Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ, తమిళనాడులో పారిశుధ్య కార్మికుల మరణాలు అత్యధికం
న్యూఢిల్లీ : మురుగు నీటి నాలాలు, కాల్వల వద్ద జరిగిన ప్రమాదాల్లో ఎంతోమంది పారిశుధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. 2016-20 మధ్యకాలంలో చేతితో పారిశుద్ధ పనులు చేస్తున్న స్కావెంజర్స్ 472మంది చనిపోయారని రామన్ మెగాసెస్ అవార్డ్ గ్రహీత, సామాజికవేత్త బెజవాడ విల్సన్ తెలిపారు. అయితే మోడీ సర్కార్ గత మూడేండ్లలో మాన్యువల్ స్కావెంజర్స్ మరణాలు లేవని తాజాగా పార్లమెంట్లో వెల్లడించింది. అత్యంత ప్రమాదకరమైన మురుగు నీటి నాళాలు, కాల్వల్లో పడి కార్మికులు చనిపోతున్నారని, అంతేతప్ప దేశంలో ఎక్కడా మాన్యువల్ స్కావెంజర్స్ లేవని కేంద్రం తెలుపుతోంది. అయితే ఈ విషయంలో సామాజిక కార్యకర్తలు, కేంద్రం చెబుతున్న గణాంకాలకు పొంతన ఉండటం లేదు.
గత మూడేండ్లలో పారిశుద్ధ్య కార్మికుల మరణాలు ఉత్తరప్రదేశ్, తమిళనాడులో ఎక్కువగా చోటుచేసుకున్నా యని, సెప్టిక్ ట్యాంక్లు, మురుగునీటి కాల్వల వద్ద జరిగిన ప్రమాదాల్లో మొత్తం 161మంది కార్మికులు చనిపోయారని రాజ్యసభలో కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. అయితే మురుగునీటి కాల్వలు, సెప్టిక్ ట్యాంక్లలో కార్మికులు చిక్కుకుపోయి.. ప్రమాదాలు జరిగిన ఘటనల్లో మాత్రమే మరణాలు చోటుచేసుకున్నాయని, ఇలాంటి ఘటనల వల్ల తమిళనాడులో 27మంది, యూపీలో 26మంది కార్మికులు చనిపోయారని కేంద్రం తెలిపింది. అంతేగాక.. ఎక్కడా కూడా కార్మికుల చేతులతో పారిశుధ్య పనులు చేయించటం లేదని, వివిధ రకాల పరికరాలు, యంత్రాలు, పనిముట్లతో పనులు కొనసాగిస్తున్నారని కేంద్ర మంత్రి వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మాన్యువల్ స్కావెంజర్స్ (పరికరాలతో కాకుండా చేతులతో పారిశుద్ధ్య పనులు చేసేవారు) 58,098మంది పనిచేస్తు న్నారని తెలిపారు. వీరికి పునరావాసం కల్పించటం కోసం రూ.100కోట్లు కేటాయించినట్టు కేంద్రం వెల్లడించింది. మరుగుదొడ్లు, మురుగునీటి నాళాల్ని శుభ్రం చేయడానికి, మానవ వ్యర్థాల్ని ఎత్తడానికి పారిశుద్ధ కార్మికుల్ని (మాన్యువల్ స్కావెంజర్స్) ఉపయోగించటాన్ని నిషేధిస్తూ కేంద్రం 2013లో చట్టం తీసుకొచ్చింది. దాంతో అనేక మంది మాన్యువల్ స్కావెంజర్స్ ఉపాధి కోల్పోతారు కాబట్టి వారి పునరావాసం, నగదు సాయం కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకు రావాలని నిర్ణయించింది. అయితే మాన్యువల్ స్కావెంజర్స్ పునరావాస పథకం అమలును పర్యవేక్షించే యంత్రాంగం లేదని, దేశంలో చట్టాన్ని తీసుకొచ్చినా యథావిధిగా మాన్యువల్ స్కావెంజింగ్ పనులు కొనసాగుతున్నాయని సామాజికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.