Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది దురదృష్టకరం : సీజేఐ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులను నిందించడం ప్రభుత్వం కొత్త ట్రెండ్ అనీ, ఇది ప్రస్తుతం నడుస్తున్నదని అన్నారు. ఈ తీరు దురదృష్టకరమని తెలిపారు. '' కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. జడ్జిలను అపఖ్యాతిపాలు చేయడాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇది దురదృష్టకరం'' అని సీజేఐ అన్నారు. '' కోర్టులో కూడా చూస్తున్నాం. ప్రస్తుత రోజుల్లో ఇది ఒక కొత్త ట్రెండ్. ఇలాంటివి గతంలో ప్రయివేటు పార్టీల విషయంలోనే చూసేవాళ్లం. ఇప్పుడు ప్రతి రోజూ చూస్తున్నాం'' అని రమణ చెప్పారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అమన్ సింగ్, ఆయన భార్య యాస్మిన్ సింగ్ లపై 2020లో అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ దాఖలైంది. దీనిని ఛత్తీస్గఢ్ హైకోర్టు గతంలో కొట్టేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సీజేఐ నేతృత్వంలోని న్యాయమూర్తులు కృష్ణ మరారి, హిమ కోహ్లి లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంలో రమణ పై విధంగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే, న్యాయస్థానాన్ని ఆగ్రహానికి గురి చేసిన విషయం స్పష్టంగా తెలియరాలేదు.