Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతోన్మాదాన్ని అణచివేసేలా ఉద్యమం...
- బీజేపీని ఒంటరి చేసి... ఓడించటం అత్యంత అవసరం
- ప్రత్యామ్నాయ కార్యక్రమం ద్వారానే పాలక వర్గాల విధానాలకు అడ్డుకట్ట
- సమానత్వానికి అసలైన సూచిక కేరళ
- ఆ రాష్ట్రం.. మనవాభివృద్ధి సూచికల్లో అగ్రగామి :
సీపీఐ (ఎం) 23వ అఖిల భారత మహాసభ ప్రారంభోపన్యాసంలో
ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
- రాజ్యాంగ పరిరక్షణోద్యమంలో కలిసి రావాలంటూ దేశభక్తులకు పిలుపు
- కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు తమ విధానమేంటో చెప్పాలని హితవు
బిగిసిన పిడికిళ్లు.. ఎగిసిన ఎర్రజెండాలు.. మారుమోగిన నినాదాల మధ్య సీపీఐ(ఎం) 23వ అఖిలభారత మహాసభ ఇకె నయనార్ నగర్లో బుధవారం ఉదయం స్ఫూర్తిదాయకంగా ప్రారంభమైంది. మహాసభకు ఆతిథ్యమిస్తున్న కన్నూరు జిల్లాతో పాటు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సీపీఐ(ఎం) కార్యకర్తలు, వామపక్ష అభిమానులతో పాటు, సాధారణ ప్రజానీకంతో తెల్లవారుజామునుంచే నయనార్ అకాడమీ ప్రాంతం కిక్కిరిసి పోయింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజానీకం ఎర్రజెండాను విడిచేది లేదనీ,ముందుకు మునుముందుకు తీసుకుపోతామని నినాదాలు చేశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. వీరి నినాదాలు, పోరాట గీతాల మధ్యే ఉదయం ఎనిమిది గంటల నుంచి మహాసభ ప్రాంగణానికి ప్రతినిధుల రాక ప్రారంభమైంది. కార్యకర్తలు ప్రతినిధులకు పేరుపేరున రెడ్‌సెల్యూట్ చెప్పారు. దేశం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా రెడ్‌సెల్యూట్ చెబుతూ స్పందించారు.
కన్నూరు (కేరళ) నుంచి బి.వి.యన్.పద్మరాజు
దేశంలో లౌకికత్వ పరిరక్షణ కోసం ఉధృతంగా.. రాజీలేని పోరాటాలు చేయటం ద్వారానే హిందూ మతోన్మాదానికి అడ్డుకట్ట వేయగలమని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆ పోరాటాలకు సీపీఐ (ఎం), వామపక్షాలు నాయకత్వ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. వామపక్షాల నాయకత్వంతో కూడిన అలాంటి పోరాటాలే మతోన్మాదానికి నిజమైన విరుగుడని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీని ఒంటరిపాటు చేయటం, దాన్ని ఓడించటమనేవి ఇప్పుడు దేశానికి అత్యంత అవసరమని తెలిపారు. ఈ క్రమంలో కేవలం ఎన్నికల ద్వారానే ఆ పార్టీని ఓడించటమనేది కాకుండా రాజకీయ సైద్ధాంతికతతోపాటు సామాజిక, సాంస్కృంతిక రంగాల్లో కూడా పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. ఇందుకోసం వామపక్షాలు, ముఖ్యంగా సీపీఐ (ఎం) తన బలాన్ని పెంచుకోవటంతోపాటు పీడిత ప్రజల కోసం ఉధృత పోరాటాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సహా ప్రాంతీయ పార్టీలన్నీ లౌకికత్వాన్ని రక్షిచటంలో తామెలాంటి విధానాన్ని, పద్ధతిని అవలంభిస్తున్నామో..? ఎటువైపు నిలబడుతున్నామనే విషయాన్ని పరిశీలించుకోవాలని ఆయన హితవు పలికారు.
సీపీఐ (ఎం) అఖిల భారత 23వ మహాసభ బుధవారం కేరళలోని కన్నూరు (ఇకె నయనార్ నగర్)లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మాణిక్ సర్కారు అధ్యక్షతన ఆరంభమైంది. ఈ సందర్భంగా ఏచూరి ప్రారంభోపన్యాసం చేస్తూ...లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర భారతాన్ని మనం కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. దీంతోపాటు శ్రామికవర్గపు హక్కులనూ పరిరక్షించాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి... ఆరెస్సెస్ ఆదేశాలకు అనుగుణంగా మరింత దూకుడుగా హిందూత్వ అజెండాను ముందుకు తెచ్చి, అమలు చేస్తోందని తెలిపారు. ఇదే సమయంలో సరళీకృత ఆర్థిక విధానాలను గతం కంటే రెట్టింపు వేగంతో అమలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మతోన్మాదం, కార్పొరేట్ విధానాలను ఒక గొలుసులాగా కలిపి అమలు చేస్తోందని తెలిపారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల ఆస్తులైన ప్రభుత్వరంగ సంస్థలను యదేచ్ఛగా అమ్ముతున్నదని తెలిపారు. తద్వారా దేశాన్ని లూఠీ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ... దానికి పునాదులైన లౌకిక ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన అనే మౌలికాంశాలకు తూట్లు పొడుస్తున్నదని హెచ్చరించారు. దీంతోపాటు రాజ్యాంగ సంస్థలైన పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ తదితరాలకు ఉన్న స్వతంత్రను భంగపరుస్తూ వాటిని తన అధీనంలోకి తెచ్చుకున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
'పెట్రో' పెంపు.. పెరిగిన దరిద్రం, నిరుద్యోగం...
