Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్మూకాశ్మీర్‌లో అందరం బాధితులమే.. అందులో మత ప్రసక్తి లేదు
- మా బాధను పంచుకోవడానికి బదులు మార్కెట్ చేసుకుంటున్నారు
- జమ్మూకాశ్మీర్ సీనియర్ నేత మహ్మద్ యూసఫ్ తరిగామి
- ప్రజలు భ్రమలను వీడుతున్నారు పోరాటాలకు సిద్ధమవుతున్నారు
కన్నూరు (కేరళ) నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
జమ్మూకాశ్మీర్ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరితో జాతీయ ఐక్యతకు తీవ్ర నష్టం జరుగుతున్నదని సీపీఐ(ఎం) జమ్మూకాశ్మీర్ సీనియర్ నేత మహ్మద్ యూసఫ్ తరిగామి విమర్శించారు. ప్రజలు భ్రమలను వీడుతున్నారని ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో అందరం బాధితులమేనని, అందులో మత ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తమ బాధను పంచుకోవడానికి బదులు, దాన్ని మార్కెట్ చేసుకుంటున్నారని విమర్శించారు. కేరళలోని కన్నూర్ (కామ్రేడ్ ఇకె నయనార్ నగర్)లో జరుగుతున్న సీపీఐ(ఎం) 23వ అఖిల భారత మహాసభకు హాజరైన మహ్మద్ యూసఫ్ తరిగామి నవతెలంగాణ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో జమ్మూకాశ్మీర్‌కు చెందిన వివిధ అంశాలపై పంచుకున్నారు.
ఆర్టికల్ 370, ఆర్టికల్ 35(ఏ) రద్దు, రాష్ట్ర విభజన, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటు తరువాత జమ్మూకాశ్మీర్, లఢఖ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి..?
రాజ్యాంగ ఉల్లంఘనతో రాష్ట్ర విభజన జరిగింది. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35(ఏ) రద్దుతో మా రాజ్యాంగ హక్కులు కాలరాశారు. దీంతో జమ్మూ కాశ్మీర్, కేంద్ర ప్రభుత్వం మధ్య సంబంధాలపై ప్రభావం పడింది. జమ్మూకాశ్మీర్ ప్రజల పట్ల వివక్షకు పాల్పడ్డారు. రాష్ట్ర విభజన చేసి, రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ అనడం దారుణం. ఎక్కడైనా కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఇక్కడ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. దాంతోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని కేంద్రంలోని బీజేపీ పెద్దలు ప్రచారం చేశారు. కానీ జమ్మూకాశ్మీర్‌ను చిన్నాభిన్నం చేశారే తప్ప, ఎటువంటి నిర్మాణాత్మక చర్యలు చేపట్టలేదు. పరిస్థితుల్లో మార్పులేమీ రాలేదు. తమ ప్రాథమిక హక్కులు ఉల్లంఘన, బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు ఐదు వేల ఏండ్ల చరిత్ర ఉన్న జమ్మూకాశ్మీర్‌ను, 200 ఏండ్ల చరిత్ర ఉన్న లఢఖ్, జమ్మూ కాశ్మీర్‌ను ఒక్క ఆదేశంతో చెరిపేశారు. రాష్ట్ర విభజన సందర్భంలో ఇటు ప్రజలతో, రాజకీయ పార్టీలతో ఎటువంటి చర్చలు చేపట్టలేదు. అటు పార్లమెంట్‌లోనూ చర్చ చేయలేదు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలా విభజనకు గురవ్వలేదు. సుదీర్ఘ చర్చలతోనే రాష్ట్రాల విభజన జరిగాయి. ఇక్కడ కూడా తమ పట్ల వివక్ష ప్రదర్శించారు. భారతదేశంలో అంతర్భాగం కావాలని నిలబడినందుకు ప్రాణాలను సైతం కోల్పోయం. ఉగ్రవాదానికి తాము బాధితులమయ్యాం. కానీ తమను నిందించి బీజేపీ ప్రచారం చేస్తున్నది. అయితే ఇప్పుడిప్పుడే దేశ ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ప్రజల్లో భ్రమలు పోయాయి. అభద్రత భావంతో ఉన్నారు. నాడు స్వాగతించిన లఢఖ్ ప్రజల్లో కొంత మంది... బీజేపీ నాటకాన్ని తెలుసుకున్నారు. తమ గుర్తింపును రద్దు చేసేందుకు, తమ సంస్కృతిపై దాడి చేసేందుకు జరిగే కుట్ర ఇప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆందోళనల్లో భాగస్వామ్యం అవుతున్నారు. అయితే రాష్ట్ర విభజన, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 (ఏ) రద్దులో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని సుప్రీంకోర్టులో సీపీఐ(ఎం)తో పాటు మరికొన్ని పార్టీలు పిటిషన్ దాఖలు చేశాయి. అవి విచారణ దశలో ఉన్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై మీ వైఖరేంటీ..?
