఎక్కేందుకు అనుమతించకపోవడంతో వెనక్కి వచ్చానని అన్నారు. అయితే సూరత్‌కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే తనపై కేసు నమోదు చేయడంతో తన పాస్సోర్ట్ని స్వాధీనం చేసుకున్నారని.. అనంతరం గుజరాత్ కోర్టు తనకు అమెరికా వెళ్లేందుకు అనుమతిచ్చిందని అన్నారు. పాస్‌పోర్ట్‌ని తనకి తిరిగి ఇవ్వమని కోర్టు ఆదేశించిందని, అలాగే మార్చి 1 నుండి మే 30 లోగా అమెరికా వెళ్లవచ్చని పేర్కొందని అన్నారు. సంబంధిత కోర్టు ఆదేశాలను పటేల్ ట్విటర్లో పోస్ట్ చేశారు. షెడ్యూల్ ప్రకారం మిచిగాన్ యూనివర్శిటీ, బార్క్లే యూనివర్శిటీ, న్యూయార్క్ యూనివర్శిటీలలో ప్రసంగించేందుకు పటేల్ అమెరికా వెళుతున్నారు. ప్రయాణ నిషేధంపై తన న్యాయవాదులను సంప్రదించనున్నట్లు తెలిపారు. గతేడాది సీబీఐ తనను విచారణకు హాజరుకావాలని ఆదేశించిందని... తాను విచారణకు హాజరయ్యానని అన్నారు.
మనీలాండరింగ్‌తో పాటు నేరపూరిత కుట్రకు పాల్పడిందని ఆరోపిస్తూ మానవహక్కుల నిఘా సంస్థ అయిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.