Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌరవప్రదమైన ఉపాధి కోసం ఉధృత పోరాటాలు : సీపీఐ(ఎం) మహాసభ తీర్మానం
కన్నూరు (కేరళ) నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని సీపీఐ(ఎం) అఖిలభారత మహాసభ డిమాండ్ చేసింది. నూతన ఆర్థిక విధానాలను తిప్పి కొట్టడం ద్వారా ప్రజాస్వామిక అభివృద్ధిలో భాగంగా గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలను పొందడానికి పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపు నిచ్చింది. ఈ మేరకు మహాసభ శుక్రవారం తీర్మానం చేసింది. తీర్మానాన్ని ఉమేశ్ ప్రవేశపెట్టగా, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు బలపరచారు. ఉపాధి హామీ చట్టం అమలులో భాగంగా పనిదినాలను 200 రోజులకు పెంచాలని, పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ చట్టాని అమలు చేయాలని డిమాండ్ చేసింది. కొన్ని సంవత్సరాలుగా దేశంలో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో పెరుగుతోందని తీర్మానంలో పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ మందగించడంతో పాటు, అస్తవ్యస్త జీఎస్టీ విధానం, పెద్దనోట్ల రద్దు వంటి నిర్ణయాలు ఉపాధి అవకాశాలను మరింత కుంగదీశాయని తీర్మానం పేర్కొంది. 'పిరియాడిక్ లేబర్ సర్వే లెక్కల ప్రకారం 2017-18 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే 2011-12 నుంచి 17-18 మధ్య నిరుద్యోగం తీవ్రంగా పెరిగింది.2011-12లో 2.2శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 2017-18 నాటికి 6.1 శాతానికి చేరుకుంది. ప్రస్తుత వారారంతపు సూచికల్లో 10శాతానికి దగ్గరగా నిరుద్యోగిత ఉంది' అని తీర్మానం తెలిపింది. మరోవైపు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి బదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని డీనోటిఫై చేస్తున్నాయని పేర్కొంది. ఈ పరిస్థితికి కారణమైన నూతన ఆర్థిక విధానాలను ప్రతిఘటించి, ప్రజాస్వామిక ప్రక్రియతో కూడిన అభివృద్ధికోసం ఉధృత పోరాటాలు చేయాలని మహాసభ పిలుపునిచ్చింది.