Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సౌహార్ధ్ర సందేశంలో చైనా కమ్యూనిస్టు పార్టీ
భారత ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో సీపీఐ(ఎం) కీలక పాత్ర పోషించాలని చైనా కమ్యూనిస్టు పార్టీ ఆకాంక్షించింది. సీపీఐ(ఎం) 23వ మహాసభ సందర్భగా పంపిన సౌహార్ధ్ర సందేశంలో చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ ఈ మేరకు ఆకాంక్షను వ్యక్తం చేసింది. దేశాభివృద్ధికి సీపీఐ(ఎం) ఇప్పటికే ఎంతో కృషి చేస్తోందని పేర్కొంది. వంద సంవత్సరాల సుదీర్ఘచరిత్రతో భారత రాజకీయాల్లో సీపీఐ(ఎం) చెరగని ముద్ర వేసిందని, అదే సమయంలో సోషలిజం పట్ల తిరుగులేని విశ్వాసంతో కట్టుబడి ఉందని పేర్కొంది. నిర్ధుష్ట పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వ్యూహాలు రూపొందించుకునే క్రమంలో జరుగుతున్న మహాసభ నూరుశాతం విజయవంతం కావాలని పేర్కొంది. చైనా, భారత ప్రజల నిజమైన అభివృద్ధికి ఉపయోగపడేలా రెండు పార్టీల మధ్య స్నేహసంబంధాలు మెరుగుపడాలని తన సందేశంలో చైనా కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది.
భావితరాలకు స్ఫూర్తి : క్యూబన్ కమ్యూనిస్టు పార్టీ
ప్రజలకు, పార్టీకి మధ్య అవినాభావ సంబంధాలను నెలకొల్పడంతో సీపీఐ(ఎం) చూపుతున్న శ్రద్ద భావితరాలకు స్ఫూర్తిగా ఉంటుందని క్యూబన్ క మ్యూనిస్టు పార్టీ పేర్కొంది. ఈ మేరకు క్యూబన్ కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ పంపిన సౌహార్ధ్ర సందేశంలో సీపీఐ(ఎం) నాయకులు చూపిన ఈ తరహా చొరవ కారణంగానే క్యూభా, భారత ప్రజల మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయని పేర్కొంది. కష్టకాలంలో క్యూబన్ ప్రజలకు సీపీఐ(ఎం) అండగా నిలిచిన తీరును ఎప్పటికి మరవలేమని తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం క్యూబా ప్రజలపై అమలు చేసిన ఆంక్షలను బైడెన్ సర్కారు కూడా అమలుచేస్తోందని , అయినా క్యూబా ప్రజలు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు, ఈ వాస్తవాల నేపథ్యంలో సామ్రాజ్యవాదంపై పోరును కొనసాగించడానికి, ప్రజల, కార్మికుల, రైతుల హక్కుల పరిరక్షణ కోసం మరింత ఉధృతంగా పోరాటాలు చేయాల్సిఉందని తెలిపారు. అటువంటి పోరాటాలే అసమానతలు, వివక్ష, అన్యాయం లేని మెరుగైన ప్రపంచాన్ని సృష్టిస్తాయని పేర్కొన్నారు. ఈ దిశలో రెండు పార్టీల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవాలని పేర్కొన్నారు.
ప్రజానుకూల విధానాలే కేరళలో విజయానికి కారణం : వియత్నాం కమ్యూనిస్టు పార్టీ
సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం అమలు చేసిన ప్రజానుకూల అభివృద్ధి విధానాలే కేరళలో వరుసగా రెండవసారి చారిత్రాత్మక విజయానికి కారణమని వియత్నాం కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది. ఆ పార్టీ సెంట్రల్ కమిటీ పంపిన సౌహార్ధ్ర సందేశంలో ఈ విధానాలే కేరళ రాష్ట్రాన్ని జీఎస్డీపీలో దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాయని పేర్కొన్నారు.
ఈ విజయం పునాదిగా దేశ వ్యాప్తంగా మారిన విజయాలను సాధించేందుకు అవసరమైన దిశానిర్ధేశాన్ని 23వ మహాసభ చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గతంలో కమ్యూనిజానికి కష్టకాలం వచ్చిన సమయంలోనూ సీపీఐ(ఎం)మార్క్సిజానికి, లెనినిజానికి సీపీఐ(ఎం) అంకితమై నిలిచిందని, ఇదే ఆ పార్టీకి ప్రత్యేకతను తెచ్చిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో సైద్దాంతికంగానూ ఇదే కృషిని కొనసాగించాలని కోరారు. రానున్న రోజుల్లో వియత్నాం, భారత ప్రజల మధ్య సౌహార్ధ్ర సంబంధాలు మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు. వియత్నాం వర్కర్స్ పార్టీ పంపిన సందేశంలో మహాసభ విజయవంతం కావాలని ఆకాంక్షను వ్యక్తం చేసింది.