Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకిక, ప్రజాతంత్ర శక్తుల బలోపేతంతోనే బీజేపీ ఓటమి
- విలేకరుల సమావేశంలో సీతారాం ఏచూరి
ఇకె నయనార్నగర్ నుంచి నవతెలంగాణ ప్రతినిధి
ఎన్నికలకు ముందు జాతీయస్థాయిలో ఎటువంటి కూటములు ఉండవని సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. కన్నూరులోని ఇకె నయ నార్ నగర్లో జరుగుతున్న సీపీఐ(ఎం) అఖిలభారత మహాసభ రెండవరోజైన గురువారం ఆయన ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో కన్నూరు జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి ఎంవి జయరాఘవన్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజలను మత ప్రాతిపది కన చీల్చి,పెనుభారాలు మోపుతున్న బీజేపీని ఒంటరిగా చేసి , ఓడించడమే తమ లక్ష్యమని చెప్పారు. విలేకరులు అడిగిన వివిధ ప్రశ్నలకు జవాబిస్తూ ఎన్నికలకు ముందే ఈ దిశలో కూటమి ఏర్పాటు కావడం ఆచరణలో సాధ్యం కాదని అన్నారు. దేశ చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు కూటములు, ఫ్రంట్లు ఏర్పాటు కాలేదని వివరించారు. మొరార్జిదేశారు నేతృత్వంలోని జనతా, విపి సింగ్, దేవగౌడ నేతృత్వాలలో ప్రభుత్వాలు ఏర్పడిన తీరును ఈ సందర్భంగా వివరించారు. 1998లో ఎన్నికల తరువాత ఏర్పడిన ఎన్డీఏ కారణంగానే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైందని గుర్తుచేశారు. లౌకిక వాదానికి బలంగా కట్టుబడి ఉండటం, లౌకిక తత్వ పరిరక్షణ కోసం రాజీలేని విధానాలను అవలంబించడం ద్వారానే దేశంలో బీజేపీని ఒంటరిగా చేయడం సాధ్యమవుతుందని చెప్పారు. లౌకిక తత్వ పరిరక్షణలో ఏ మాత్రం రాజీ పడినా మతోన్మాద శక్తులకే అది ఉపయోగపడుతుందన్నారు. హిజాబ్ వంటి వివాదాలను రెచ్చగొడుతూ ప్రజలను మతం ప్రాతిపదికన బీజేపీ చీల్చుతోందని, అదే సమయంలో వారిపై భారాలు మోపుతోందని చెప్పారు. కొద్దిరోజులుగా పెరుగుతున్న పెట్రో ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరలను ఆయన ప్రస్తావించారు.
ఎల్డీఎఫ్పై...
భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం, కార్మిక, రైతులతో పాటు ప్రజలందరి సమస్యల పరిష్కారానికి బీజేపీని ఒంటరిగా చేసి ఓడించడమే తమ లక్ష్యమని చెప్పా రు. దీనికోసం రాజకీయ ప్రక్రియలో సీపీఐ(ఎం)గా తమ జోక్యం మరింతగా పెరగాల్సి ఉందని అన్నారు. దేశ వ్యాప్తం గా బలపడాలని చెప్పారు. అదే సమయంలో ఇతర వామ పక్ష, ప్రజాతంత్ర శక్తులు కూడా బలోపేతం కావాల్సిఉందని చెప్పారు. ఆ విధంగా బలమైన వామపక్ష ప్రజాతంత్ర శక్తుల సంఘటన ఆవిర్భవించాల్సి ఉందన్నారు. దీనర్ధం ఇది రాజకీయ పార్టీలకు మాత్రమే పరిమితం కాదని ఆ విలువల కోసం పనిచేసే సంస్థలు, శక్తులు ఏవైనా ఈ సంఘటనలో భాగం కావచ్చని చెప్పారు. ప్రస్తుత పాలకవర్గాలు అమలుచేసే విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలతో కూడిన ప్రణాళికకు ఈ సంఘటన కట్టుబడి ఉండాలన్నారు. లౌకిక తత్వంతో కూడిన ప్రత్యామ్నాయ విధానాల అమలుతోనే బీజేపీని ఓడించటం సాధ్యమని చెప్పారు. ఈ ప్రక్రియ అంతా ఒకేసారి జరగాలని లేదని, ఒకదాని తరువాత ఒకటైనా జరగవచ్చని వివరించారు.
