Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్లో భారీ కేటాయింపులు
- మొత్తం నిధుల్లో కేవలం 11శాతం వ్యయం
- దాంతో..పోస్ట్ మెట్రిక్ స్థాయిలో పడిపోతున్న ఎన్రోల్మేంట్
న్యూఢిల్లీ : ప్రజల్ని మోడీ సర్కార్ ఎలా మభ్యపెడుతుందో ప్రత్యక్ష ఉదాహరణ 'ఎస్సీ ఉపకారవేతనాల పథకం'. ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తూ..కొన్ని వందల కోట్లు ఖర్చు చేస్తోంది. దాంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది దళిత విద్యార్థులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. దళిత విద్యార్థుల్ని చదువులో ముందుకు తీసుకెళ్లేందుకు, విద్యలో సమానత్వాన్ని సాధించేందుకు తీసుకొచ్చిన పథకం 'ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్-ఎస్సీ'. ఈ పథకానికి నానారకాలుగా మార్పులుచేసి, నిబంధనల్ని కఠినతరం చేసి..పథకాన్ని మోడీ సర్కార్ దాదాపు నిర్వీర్యం చేసింది. గత రెండేండ్లుగా ఈ పథకం దాదాపు అటకెక్కిందనే చెప్పొచ్చు. పథకం అమలులో కేంద్రం తన బాధ్యతగా ఒప్పుకున్నమేరకు నిధులు విడుదల చేయాలి. కానీ గతకొన్నేండ్లుగా కేవలం 11శాతం నిధుల్ని విడుదల చేస్తోంది. ప్రీ మెట్రిక్ స్థాయిలోనే పథకం ప్రయోజనాన్ని దెబ్బతీయటంతో, పోస్ట్ సెకండర్ లెవల్లో దళిత విద్యార్థుల ఎన్రోల్మేంట్ దారుణంగా పడిపోయింది. దళిత కుటుంబాల ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వాల నుంచి తగిన సహకారం, మద్దతు లేకపోవటం వల్లే పోస్ట్ సెకండరీ లెవల్లో దళిత విద్యార్థుల ఎన్రోల్మేంట్ పడిపోయిందని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకమైన ఎస్సీ-స్కాలర్‌షిప్స్‌లో కేంద్రం తన వాటాను 90శాతం నుంచి 60శాతానికి తగ్గించుకుంది. మిగతా 40శాతం నిధులు రాష్ట్రం భరించాలి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం
ముందుగా తన వంతు నిధులు విడుదల చేశాకే..కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. అటు తర్వాత కూడా పథకం అమలుపై అనేక కొర్రీలు విధిస్తోంది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక..ఆదాయం పరిమితి విధించింది.
చేసింది గోరంత!
కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక, 2021-2026 వరకు ఐదేండ్లలో రూ.35,219 కోట్లు వ్యయం చేయనున్నట్టు కేంద్రం భారీ ప్రకటన చేసింది. ప్రతి ఏటా సగటున దాదాపు రూ.7వేల కోట్లు పథకం కోసం ఖర్చు చేస్తామని చెప్పింది. తీరా బడ్జెట్ దగ్గరకు వచ్చే సరికి కేంద్రం 2021-22లో రూ.3,415కోట్లు(అంచనా) కేటాయించింది. 2021 నుంచి కొత్త నిబంధనల ప్రకారం..హాస్టల్ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కింద రూ.4వేల నుంచి రూ.13,500 వరకు అందజేయాలి. రూ.2500నుంచి రూ.7వేలు డే స్కాలర్స్‌కు ఇవ్వాలి. అయితే 2010 నిబంధనల్లో చెప్పినదానితో పోల్చితే స్కాలర్షిప్ మొత్తం ఏమాత్రమూ పెరగలేదు. కానీ అనేక కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. గత నిబంధనల్లో కుటుంబ ఆదాయం పరిమితి రూ.2లక్షలుగా పేర్కొన్నారు. వార్షిక కుటుంబ ఆదాయం రూ.2లక్షలు దాటితే స్కాలర్షిప్ పథకం వర్తించదు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు పథకం వర్తింపజేయాలన్న ఆలోచన ఉంటే ఆదాయ పరిమితి భారీగా పెంచేవారు. కానీ కేంద్రం అలా చేయలేదు. ఇప్పుడున్న ద్రవ్యోల్బణం ఇతర పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకోవాలి. కానీ అలా జరగలేదు. వార్షిక ఆదాయ పరిమితి రూ.2.5లక్షలగా నిర్ణయించింది. కేంద్ర ప్రాయోజిత పథకమైన దీంట్లో కేంద్రం తన వాటాగా 90శాతం, రాష్ట్రం 10శాతం నిధుల వ్యయాన్ని అమలుజేసేవి. వాటాల నిష్పత్తిని డిసెంబర్ 23, 2020లో మోడీ సర్కార్ సమూలంగా మార్చేసింది. 60:40గా ఫిక్స్ చేసింది. దాంతో ఇక నుంచి పథకం అమలులో విద్యార్థులకు అందజేసేదాంట్లో 60శాతం ఇవ్వబోతున్నట్టు కేంద్రం తెలిపింది.