Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచంలోనే అధిక ధర
- హెచ్చు పెట్రో ధరల్లో మూడో స్థానం
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే ఎల్పీజీ గ్యాస్ ధర భారత్‌లోనే అత్యధికంగా ఉంది. ఆయా దేశాల ప్రజల కొనుగోలు శక్తి సమానత్వం (పర్చేజింగ్ పవర్ పారటి-పీపీపీ)తో విశ్లేషిస్తే లీటర్ గ్యాస్ ధర ఇక్కడే అధికం. ప్రపంచ దేశాల్లోనూ అధిక పెట్రోలియం ధరల్లోనూ భారత్ మూడో స్థానంలో ఉంది. హెచ్చు డీజిల్ ధరల్లో ఎనిమిదో దేశంగా ఉంది. అంతర్జాతీయ పరిణామాలతో ధరలు పెంచాల్సి వస్తోందని మోడీ సర్కార్ అనుకూల వర్గాలు ఊకదంపుడు ప్రకటనలు చేస్తున్నాయి. దేశాల వారిగా ప్రత్యేకమైన కరెన్సీలు ఉండగా.. ఆయా మార్కెట్లలో కొనుగోలు శక్తి భిన్నంగా ఉంది. ఆదే విధంగా ఆదాయ స్థాయిల్లో తీవ్ర అంతరాలు ఉన్నాయి. పశ్చిమ దేశాల్లో లీటర్ పెట్రోల్ ధర వారి రోజువారి ఆదాయాల్లో అత్యల్ప విలువ చేస్తుంది. సగటు భారతీయుడి రోజువారి ఆదాయంలో నాలుగో వంతుగా ఉంది. ఇక బురుండి దేశంలో రోజు వారి ఆదాయం కంటే పెట్రోల్ ధరనే ఎక్కువగా ఉంది.
భారత్‌లో లీటర్ పెట్రోల్ రూ.120గా ఉంది. దీన్ని అమెరికా కరెన్సీతో పోల్చితే 1.58 డాలర్లుగా ఉంటుంది. వాస్తవంగా భారత్‌తో పోల్చితే అమెరికాలో ఆ డాలర్‌తో కొనుగోలు చేస్తే ఏదైనా తక్కువగానే వస్తుంది. ఐఎంఎఫ్ పీపీపీ నగదు విశ్లేషణ గణంకాల ప్రకారం.. అమెరికాలో గడిచిన నెలలో కిలో ఆలు ధర 1.94 డాలర్లుగా ఉంది. దీన్ని భారత కరెన్సీలోకి మార్చితే రూ.147గా ఉంటుంది. ఇక్కడ దాదాపు ఏడు కిలోల ఆలు కొనుగోలు చేయవచ్చు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ డాలర్‌తో దేశీయ ధరలను పోల్చడానికి ఐఎంఎఫ్ పీపీపీని ఉపయోగిస్తుంది. దీంతో ఆయా దేశాల ప్రజల కొనుగోలు శక్తి సమానత్వం తెలుస్తోంది. పీపీపీతో పోల్చితే 2022లో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.22.6గా ఉంది. ఈ పద్దతిలోనే అంతర్జాతీయ మార్కెట్‌తో భారత పెట్రోల్ ధరలను పోల్చినప్పుడు ఇక్కడ లీటర్ ఇంధనానికి 5.2 డాలర్లను చెల్లించాల్సి వస్తుంది. సూడన్‌లో 8 డాలర్లుగా, లావోస్‌లో 5.6 డాలర్లు చెల్లిస్తున్నారు.కాగా 54 దేశాలతో పోల్చినప్పుడు భారత్‌లోనే ఎల్పీజీ ధరలు ఎక్కువగా ఉండటం గమనార్హం. లీటర్ గ్యాస్ ఇక్కడ 3.5 డాలర్లతో అత్యధిక ధర వసూలవుతోంది. భారత్ తర్వాత స్థానాల్లో టర్కీ ఫిజి, మొల్డొవ, ఉక్రెయిన్‌లో ధరలు ఎక్కువగా ఉన్నాయి. స్విజ్జర్లాండ్, ఫ్రాన్స్, కెనడా, బ్రిటన్ తదితర దేశాల్లో లీటర్ ఎల్పీజీ ధర కేవలం 1 డాలర్లుగా ఉంది. 156 దేశాలతో పోల్చినప్పుడు భారత్‌లో లీటర్ డీజిల్ ధర 4.6 డాలర్లతో ప్రపంచంలోనే అత్యధిక ధరల్లో ఎనిమిదో స్థానంలో ఉంది.
సూడన్‌లో అత్యధికంగా 7.7 డాలర్లుగా ఉంది. పశ్చిమ, దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలతోనూ పోల్చిన భారత్‌లోనే డీజిల్ అధిక ప్రియం. జీడీపీలో రోజు వారి తలసరి ఆదాయంతో విశ్లేషిస్తే అమెరికాలో లీటర్ పెట్రోల్ ధర 0.6 శాతంగా ఉండగా.. స్పెయిన్‌లో ఇది 2.2 శాతంగా నమోదవుతుంది. అదే భారత్‌లో సగటు వ్యక్తి ఆదాయంలో లీటర్ పెట్రోల్ ధర 23.5 శాతంగా ఉందంటే భారత్‌లో ఇంధన ధరలు ఏ స్థాయిలో మండుతున్నాయే స్పష్టమవుతోంది.