Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పతాకావిష్కరణ చేసిన రామచంద్రన్ పిళ్లై
- రెడ్‌షర్ట్ వాలంటీర్ల కవాతు ఇకెనయనార్ నగర్ నుంచి
నవతెలంగాణ ప్రతినిధి
రెడ్‌షర్ట్ వాలంటీర్ల కవాతు, చిన్నారుల నృత్య ప్రదర్శనలు, పోరాట గీతాల ఆలాపనలు, అమరవీరులకు నివాళులు, దేశం నలుమూలల నుంచి హాజరైన ప్రతినిధుల నినాదాల మధ్య సీపీఐ(ఎం) 23వ మహాసభ ప్రారంభసూచికంగా ఎకె నయనార్ నగర్లో ఎర్రజెండా ఆకాశానికి ఎగిసింది. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, పొలిట్‌బ్యూరో సభ్యులుఉ ఎస్. రామచంద్రన్ పిళ్లై పతాకావిష్కరణ చేశారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆయనకు సహకరించారు. బుధవారం ఉదయం సరిగ్గా 9.30 గంటలకు పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. అంతకుముందే మహాసభ ప్రాంగణానికి చేరుకున్న ప్రతినిధులు వరుసలలో బారులు తీరి నిలబడ్డారు. వేదికమీద పొలిట్‌బ్యూరో సభ్యులు, కింద ముందు వరసలో కేంద్ర కమిటీ సభ్యులు నిల్చుకున్నారు. కేరళ రాష్ట్ర ప్రతినిధులు పతాకానికి ఎడమవైపున, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు కుడివైపున నిల్చున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పతాకావిష్కరణకు రామచంద్రన్ పిళ్లైని ఆహ్వానించారు. ఆ వెంటనే బ్యాండ్‌మేళంతో విప్లవ గీతాలాపన ప్రారంభమైంది. రెడ్‌షర్ట్ వాలంటీర్ల దళం కవాతు చేసింది. ప్రతినిధుల రెడ్‌సెల్యూట్ నినాదాల మధ్య రామచంద్రన్ పిళ్లైని వేదిక మీదనుండి పతాకం వద్దకు ఏచూరి తీసుకువెళ్లారు. అమరవీరులకు జోహార్లు చెబుతూ సాగుతున్న నినాదాల హారు మధ్యనే పిళ్లై ఎర్రజెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రతినిధులు అమరవీరులకు నివాళులర్పించారు.
యువతరం పైనే బాధ్యత : పిళ్ళై
ఎర్రజెండాను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతరం మీదనే ఉందని రామచంద్రన్ పిళ్లై అన్నారు. దేశం ప్రస్తుతం కీలకమైన తరుణంలో ఉందని, ఈ దశలో తమ వంతు పాత్ర పోషించడానికి యువత ముందుకురావాలని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలను చీలుస్తూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని, అదే సమమంలో కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతోందన్నారు. ఈ మతోన్మాద, కార్పొరేట్ విధానాలపై రాజీలేని పోరాటానికి సిద్ధం కావాలని చెప్పారు. ఈ దిశలో భవిష్యత్ కార్యాచరణను కన్నూరు మహాసభ రూపొందిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సభ నుంచి కొత్త చరిత్ర ప్రారంభమవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.