రాష్ట్ర అసెంబ్లీ రద్దు అయి దాదాపు నాలుగేండ్లు అవుతున్నది. ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజన పేరుతో కేంద్ర ప్రభుత్వం నానాయాగీ చేస్తున్నది. అందులో కూడా మతం కార్డును ఉపయోగిస్తున్నది. ముస్లీం, హిందూ అనే విభజన తీసుకొస్తున్నది. అయితే మేం ఒక్కటే చెబుతున్నాం. నియోజకవర్గాల పునర్విభజన జనాభా లెక్కల ప్రకారం జరుగుతాయి. మేం కూడా అలానే చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం 2011 జనాభా లెక్కలే అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిగణనలోకి తీసుకొనే వివిధ కేటాయింపులు చేస్తున్నది. దాని ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిగణనలోకి తీసుకోవటం లేదు. పోనీ 2021 జనాభా లెక్కల ప్రకారమైనా నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. ఇప్పటి వరకు జనగణన చేపట్టలేదు. కానీ నియోజకవర్గాల పునర్విభజనకు ప్రభుత్వం పూనుకుంటున్నది. అందులో ఒక వర్గం పట్ల తీవ్రమైన వివక్షను ప్రదర్శిస్తున్నది. జమ్మూకు ఆరు, శ్రీనగర్‌కు రెండు స్థానాలు కేటాయించడమంటే, మత ప్రాతిపదికన నియోజక వర్గాల విభజన చేయడమే. దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపై కూడా న్యాయ పోరాటం చేస్తున్నాం.
బిజెపి దేశవ్యాప్తంగా కాశ్మీర్ ఫైల్స్ సినిమా నిజంగా వాస్తవాలకు దగ్గరగా ఉందా...?
కాశ్మీర్ ఫైల్స్ సినిమా దేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి పక్కదోవపట్టించటంలో భాగంగానే వచ్చింది. అందులో ఎటువంటి క్షేత్రస్థాయి పరిశీలన, పరిశోధన లేదు. జమ్మూకాశ్మీర్‌లో అన్ని మతాల వారు సమస్యలను
ఎదుర్కొన్నారు. కాశ్మీర్ పండిట్లకు జరిగిన దాన్ని ఎవరూ కించపరచలేదు. జరగలేదని చెప్పడం లేదు. తామంతా ఖండించాం. అయితే కాశ్మీర్లో అన్ని మతాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. తామంతా బాధితులం అయ్యాం. దేశం కోసం తమ కుటుంబ సభ్యులను కోల్పోయాం. వందలాది మంది పార్టీ కార్యకర్తలను కోల్పోయాం. కానీ మోడీ ప్రభుత్వం వచ్చి ఎనిమిదేండ్లు అవుతున్నది. ఈ ఎనిమిదేండ్లలో కాశ్మీర్ పండిట్లకు ఏం చేశారు. జమ్మూకాశ్మీర్‌లో హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు, బౌద్ధులు కలిసిమెలిసి ఉంటారు. ఈ అన్ని మతాలు కాశ్మీరీయత్ అనే సంస్కృతితో జీవనం సాగిస్తున్నాయి. అన్ని మతాల వారు బాధతో ఉన్నారు. మా బాధను పంచుకోవాలి. కానీ కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో తమ బాధను మార్కెట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం అన్ని ఇస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అందులో నిజమెంత ఉంది..?
రాజ్యాంగ బద్ధంగా తమకు రావాల్సినవే ఇవ్వటం లేదు. అలాంటప్పుడు అన్ని ఇస్తున్నామని ఎలా అంటారు. కేంద్ర ప్రభుత్వం చెప్పే మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండదు. అది జమ్మూ కాశ్మీర్‌కే వర్తించదు. దేశమొత్తం కూడా కేంద్ర చెప్పే మాటలకు, చేతలు ఆమడదూరంలో ఉంటాయి. కేంద్రం చెప్పేవన్ని అబాద్ధాలే.
ప్రజా సమస్యలపై కదలిక ఎలా ఉంది..?
రాష్ట్ర విభజన సందర్భంగా ఉద్యోగ కల్పన గురించి కేంద్ర పెద్దలు మాట్లాడారు. కానీ ఇప్పటికి ఎటువంటి ఉద్యోగ భర్తీలు జరగలేదు. పేదరికం, నిరుద్యోగం, భూ హక్కు, ఉద్యోగ హక్కు వంటి ప్రజా సమస్యలపై పోరాటానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. లఢఖ్‌లో బుద్ధిస్ట్ సంఘాలు, రాజకీయ పార్టీలు ఐక్యంగా రెండుసార్లు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ప్రజలు రాష్ట్ర హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాజకీయ నేతలపై ఈడీ, సీబీఐ, ఎన్ఐఏలతో పాటు ఇతర భద్రత సంబంధిత చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రయోగిస్తున్నది. నకిలీ కేసులను బనాయించి, బెదిరింపులకు పాల్పడుతుంది.