Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకికవాదంపై తీవ్రమైన దాడి
- కాంగ్రెస్‌ది సూడో లౌకికవాదొం ఆ పార్టీ రాజీ పడుతోంది
- ''లౌకికవాదం సవాళ్లు'' సెమినార్లో ప్రకాశ్ కరత్
కామ్రేడ్ సిహెచ్ కనరన్ నగర్ నుంచి నవతెలంగాణ ప్రతినిధి
దేశంలో పెచ్చురిల్లుతున్న హిందూత్వ మతోన్మాదంపై అన్ని వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ స్పష్టం చేశారు. లౌకికవాదంపై తీవ్రమైన దాడి జరుగుతుందని, దాంతోపాటు ప్రజాస్వామ్యం, ఫెడరలిజంపై కూడా దాడి జరుగుతుందని పేర్కొన్నారు. హిందూత్వంపై కాంగ్రెస్ పూర్తిస్థాయిలో పోరాటం చేయటం లేదని, లౌకికవాదంపై ఆ పార్టీ రాజీపడుతుందని అన్నారు. సీపీఐ(ఎం) 23వ అఖిల భారత మహాసభ సందర్భంగా కేరళలోని కన్నూర్‌లో కామ్రేడ్ సిహెచ్ కనరన్ నగర్ (టౌన్ స్క్వేర్) ''లౌకివాదం-సవాళ్లు''పై సదస్సు జరిగింది. సీపీఐ(ఎం) కేంద్ర కమిటి సభ్యులు ఈపి జయరాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రకాశ్ కరత్ మాట్లాడారు. ఈ సదస్సుకు కాంగ్రెస్ నేత శశిథరూర్‌ను ఆహ్వానించినా, ఆయన హాజరు కాకపోవడం బాధాకరమని అన్నారు. ఇదే లౌకికవాదంపై కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏంటో స్పష్టం అవుతుందని విమర్శించారు. లౌకికవాదంపై కాంగ్రెస్, సీపీఐ(ఎం) ది ఒకే అభిప్రాయమని, కానీ ఇటీవలి కాంగ్రెస్ హిందూత్వానికి రాజీ పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో రాజకీయంగా తమలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని, అయితే లౌకికవాదంపై వెనక్కి తగ్గడం దారుణమని అన్నారు. బీజేపీ హిందూత్వ విధానాల అమలకు కాంగ్రెస్ మద్దతు పలుకుతుందని, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అది తేటతెల్లమైందని అన్నారు. 50 శాతం లౌకివాదం, 50 హిందూత్వమని కాంగ్రెస్ అంటుందని, దాన్ని తాము అంగీకరించమని స్పష్టం చేశారు. తాము లౌకికవాదానికే కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. లౌకివాదం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజం కోసం జరిగే పోరాటాలకు వామపక్షాలు నాయకత్వం వహిస్తాయని స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ నియంత్రణలో పని చేస్తోందని, మెజారిటీవాదాన్ని ముందుకు తెస్తోందని విమర్శించారు. ఇది లౌకికవాదానికి తీవ్రమైన ముప్పు అని అన్నారు. దేశంలోని మోడీ సర్కార్ హిందూత్వ మతోన్మాదంపైన, నయా ఉదారవాద విధానాలపై ఏకకాలంలో పోరాటం చేయాలని సూచించారు.
లౌకికవాదాన్ని పరిరక్షించుకుందాం
- సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
బీజేపీ, ఆర్ఎస్ఎస్లు సూడో లౌకికవాదుని అంటున్నాయనీ, అయితే తామే నిజమైన లౌకికవాదులమని అన్నారు. లౌకిక వాద సూత్రాలకు విరుద్ధంగా బీజేపీ చర్యలు ఉన్నాయని విమర్శించారు. లౌకికవాదాన్ని విచ్ఛిన్నం చేసి, దాని స్థానంలో హిందూత్వాన్ని తీసుకొస్తుందని దుయ్యబట్టారు. మోడీ హిందూత్వ విధానాలపై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. తొలిత వివిధ అంశాలపై సీపీఐ(ఎం), ఇతర నేతలు రాసిన ఐదు పుస్తకాలను ప్రకాశ్ కరత్, డి.రాజా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కన్నూర్ జిల్లా కార్యదర్శి ఎంబి జయరాజన్, సీపీఐ(ఎం) నేతలు ఎంబి గోవిందన్ మాస్టార్, రామచంద్రన్ కండపల్లి తదితరులు పాల్గొన్నారు.