Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మన్ ముగింపు ఉపన్యాసం లేకుండానే రాజ్యసభ వాయిదా
- కొత్త పథకం కింద వంద పెన్షన్ల విరాళం
న్యూఢిల్లీ : రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జరిగిన పార్లమెంట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో ఛైర్మన్ వెంకయ్య నాయుడు సాంప్రదాయసిద్ధమైన ముగింపు ఉపన్యాసం లేకుండానే రాజ్యసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఐఎన్ఎస్ విక్రాంత్‌ను కాపాడేందుకు చేపట్టిన నిధుల సమీకరణ కార్యక్రమంలో అవినీతి చోటుచేసుకుందంటూ శివసేన ఆధ్వర్యాన ప్రతిపక్షాలు సభలో ఆందోళన చేశాయి. ఈ వ్యవహారంలో బిజెపి నేత కిరీటి సోమయ్య, ఆయన కుమారుడు నీల్‌పై ఎఫ్ఐఆర్ దాఖలైంది. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే 19 నిముషాలకే వాయిదా పడింది. జీరో అవర్ ప్రారంభమైన తర్వాత జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను లేవనెత్తేందుకు సభ్యులను అనుమతించారు. శివసేన సభ్యుడు సంజరు రౌత్ సభా వేదిక వద్దకు దూసుకొచ్చి ఐఎన్ఎస్ విక్రాంత్ కుంభకోణాన్ని ప్రస్తావించారు. ఎన్‌సిపి, కాంగ్రెస్, తృణమూల్ సభ్యులు లేచి నిలుచుని సంఘీభావం ప్రదర్శించారు. జీరో అవర్ వరకైనా సభను సాగనివ్వాలని, ఇటువంటి ఆందోళనల వల్ల సభ ప్రతిష్ట దెబ్బతింటుందని వెంకయ్య నాయుడు అన్నారు. సంజరు రౌత్‌తో ఛైర్మన్ వెంకయ్య నాయుడికి వాగ్యుద్ధం జరిగింది. సభ్యులు, సభాధ్యక్షుడిని ఆదేశించలేరని ఆయన వ్యాఖ్యానిం చారు. ''ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, సభా ప్రమాణాలకు, వ్యవహార శైలికి పూర్తి విరుద్ధంగా వుంది. ఇది చాలా ఆందోళనకర పరిణామం'' అని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. సాంప్రదా యానుసారం సభ ముగింపులో చేయాల్సిన ప్రసంగం లేకుండానే సభను వాయిదా వేసినట్లు ప్రకటించారు. ప్రజా విధ్వంసక ఆయుధాలు వాటి డెలివరీ వ్యవస్థల (అక్రమ కార్యకలాపాల నిషేధం) సవరణ బిల్లు, 2022ను బుధవారం రాజ్యసభ ఆమోదించింది. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల ఆస్తులను స్తంభింప చేయడానికి ప్రభుత్వానికి అధికారాన్ని ఇస్తోంది. మూజువాణీ ఓటుతో సభ బిల్లును ఆమోదించింది. ఈ తరుణంలో ఇటువంటి చర్య అవసరమని సభ్యులందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
లోక్‌సభ నిరవధిక వాయిదా,
177 గంటలు పనిచేసిన లోక్‌సభ
రెండో విడత బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేశారు. మొత్తంగా 27 రోజులు సమావేశమైన సభ 177 గంటల 50నిముషాలు పనిచేసింది. కేంద్ర బడ్జెట్‌పై సాధారణ చర్చ 15గంటల 35 నిముషాలు సాగింది. అందులో రైల్వే పద్దులపై చర్చే 12 గంటల 59నిముషాలు జరిగింది. రోడ్డు రవాణా, హైవేలపై 11గంటల 28నిముషాలు, పౌర విమానయానంపై 7గంటల 53నిముషాలు, వాణిజ్య మంత్రిత్వ శాఖపై 6గంటల 10నిముషాలు చర్చ సాగింది. 12బిల్లులను తిరిగి ప్రవేశపెట్టగా, 13 బిల్లులు ఆమోదించబడ్డాయి.
వంద పెన్షన్ల విరాళం
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గతేడాది 7వ తేదీన ప్రారంభించిన 'డొనేట్ ఎ పెన్షన్' చొరవకు స్పందన బాగుందని రాజ్యసభలో ప్రభుత్వం తెలియజేసింది. దాదాపు వందమంది నుంచి పెన్షన్లు విరాళంగా అందాయని పేర్కొంది. అసంఘటిత రంగ కార్మికుల కోసం చేపట్టిన పెన్షన్ పథకం ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్ ధన్ కింద యజమానులు కనీసం ఒక ఏడాది కంట్రిబ్యూషన్లను చెల్లించడానికి ఈ పథకం అనుమతిస్తోంది.
ఉద్యోగుల తరపున లేదా మరే ఇతర అర్హత గల కార్మికుని తరుపునైనా దీన్ని చెల్లించవచ్చు. కార్మికుని వయసు ఆధారంగా నెలకు రూ.660 నుంచి రూ.2400 వరకు ఏడాది కాలం కంట్రిబ్యూషన్లను దాతలు చెల్లించాల్సి వుంటుందని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి రామేశ్వర్ తెలి తెలిపారు.
మార్చి 31నాటికి దాదాపు వందమంది వ్యక్తులు లేదా యజమానులు ముందుకొచ్చి విరాళాలు అందజేశారని తెలిపారు.