Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రలో బీజేపీ నాయకుడు,
- అతడి కుమారుడిపై ఆరోపణలు
న్యూఢిల్లీ : 'ఐఎన్ఎస్ విక్రాంత్' విరాళాల అంశం..మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. యుద్ధ నౌక పేరిట విరాళాలుగా సేకరించిన రూ.57కోట్ల మొత్తాన్ని దారిమళ్లించి..దోచుకున్నారని బీజేపీ నాయకుడు కిరిట్ సోమయ్య, అతడి కుమారుడు నీల్‌పై ముంబయి పోలీసులు కేసు నమోదుచేశారు. భారత నావికాదళంలో మొట్టమొదటి యుద్ధ నౌక 'ఐఎన్ఎస్ విక్రాంత్'కు తిరిగి పూర్వపు స్థితికి తీసుకొచ్చేందుకు మహారాష్ట్రలో బీజేపీ పెద్ద ఎత్తున విరాళాలు సేకరించింది. ఇలా సేకరించిన రూ.57కోట్ల విరాళాల మొత్తం గవర్నర్ కార్యదర్శి కార్యాలయానికి అందజేయలేదని మాజీ సైనికాధికారి బబన్ భోస్లే ట్రాంబే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈనేపథ్యంలో అక్కడి పోలీసులు బీజేపీ నాయకుడు సోమయ్య, అతడి కుమారుడు నీల్‌పై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం, మాజీ ఎంపీ సోమయ్య 2013-14 మధ్య ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం విరాళాలు సేకరించాడు. ఇలా సేకరించిన కోట్ల రూపాయల్ని తన నిర్మాణరంగ వ్యాపారంలోకి మరలించాడని బబన్ భోస్లే ఆరోపణలు చేశాడు. ఈనేపథ్యంలో పోలీసులు సోమయ్య, అతడి కుమారుడు నీల్‌పై సెక్షన్ 420, 406ల కింద కేసు నమోదుచేశారు. దీనికి సంబంధించి 34మందిని నిందితులుగా పేర్కొన్నారు. సేకరించిన విరాళాలు, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాల్సిందిగా సోమయ్య, నీల్లను పోలీసులు కోరారు. ఇదే అంశంపై రెండు రోజుల క్రితం శివసేన ఎంపీ సంజరు రౌత్ కూడా ఆరోపణలు చేశారు. ప్రజల నుంచి రూ.57కోట్లు విరాళాలుగా సేకరించి, అక్రమంగా వాటిని తరలించారని సోమయ్య, నీల్‌పై ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణ జరిపి నిజానిజాల్ని తేల్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.