Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్బులు కట్టి అప్డేట్ చేయాల్సి వస్తోంది : కాగ్
- అప్డేట్ కోసం కేంద్రాల వద్ద పౌరులు పడిగాపులు
- డబ్బులు కట్టి అప్డేట్ చేయాల్సి వస్తోంది : కాగ్ నివేదిక
- చిరునామా గుర్తింపు లేకుండానే ఆధార్ జారీ
- బయోమెట్రిక్ తీసుకున్నా.. డూప్లికేట్ ఎలా సాధ్యమవుతోంది..
- లోపాల్ని సవరించుకోవటం లేదు..
న్యూఢిల్లీ : 'ఆధార్ కార్డ్' లేకుండా పౌరుల నిత్య జీవితంలో ఏ పని జరగటం లేదు. ప్రభుత్వ, ప్రయివేటు పనుల్లో పౌరుల గుర్తింపు కార్డుగా, చిరునామా గుర్తింపు కార్డుగా విరివిగా వాడుతున్నారు. పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా, మొబైల్ ఫోన్ కొనుగోలు, సిమ్ కార్డ్ కనెక్షన్, వాహనాలు, భూముల కొనుగోలు..ఇలా అన్నింటా ముందు అడిగేది ఆధార్ కార్డ్. ఇంతటి కీలకమైన ఆధార్ 'విశిష్ట గుర్తింపు సంఖ్య' జారీలో అనేక అవకతవకలు ఉన్నాయని 'కాగ్' అక్షింతలు వేసింది. బయోమెట్రిక్ తీసుకోవటంలో లోపాలున్నాయని, ఆధార్ డూప్లికేషన్ జరుగుతోందని, ఆధార్ ఎన్రోల్మేంట్లో అనేక తప్పులున్నాయని 'కాగ్' ఎత్తిచూపింది. అయితే వీటిపై స్పందించిన 'ఆధార్' అధికారులు..బయోమెట్రిక్ లోపాలున్న మాట వాస్తవమే అయినా..99.9శాతం ఆధార్ జారీ సమర్థవంతగా సాగుతోందని తెలిపారు. ఆధార్‌పై కాగ్ తన ఆడిట్ నివేదిక విడుదలచేయటం ఇదే మొదటిసారి. ఈ నివేదికలో పేర్కొన్న ముఖ్యాంశాలు ఈవిధంగా ఉన్నాయి..
భారత్‌లో నివసించే వారికే
2014-15 నుంచి 2018-19 మధ్యకాలంలో 'ఆధార్' వ్యవహారాల్ని కాగ్ పరిశీలించింది. ఐదేండ్ల లోపు చిన్నారులకు ఆధార్ జారీ చేస్తున్న విధానం 'ఆధార్ చట్టా'నికి విరుద్ధంగా జరుగుతోందని తేల్చింది. చట్టంలో పేర్కొన్నదాని ప్రకారం భారత్‌లో నివసించే వారికి మాత్రమే ఆధార్ కార్డ్ ఇవ్వాలి. చిరునామా గుర్తింపు అత్యంత ముఖ్యమైంది. కానీ తప్పుడు చిరునామాలు వస్తున్నా..వారికి ఆధార్ జారీ చేస్తున్నారని కాగ్ గుర్తించింది.
వేరు వేరు చిరునామాలు..ఒకే రకమైన బయోమెట్రిక్‌తో దరఖాస్తు చేస్తున్నా వారికి ఆధార్ జారీ అవుతోంది. దాంతో డూప్లికేట్ ఆధార్లు పొందడానికి ఆస్కారం ఏర్పడుతోంది. దీనిని గుర్తించి 'ఉడారు' సవరించలేదు. ఈ ఆరోపణఫై స్పందించిన 'ఉడారు', డూప్లికేట్ ఆధార్ పొందటం 99.9శాతం సాధ్యం కాదని, బయోమెట్రిక్ సరిగా లేనివారి విషయంలో డూప్లికేట్స్ ఏర్పడే అవకాశముందని 'ఉడారు' పేర్కొన్నది. అప్డేట్ ద్వారా వీటిని అడ్డుకుంటున్నామని తెలిపింది.
అప్డేట్ చేసుకోనివ్వాలి..
5ఏండ్లలోపు చిన్నారుల ఎన్రోల్మేంట్ విధానాన్ని, ఆధార్ జారీని కాగ్ తప్పుబట్టింది. బయోమెట్రిక్ తీసుకోవటం సాధ్యం కానప్పుడు..స్వచ్ఛంద అప్డేట్కు అవకాశం కల్పించాలని కాగ్ అభిప్రాయపడింది. అప్డేట్ కోసం రుసుములు చెల్లించినా..డాటా నమోదులో అనేక తప్పులు దొర్లుతున్నాయని, సర్వీస్ ప్రొవైడర్ల వైఫల్యానికి పౌరులు మూల్యం చెల్లించాల్సి వస్తోందని కాగ్ ఆరోపించింది. ఉదాహరణకు పాన్ కార్డ్‌ను ఆధార్‌కు అనుసంధానం చేయాలని కేంద్రం నిబంధన విధించింది. రెండు కార్డుల్లో పేరు, పుట్టినరోజులో చిన్న తేడా ఉన్నా అనుసంధానం జరగటం లేదు.