Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు సంస్కృతిపై దాడి..దానిని ఎదుర్కొవాలి
- మోడీ ప్రభుత్వం మూఢత్వాన్ని ప్రమోట్ చేస్తోంది
- శాస్త్రీయ భావాలను ద్వంసం
- కేరళ సాహిత్య అకాడమీ కార్యదర్శి సచ్చితానందన్
సిహెచ్ కనరన్ నగర్ నుంచి నవతెలంగాణ ప్రతినిధి
సమాజ మార్పులో సాంస్కృతికోద్యమం కీలక పాత్ర పోషిస్తోందని కేేరళ సాహిత్య అకాడమీ కార్యదర్శి సచ్చితానందన్ పేర్కొన్నారు. దేశంలోని మోడీ ప్రభుత్వం మూఢత్వాన్ని ప్రోత్సహిస్తున్నదనీ, శాస్త్రీయ భావాలను ధ్వంసం చేస్తోందని విమర్శించారు. 23వ సీపీఐ(ఎం) అఖిల భారత మహాసభ సందర్భంగా కేరళలోని కన్నూర్‌లోని సిహెచ్ కనరన్ నగర్ (టౌన్ స్వ్యేర్)లో సంస్కృతిపై సదస్సు జరిగింది. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఎ బేబి అధ్యక్షత జరిగిన ఈ సదస్సులో సచ్చితానందన్ మాట్లాడుతూ సమాజ మార్పులో సాంస్కృతిక పోరాటం చాలా కీలకమని అన్నారు. ప్రజల సంస్కృతిని దెబ్బతీసి, ప్రజల అస్తిత్వంపై దాడికి కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. దేశంలో నేడు సంస్కృతిపై దాడి జరుగుతుందని, దాన్ని ఎదుర్కొనేందుకు అభ్యుదయ, హేతువాదులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపు ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ నియంత్రణలో నడుస్తోన్న మోడీ సర్కార్ పాఠ్యంశాల్లో మార్పులకు ఒడిగట్టిందని, మెజారిటిజం సంస్కృతిని జొప్పించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. హిందూత్వ భావాలు, మతోన్మాదాన్ని పెంచిపోషించే విధంగా పాఠ్యాంశాల రూపకల్పన జరుగుతుందని విమర్శించారు.
చరిత్రను తిరగరాసే కుట్ర జరుగుతుందని, దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. హిందూత్వాన్ని వ్యతిరేకించి, అభ్యుదయ, హేతువాదాన్ని వ్యాప్తి చేసినందుకే గోవింద్ పన్సారే, ఎంఎం కాల్బుర్గి, ధబోల్కర్, గౌరీ లంకేశ్ వంటి వారిని హత్య చేశారని అన్నారు. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఎ బేబి మాట్లాడుతూ ప్రపంచంలోని ఏ పోరాటం వెనకైనా సాంస్కృతిక ప్రచారం కీలక భూమిక పోషించందనేది మరిచిపోలేమన్నారు. దేశంలో అనేక మంది సంఘ సంస్కర్తలు చాలా త్యాగాలు చేశారని, సంస్కరణోద్యమాలు నడిపారని చెప్పారు. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ ప్రత్యేకత భిన్నత్వంపై దాడికి పూనుకుంటున్నారని విమర్శించారు.
''ఏం తినాలి, ఏ బట్ట కట్టుకోవాలి, ఎవరితో మాట్లాడాలి'' వంటి అంశాలను ముందుకు తెచ్చారని దుయ్యబట్టారు. నారాయణ గురు వంటి సంఘ సంస్కర్త కేరళలో కీలక పాత్ర పోహించారని అన్నారు. సీపీఐ(ఎం) ఎంపీ, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎస్ వెంకటేషన్ మాట్లాడుతూ సాహిత్యం, సాహితీ వేత్తలపై జరుగుతున్న దాడి, దేశ సాంస్కృతిక తిరోగమనాన్ని స్పష్టం చేస్తుందని అన్నారు. సాహిత్యమనేది ఉద్యమానికి ఒక గుండెకాయ వంటిదని పేర్కొన్నారు. సాహిత్యంపై దాడిని ప్రజా ఉద్యమంపై దాడిగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముకేష్, సాహితీ వేత్త ప్రభవర్మ తదితరులు పాల్గొన్నారు.