Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశభక్తులారా..కదలండి.. కాషాయపార్టీని వ్యతిరేకించండి
- కేరళ విధానాలు దేశానికి ఆదర్శం : విలేకరుల సమావేశంలో బృందాకరత్
ఇకె నయనార్ నగర్ నుంచి నవతెలంగాణ ప్రతినిధి
ప్రజలను మత ప్రాతిపదికన చీల్చి వారిపై భారాలు మోపుతున్న బీజేపీ ని ఓడించాల్సిందేనని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్ పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) అఖిలభారత 23వ మహాసభ మూడవ రోజైన శుక్రవారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజకీయ తీర్మానంపై చర్చల జరుగుతున్న తీరుతో పాటు వివిధ అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబిచ్చారు. బీజేపీని ఒంటరిగా చేసి,ఓడించడం ప్రతిఒక్క దేశభక్తుని కర్తవ్యమని ఆమె అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశ వ్యాప్తంగా ఉన్న లౌకిక, వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఒక వేదికపైకి రావాలన్నారు. బహుముఖ శక్తులతో కూడిన ఇటువంటి వేదికే (మల్టిపుల్ ఫోరం) బీజేపీకి, ఆ పార్టీ అనుసరించే మతతత్వ విధానాలకు ప్రత్యామ్నాయ మవుతుందని చెప్పారు. ఇది కూటమి (ఫ్రంట్) కాదని వేదిక (ఫోరం) అని ఆమె వివరించారు.
ఎల్డీఎఫ్ పాలన భేష్
కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శమని బృందాకరత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా, రాష్ట్రాల ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తూఉన్నా, హక్కులపై దాడులు చేస్తున్నా వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేసిందనీ, కరోనా వంటి కష్టకాలంలో ప్రజలకు అన్ని విధాల అండగా నిలిచిందని చెప్పారు. ఆ విధానాల ఫలితంగానే ప్రజలు గత ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారని అన్నారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శమనీ, వీటిని దేశమంతా ప్రచారం చేస్తామని చెప్పారు.
రాజకీయ తీర్మానంపై చర్చలు పూర్తి
అత్యంత కీలకమైన ముసాయిదా రాజకీయ తీర్మానంపై చర్చలు పూర్తయ్యాయని ఆమె చెప్పారు. తొలిరోజు చర్చల్లో 18 మంది ప్రతినిధులు పాల్గొనగా, రెండవ రోజు 17 మంది పాల్గొన్నారని వివరించారు. మహాసభకు ముందు వచ్చిన 4001 సవరణలు కాకుండా, మహాసభలో
ప్రతినిధులు 390 సవరణలు, 12 సూచనలు ఇచ్చారని తెలిపారు.
మరికొన్ని ప్రశ్నలు..సమాధానాలు
బీజేపీని ఓడించడంలో కాంగ్రెస్ పాత్రపై అయోమయం ఉన్నట్టుంది?
రాజకీయతీర్మానంలోగానీ, మా పార్టీలోగానీ ఎలాంటి అయోమయం లేదు. మతోన్మాదాన్ని వ్యతిరేకించడం, లౌకిక విలువల పరిరక్షణ వంటి అంశాల్లో ఎవరికైనా గందరగోళం ఉంటే వారు దానిని సరిదిద్దుకోవాలి.
బహుముఖ శక్తులతో వేదిక అంటున్నారు.. అది సాధ్యమవుతుందా?
వివిధ రకాల సమస్యలపై అనేక వేదికలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. రైతాంగ ఉద్యమంలో ఎన్ని రకాల శక్తులు, సంస్థలు భాగస్వామ్యమయ్యాయో చూశాం. బీజేపీకి ప్రతిఘటనఅనేది.. సీఏఏ వ్యతిరేక ఆందోళనతో ప్రారంభమైంది. దానిలోనూ బహుముఖ భాగస్వామ్యం ఉంది. దేశ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్న బీజేపీని ఏకాకిని చేసే పోరాటంలోనూ ఇటువంటి శక్తులన్నీ పాలుపంచుకోవాలి. లౌకిక తత్వాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ తరహా వేదిక అవసరం.
మీ వ్యూహంలో తృణమూల్, శివసేన వంటి పార్టీల పాత్ర ఏమిటి?
మీరు ఎన్నికల వరకే ఆలోచిస్తున్నారు. మేం అంతకన్నా ఎక్కువ విస్తృతంగా ఆలోచిస్తున్నాం. ఎన్నికల అంశానికే వస్తే బీజేపీ వ్యతిరేక ఓటు చీలకూడదని, ఆ వ్యతిరేక ఓటు గరిష్టంగా ఒకే చోట పోవాలన్నాది మా ఆలోచన. అయితే, భారత దేశం అంటేనే భిన్నత్వం. దీనిని ఎలా ఆచరణలోకి తేవాలన్నది ఎన్నికల సమయంలో ఏ రాష్ట్రానికి తగ్గట్టుగా ఆ రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. అంతిమంగా ప్రజలు గెలవాలనే కోరుకుంటాం.
కేరళలో చేపట్టిన సిల్వర్‌లైన్ ప్రాజెక్టుపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మాదిరి, పార్టీ ప్రధాన కార్యదర్శి మరో మాదిరి మాట్లాడుతున్నారు...?
సిల్వర్‌లైన్ ప్రాజెక్టుతో పాటు, కేరళకు సంబంధించిన ఏ అంశంపై కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలు లేవు. అందరిది ఒకేమాట. పర్యావరణాన్ని కాపాడుతూ, నిర్వాసితులకు గరిష్ట ప్రయోజనం కల్పించేలా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం ప్రకటించారు. నిజానికి బీజేపీ ప్రభుత్వం పర్యావరణ చట్టాన్ని మార్చడానికి ప్రయత్నించింది.బీజేపీ పాలిత రాష్ట్రాలు కీలకమైన పర్యావరణ ప్రభావ నివేదికను అవసరం లేదంటూ చట్టాలను చేశాయి.ఈ చర్యలను మీరు ప్రశ్నించాలి. కేరళ ప్రభుత్వం అలా చేయడం లేదు. పైగా కేరళ సమగ్రాభివృద్ధికి ఈ ప్రాజెక్టు అత్యవసరం. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా దీనిపై దుష్ప్రచారానికి దిగుతున్నాయి.