Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందూత్వ శక్తులు, కార్పొరేట్ల మధ్య పొత్తు : మాణిక్ సర్కార్
దేశంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల విస్తృత ఐక్యత నిర్మాణం అవసరమని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ స్పష్టం చేశారు. దేశంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాస్వామిక ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను సీపీఐ(ఎం) నిర్వర్తిస్తుందని పేర్కొన్నారు. బుధవారం కేరళలోని కన్నూర్‌లో సీపీఐ(ఎం) 23వ మహాసభ ప్రారంభ సభలో మాణిక్ సర్కార్ అధ్యక్షోపన్యాసం చేశారు. ''ఉత్తర మలబార్‌లోని కన్నూర్ కేరళలో కమ్యూనిస్టు ఉద్యమానికి మూలా ధారం. మన చరిత్రలో మొట్టమొదటి కమ్యూనిస్టు పార్టీ అమరవీరులు నలుగురు కయ్యూరు అమరవీరులు. మడతిల్ అప్పు, కుంహంబు నాయర్, చిరుకందన్, అబూబకర్ అని మేము గర్వంగా గుర్తు చేసుకుంటాము. 1943లో సీపీఐ మొదటి పార్టీ కాంగ్రెస్‌కు కేవలం రెండు నెలల ముందు బ్రిటిష్ పాలకులు వారిని ఉరితీశారు. అప్పటి నుంచి లెక్కలేనన్ని మంది అమరవీరులు ఉన్నారు. వారందరికీ గౌరవప్రదమైన నివాళులర్పిస్తున్నాను'' అని అన్నారు. ఈ సందర్భంగా లక్షలాది మంది పార్టీ సభ్యులకు, మద్దతుదారులకు, కేరళలోని శ్రామిక ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
హిందూత్వ శక్తులు, కార్పొరేట్ల మధ్య పొత్తు
''23వ పార్టీ మహాసభ కీలక ఘట్టంలో జరుగుతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ సమయంలోనూ దేశం ప్రజాస్వామ్య, లౌకిక వ్యవస్థకు ఇంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోలేదు. రాజ్యాధికారంలో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశ రిపబ్లిక్‌ను పునర్ నిర్మించేందుకు, హిందూ రాష్ట్రాన్ని స్థాపించేందుకు క్రమ పద్ధతిలో పనిచేస్తున్నాయి'' అని పేర్కొన్నారు. ''కేంద్రంలో నిరంకుశ పాలనకు మద్దతిచ్చే హిందూత్వ శక్తులు, కార్పొరేట్ల మధ్య పొత్తు ఉంది. నయా ఉదారవాద, కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరించడం వల్ల ప్రజల పరిస్థితి మరింత దిగజారింది. ప్రబలమైన నిరుద్యోగం, పడిపోతున్న ఆదాయాలు, వేగంగా విస్తరిస్తున్న అసమానతలు ఉన్నాయి. హిందూత్వ విభజన ఎజెండాతో మతపరమైన ఏకీకరణతో దేశ ప్రజలపై దోపిడీని సులభతరం చేస్తుంది. మైనార్టీ ద్వితీయ శ్రేణి పౌరులుగా బహిష్కరణను ఎదుర్కొంటున్నారు'' అని అన్నారు.
''ఇటీవలి కాలంలో హిందూత్వ, కార్పొరేట్ పాలన, దాని విధానాలకు ప్రతిఘటన పెరుగుతోంది. సీఏఏ వ్యతిరేక ఉద్యమం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రాత్మక రైతు పోరాటం, కార్మికవర్గం సార్వత్రిక సమ్మెలు, తాజాగా మార్చి 28-29 రెండు రోజుల సమ్మె, ఇతర అసంఖ్యాక పోరాటాలు ప్రజలు తిరిగి పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని చూపిస్తున్నాయి. వారి హక్కులు, వారి న్యాయమైన డిమాండ్లను అంగీకరించేలా ప్రభుత్వాన్ని బలవంతం చేస్తాయి'' అని పేర్కొన్నారు. ''సెక్యులరిజం, ఫెడరలిజంపై అధికార పార్టీ చేస్తున్న దాడులను ప్రతిఘటిస్తూనే శ్రామిక ప్రజల ఐక్య పోరాటాలను విస్తృతం చేయడం అవసరం'' అని స్పష్టం చేశారు.
''హిందుత్వ, కార్పొరేట్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో సీపీఐ(ఎం), వామపక్ష శక్తులు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు కార్మిక వర్గం, రైతాంగం, ఇతర శ్రామిక ప్రజల పోరాటాలలో ముందంజలో ఉన్నారు'' అని అన్నారు. ''బీజేపీ, ఆర్ఎస్ఎస్తో పోరాడటానికి అన్ని లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల పోరాటాలు, ఉద్యమాల ద్వారా విస్తృత ఐక్యతను నిర్మించడానికి పార్టీ మహాసభ ఉద్దేశపూర్వకంగా, సరైన వ్యూహాత్మక మార్గాన్ని నిర్ణయిస్తుంది'' అని పేర్కొన్నారు. ''పార్టీని సంస్థాగతంగా ఎలా బలోపేతం చేయాలనే దానిపై కూడా పార్టీ మహాసభ చర్చిస్తుంది. తద్వారా శ్రామిక ప్రజల్లోని విశాల వర్గాలను సమీకరించి, సంఘటితం చేయగల సమర్థవంతమైన పార్టీగా ఆవిర్భవిస్తుంది'' అని తెలిపారు.