Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్నోలో మాంసం, చేపలు విక్రయించే దుకాణాల తరలింపు ఉత్తర్వులపై హక్కుల కార్యకర్తలు
లక్నో : అధిక జనాభా ఉన్న ప్రాంతాల నుండి మాంసం, చేపలు విక్రయించే దుకాణాలను గుర్తించాలని, వాటిని వేరే ప్రాంతాలకు తరలించాలని లక్నో మునిసిపల్ కార్పొరేషన్‌ను మేయర్ ఆదేశించారు. గతవారం లక్నో నగర మేయర్ సంయుక్త భాటి ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ దుకాణాలను జన సాంధ్రత లేని ప్రాంతాలకు తరలించాలని అన్నారు. పునరావాస ప్రక్రియకు సంబంధించిన ప్రాంతాలను గుర్తించే బాధ్యతను అదనపు మునిసిపల్ కమిషనర్ అభరు పాండేకు అప్పగించారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించని, అపరిశుభ్రంగా ఉన్న దుకాణాలను గుర్తించాల్సిందిగా భాటి అధికారులను ఆదేశించారు. నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు తీసుకోవాలనీ, అలాగే నగరంలో పందుల పెంపకాన్ని నిషేధించాలని అన్నారు. ఏప్రిల్ నెలలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంటువ్యాధులపై అవగాహన కార్యక్రమాలను చేపట్టిన అనంతరం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
చిన్న తరహా వ్యాపారులను మాంసం వ్యాపారం నుంచి తరిమికొట్టడం ఈ ఉత్తర్వుల వెనుక అసలు ఉద్దేశమని పలువురు హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఉత్తర్వులతో పెద్ద వ్యాపారులు కొంతమేర నష్టపోయినప్పటికీ.. ఇప్పటికీ లైసెన్సులు పొందని వ్యాపారులు, చిన్నతరహా వ్యాపారులు పూర్తిగా దివాలా తీస్తారని అన్నారు. మేయర్ ప్రతిపాదన అమలైతే చాలా మంది మాంసం వ్యాపారులతో పాటు దాని ద్వారా జీవనోపాధి పొందే కార్మికులు కూడా నష్టపోతారని పైజల్ అనే వ్యాపారి పేర్కొన్నారు. ఉద్యోగానికి అవసరమైన అర్హతలు తనకు లేవని.. దీంతో జీవనోపాధి కోసం ఇ.రిక్షాను నడపాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఈ ఉత్తర్వులతో లైసెన్స్‌లు లేనటువంటి దుకాణాలు మూసివేయబడతాయని అన్నారు. తమ దుకాణాలకు లైసెన్స్‌లు ఇవ్వాలంటూ గత కొన్నేళ్లగా అధికారులను కోరుతున్నామని, అయితే సంబంధిత పత్రాలు లేవంటూ అధికారులు తమను ముప్పతిప్పలు పెడుతున్నారని పలువురు మాంసం విక్రేతలు ఆందోళన వ్యక్తంచేశారు. నూతన నిబంధనలతో లైసెన్స్ ప్రక్రియ మరింత కష్టతరం గా మారిందని ఆల్ ఇండియా జమాయిత్ ఉల్ ఖురేష్ (ఎఐజెక్యూ) సభ్యులు, న్యాయవాది హజి యూసుఫ్ ఖురేషి పేర్కొన్నారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా లెసెన్స్‌లు జారీ చేయడం, రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఏఐజేక్యూ సంస్థ మాంసం వ్యాపారంలో ఉన్న ఖురేషి సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. ఈ రంగంలో ఉన్న బడా వ్యాపారులు తమ వద్ద ఉన్న ఆదాయంతో సులభంగా మరో వ్యాపారాన్ని ప్రారంభించగలరు, లైసెన్సులు పొంద గలరని అన్నారు. చిన్న వ్యాపారులు రోజుకీ రూ. 300 నుంచి రూ. 800 సంపాదిస్తారనీ, ఈ ఉత్తర్వులు వారి జీవనోపాధికి గండికొడతాయని అన్నారు.
మాంసం విక్రేతలలో అధిక శాతం మంది పేద ముస్లిం తరగతులకు చెందినవారేనని సామాజిక కార్యకర్త మహిర్ హసన్ పేర్కొన్నారు. లక్నోలోని అలీగంజ్ రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ.. ఈ చర్యలు మాంసం నాణ్యతపై కూడా ప్రభావం చూపుతాయని అన్నారు. రవాణాకు అధిక సమయం పడుతుందని, దీంతో ఖర్చు అధికమవుతుందని ..దీంతో నాణ్యత దెబ్బతింటుం దని అన్నారు. ఈ వ్యయమంతా వినియోగదా రులపై పడుతుందని... వారు అంత ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉండరని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటంతో అధిక శాతం మంది కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారని.. జనసాంధ్రత తక్కువగా ఉండే ప్రాంతాలకు తరలిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో కబేళాలు, అనధికార మాంసం దుకాణాలు మూసివేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని యోగి ప్రభుత్వం 2017లో పోలీసులను అదేశించింది. దీంతో రాష్ట్రంలో వార్షిక మాంసం ఉత్పత్తి పడిపోయింది. మండీస్లలో పళ్లు, కూరగాయలతో పాటు మాంసం విక్రయానికి కూడా స్థానం కల్పించాలని యూపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఖురేషి పేర్కొన్నారు. అలాగే నిబంధనల ప్రకారం కబేళాలను ఆధునీకరించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. దీంతో వ్యర్థ పదార్థాలను వెంటనే శుభ్రం చేసేందుకు అవకాశం ఉంటుందని, శుభ్రతా ప్రమాణాలు పాటించవచ్చని అన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు ప్రజలకు ఉద్యోగాలు కల్పించేందుకు కషి చేస్తుంటాయని, కానీ మోడీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పేద ప్రజల జీవనోపాధిని కొల్లగొడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.