Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొరవడిన ముందస్తు ప్రణాళిక
అమరావతి : దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర విద్యుత్ డిమాండ్ ఏపీలో గురువారం 237 మిలియన్ యూనిట్ల(ఎంయు)కు చేరుకోగా అందులో 23.53 ఎంయుల విద్యుత్‌ను విద్యుత్ సంస్థలు కోత విధించాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో నామమాత్రపు కోతలే ఉన్నాయి. కేరళలో 0.5 ఎంయు, తెలంగాణలో 1.26ఎంయూ, కర్నాటకలో 1.36 ఎంయూ, తమిళనాడులో 2.01ఎంయూల చొప్పున ఆయా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా గురువారం 80 ఎంయుల విద్యుత్ కొరత ఉంది. అందులో 30 శాతం 23.53 ఎంయూల వరకు రాష్ట్రంలోనే కోతలు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలను అమలు చేస్తూ పునరుత్పాదక విద్యుత్‌పై ఆధారపడటం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏపీ ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు నిర్లక్ష్యం చేశాయనీ, అందువల్లే పరిస్థితి మిగిలిన రాష్ట్రాల కంటే తీవ్రంగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. థర్మల్ కేంద్రాల నిర్వహణకు అవసరమైన బొగ్గును నాలుగు నెలలకు సరిపడ ప్లాంట్లలో నిల్వ చేసుకోవాల్సి ఉంది. గతంలో కనీసం నెల రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు ఉండాలనే నిబంధనను ఇటీవల 15 రోజులకు మార్చారు. ప్రస్తుతం థర్మల్ కేంద్రాల్లో ఒకటిన్నర రోజుకు మాత్రమే బొగ్గు నిల్వలున్నాయి. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్ కొంటున్నామనే పేరుతో థర్మల్ కేంద్రాల నిర్వహణను పట్టించుకోకుండా పవర్ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశాయి. దీంతో థర్మల్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు నిల్వలను ఉంచలేక పోయాయి. ప్రయివేటుకు అప్పగించకుండా ఏపీజెన్కోనే నిర్వహిస్తే డిస్కంలకు ఆర్థికభారం ఉండదనీ, ప్రజలకు కూడా విద్యుత్ తక్కువ ధరకే లభిస్తుందని సూచిస్తున్నారు.