మరోవైపు అడ్డూ అదుపూ లేకుండా అనునిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజానీకంపై ఆర్థిక భారాలు నానాటికీ పెరిగిపోతున్నాయని ఏచూరి ఈ సందర్భంగా తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం... ఇప్పటి వరకూ 14 సార్లు వాటి ధరలు పెరిగాయని గుర్తు చేశారు. కోవిడ్ కంటే ముందే దేశంలో ఆర్థిక సంక్షోభం మొదలైందనీ, కరోనా సమయంలో అది మరింత తీవ్ర రూపం దాల్చిందని తెలిపారు. ఈ క్రమంలో ఒకవైపు దరిద్రం, ఆకలి, మరోవైపు నిరుద్యోగం దేశంలో తాండవిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే కోవిడ్ సమయంలో కార్పొరేట్లు, బడాబాబులు లక్షల కోట్ల సంపదను పోగేసుకున్నారని గుర్తు చేశారు. ప్రజల గురించి పట్టించుకోని మోడీ సర్కార్... పెద్దలకు మాత్రం లక్షల కోట్ల మేర రాయితీలనిచ్చిందని వివరించారు.
దేశానికి కేరళ మార్గదర్శం...
మనదేశం అన్ని రకాలుగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్డీఎఫ్) నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం.. మిగతా అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచిందని ఏచూరి చెప్పారు. లౌకికత్వాన్ని కాపాడటంలో రాజీలేని పోరు, కుల, మతాలకతీతంగా సమానత్వాన్ని పెంపొందిం చటం, లింగ వివక్ష లేకుండా చూడటం ద్వారా ఆ రాష్ట్రం తన ప్రత్యేతకను చాటి చెప్పిందని వివరించారు. నూతన సరళీకృత ఆర్థిక విధానాలకు ప్రత్యా మ్నాయంగా ప్రజలకు ఉపయోగపడే విధానాలతో అది ముందుకెళుతున్నదని చెప్పారు. ఫలితంగా మానవాభివృద్ధి సూచికల్లో అగ్రగామిగా నిలిచి ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకుందని ప్రశంసించారు.
వారిని స్మరించకుండా 'తీర్థ యాత్ర' పూర్తి కాదు...
సాధారణ ప్రజలు తీర్థ యాత్రలు చేస్తుంటారనీ, కానీ కమ్యూనిస్టులకు అవేవీ ఉండబోవని ఏచూరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే ఒకవేళ వారు తీర్థయాత్రలు చేయాల్సి వస్తే... కేరళలోని కయ్యూరు, కరివెల్లూరు అమరవీరుల స్థలాలను సందర్శించకుండా, వారికి అంజలి ఘటింకుండా ఆయా యాత్రలు పూర్తి కాబోవని అన్నారు. అంతటి వీరోచిత పోరాటాలు, ప్రజా సాంప్రదాయాలతో కన్నూరు ద్విగుణీకృతమైందని తెలిపారు. పార్టీ 23వ మహాసభను ఇక్కడ నిర్వహించుకోవటం ఆనందదాయకంగా ఉందని చెప్పారు. కేరళ కమ్యూనిస్టు యోధులు పి.కృష్ణ పిళ్లై, ఈఎమ్ఎస్ నంబూద్రిపాద్, ఏకే గోపాలన్ తదితరుల త్యాగాలను, వారు ప్రజలకు, పార్టీకి చేసిన సేవలను ఏచూరి ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సౌహార్ద సందేశమివ్వటానికి విచ్చేసిన సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాతోపాటు సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బృందాకరత్, రామచంద్రన్ పిళ్లై, పినరయి విజయన్, కొరియెడి బాలకృష్ణన్, సుభాషిణీ అలీ, బిమన్ బసు, బివి రాఘవులు, ఎమ్డీ సలీం, హన్నన్ మొల్లా, ఎమ్ఏ బేబి, కె.రామకృష్ణన్, నిలోత్పల్ బసు, తపన్‌సేన్, సూర్యాకాంత్ మిశ్రా వేదికపై ఆసీనులయ్యారు.