4,001 సవరణలు
ముసాయిదా రాజకీయ తీర్మానానికి మహాసభకు ముందే 4,001 సవరణలు వచ్చాయని తెలిపారు. తమ పార్టీ సంప్రదాయం ప్రకారం ఇప్పటికే ముసాయిదా తీర్మానం ప్రజలందరికి అందుబాటులో ఉంచామని,దానిని అధ్యయనం చేసిన పార్టీ శ్రేణులు ఈ సవరణలను ప్రతిపాదించాయని తెలిపారు. వీటిలో అధికభాగం సవరణలు తీర్మానంలో పేర్కొన్న అంశాలను మరింత బలోపేతం చేసేవని చెప్పారు. సవరణలతో పాటు ముసాయిదా తీర్మానాన్ని మహాసభలో ప్రవేశపెట్టామని, ప్రతినిధులు చర్చిస్తున్నారని చెప్పారు. మహాసభను జయప్రదం చేయాలని ఆకాంక్షిస్తూ 40దేశాల్లోని కమ్యూనిస్టు పార్టీలు సౌహార్ధ్ర సందేశాలను పంపాయని తెలిపారు. నూతన ఆర్థిక విధానాలను తిప్పికొట్టి, ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గ ప్రయోజనాలను పరిరక్షించడానికి ఈ తరహా ఐక్యత అవసరమన్నారు.
మరికొన్ని ప్రశ్నలు..సమాధానాలు
- కాంగ్రెస్ లేకుండా బీజేపీ ని ఓడించగలరా..?
నేనుగానీ, మా ముసాయిదా రాజకీయ తీర్మానం గానీ అలా చెప్పలేదు. లౌకికతత్వ పరిరక్షణకోసం రాజీ లేని విధానాలను అమలు చేయాలని చెప్పాం. అటువంటి విధానాలతోనే బీజేపీని ఒంటరిగా చేయగలమని అన్నాం.
- కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు కదా...?
లౌకికతత్వానికి కట్టుబడి ఉండాలని, కాంగ్రెస్ పార్టీ తన ఇంటిని చక్కదిద్దుకోవాలని అన్నాను. లౌకిక విలువలపై రాజీ పడితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూస్తున్నాం. కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు కూడా ఆ పార్టీలో ఉండటం లేదు. అందుకే ఇంటిని చక్కదిద్దుకోవాలని సూచించాం.
8కేరళ సీపీఐ(ఎం) నాయకులు కాంగ్రెస్‌తో ఎటువంటి రాజీ ఉండదని చెబుతున్నారు. మీరు భిన్నమైన సంకేతాలు ఇస్తున్నారు.
వారు ఇప్పటి పరిస్థితి గురించి మాట్లాడారు. మహాసభ సందర్భంగా లౌకికతత్వానికి ఎదుర వుతున్న సవాళ్ల గురించి సెమినార్‌కు కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించాం. దానికి వారు రాలేమన్నారు. దీనర్ధం ఏమిటి? లౌకికతత్వంపై వారి వైఖరిని ఎలా అర్ధం చేసుకోవాలి?
- సరిహద్దులో చైనా ఆక్రమణలపై మీ వైఖరేమిటి?
సరిహద్దులో ఏం జరుగుతోందో మా కన్నా ప్రధానమంత్రికే ఎక్కువ తెలుసు. అక్కడ పరిస్థితిపై ఆయన ఎందుకు మాట్లాడరు?
- కేరళ ప్రభుత్వం చేపట్టిన సిల్వర్‌లైన్ ప్రాజెక్టుపై రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. మీ పార్టీ వైఖరి ఏమిటి?
ప్రభుత్వ వ్యవహారాల్లో పార్టీ జోక్యం చేసుకోదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సిఉంది. ప్రాజెక్టు మీద వ్యక్తమవుతున్న అభిప్రాయాలను అవసరమైతే పార్టీ పరిశీలిస్తుంది.