Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీం నిర్ణయం
ఢిల్లీ: ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల సత్వర విచారణపై భారత అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐతో పాటు ఇతర సంస్థలు దర్యాప్తు జరుపుతోన్న కేసులపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై ఏప్రిల్ 15 తర్వాత విచారణ జరిపేందుకు అంగీకరించింది. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై కేసులు భారీగా పెరిగిపోతున్నాయనీ.. వీటిపై తక్షణమే విచారణ జరపాలంటూ అమికస్ క్యూరీగా వ్యవహరిస్తోన్న విజరు హన్సారియా చేసిన అభ్యర్థనకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది.గడిచిన ఐదేండ్లలో దేశంలో 2వేల మందికిపైగా నేతలపై కేసులు పెండింగులో ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే అంశంపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై తక్షణమే విచారణ జరపాలని వీటికి అమికస్ క్యూరీగా వ్యవహరిస్తోన్న సీనియర్ న్యాయవాది విజరు హన్సారియా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి విన్నవించారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ఇప్పటికిప్పుడు సాధ్యం కాదనీ, ఏప్రిల్ 15 తర్వాత విచారణ చేస్తామని పేర్కొంది. ఆలోపు చట్టసభ సభ్యులపై విచారణ జరుపుతోన్న ప్రత్యేక న్యాయమూర్తులను బదిలీ చేయడంపై కొన్ని హైకోర్టులు చేస్తోన్న అభ్యర్థనలపై దరఖాస్తులను అనుమతిస్తామని తెలిపింది.
ప్రజాప్రతినిధులపై కేసులకు సంబంధించి దాఖలైన పిల్‌పై తక్షణ విచారణ చేపట్టాలంటూ విన్నవించిన అమికస్ క్యూరీ విజరు హన్సారియా.. ప్రస్తుతం పదవిలో ఉన్నవారితో పాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై నమోదవుతోన్న కేసుల సంఖ్యను సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. 'దేశవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులపై ప్రస్తుతం 4984 కేసులు పెండింగ్‌లో ఉండగా.. వాటిలో 1899 కేసులు ఐదేండ్లకు పైబడినవే. 2018 డిసెంబర్ నాటికి 4110 కేసులు ఉండగా.. 2020 అక్టోబర్ నాటికి అవి 4859కి పెరిగిపోయాయి. పార్లమెంట్‌తోపాటు శాసనసభల్లో నేర చరిత కలిగిన వ్యక్తులు ఎక్కువ సంఖ్యలో ఆక్రమిస్తున్నారని తాజా నివేదిక రుజువు చేస్తోంది. అందుకే పెండింగ్‌లో ఉన్న కేసుల తక్షణ పరిష్కారంతోపాటు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అని విజరు హన్సారియా సుప్రీం ధర్మాసనానికి వెల్లడించారు. దీంతో వీటిపై త్వరలోనే విచారణ ప్రారంభిస్తామని సుప్రీం కోర్టు వెల్లడించింది.